others

Dandora Review: దర్శక, నిర్మాతలకు ఆ విషయంలో హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

దేశం టెక్నికల్ పరంగా ఎంతో మారింది. కానీ కుల, మతాల విషయంలో ఇంకా ఇంకా వెనుకబడుతూనే ఉంది. మనిషి, పుట్టుక నుంచి చావు వరకూ అతనికిచ్చే మర్యాద కులాన్ని బట్టే.

Dandora Review: దర్శక, నిర్మాతలకు ఆ విషయంలో హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

చిత్రం: దండోరా

విడుదల: 25-12-2025

న‌టీన‌టులు: శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు

నిర్మాత‌: ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని

ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీకాంత్‌

సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి

ఎడిట‌ర్‌: సృజ‌న అడుసుమిల్లి

సంగీతం: మార్క్ కె.రాబిన్‌

దేశం టెక్నికల్ పరంగా ఎంతో మారింది. కానీ కుల, మతాల విషయంలో ఇంకా ఇంకా వెనుకబడుతూనే ఉంది. మనిషి, పుట్టుక నుంచి చావు వరకూ అతనికిచ్చే మర్యాద కులాన్ని బట్టే. చదువు మనిషిలో సంస్కారాన్నివ్వాలి కానీ.. అదే పాఠశాలల్లో, కళాశాలల్లో కులాల వారీగా విద్యార్థులు డివైడ్ అవుతున్నారు. చివరకు మనిషికి ఇచ్చే అంతిమ సంస్కారంలోనూ కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ అంశాన్ని బేస్ చేసుకుని రూపొందిన చిత్రమే ‘దండోరా’.

శివాజీ(శివాజీ) తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న తుళ్లూరు గ్రామానికి చెందిన ఒక రైతు. ఆర్ధికంగా స్థితిమంతుడేమి కాకున్నా.. అగ్రకుల అహంకారాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి. శివాజీకి కొడుకు విష్ణు(నందు), కూతురు సుజాత (మణిక) ఉన్నారు. విష్ణు హైదరాబాద్‌లో మున్సిపల్ ఆఫీస్‌లో జాబ్ చేస్తుంటారు. విష్ణుకి భార్య(మౌనిక రెడ్డి), తొమ్మిదివ తరగతి చదివే కూతురు ఉంటారు. శివాజీ, విష్ణు మధ్య మాటలుండవు. సుజాత, రవి(రవికృష్ణ) ప్రేమించుకుంటారు. మంచి మనసు గల రవి అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా డబ్బు, చదువు విషయంలో శివాజీ కుటుంబం కంటే రవి కుటుంబానికే ఎక్కువ పరపతి ఉంటుంది. శ్రీలత(బిందుమాధవి) వేశ్య వృత్తి చేసుకుంటూ ఉండే మహిళ. ఈ పాత్రలన్నింటి మధ్య జరిగే సంఘర్షణగా ఈ కథను దర్శకుడు మురళీ కాంత్ మలిచారు.

కథేంటంటే..

తుళ్లూరులో కుల జాడ్యం చాలా ఎక్కువ. తక్కువ కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి దహనం చేస్తుంటారు. అగ్ర కులానికిచెందిన శివాజీ మరణిస్తాడు. అయితే కుల పెద్దలు మాత్రం అతని అంత్యక్రియలు ఊరి శ్మశానంలో చేయడానికి వీల్లేదని కుల పెద్దలు తీర్మానిస్తారు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. అసలు శివాజీని అతడి కులమే ఎందుకు బహిష్కరించింది? శివాజీ, అతని కొడుకు విష్ణుకు మధ్య ఎందుకు మాటల్లేవు? శివాజీకి శ్రీలతతో ఉన్న సంబంధమేంటనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది.

ఎలా ఉందంటే?

సినిమా దర్శకులు ఎందుకోగానీ కుల వివక్షను హైలైట్ చేసేందుకు సాహసించరు. దీనికి కారణం సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాదన్న భయమే. ముందుగా ఆ భయాన్ని జయించి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 2004 - 2019 మధ్య కాలంలో ఈ కథంతా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా కుల గొడవలు, రవి-సుజాతల లవ్ స్టోరీ, అగ్రకులాల వారు మరణిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఫస్టాఫ్ అంతా వావ్ ఎలిమెంట్స్ లేకున్నా కూడా సినిమా ఆకట్టుకునేలానే నడుస్తోంది. ఎక్కడా బోర్ అనిపించదు. ఇక ఓ హత్యతో ఇంటర్వెల్ పడుతుంది. తొలిభాగంలో ఇదే హైలైట్. భావోద్వేగాలతో నిండిన సీన్. ఇక సెకండాఫ్ అంతా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కుల అసమానతల కారణంగా బాధిత కుటుంబాలు ఎంతటి ఆవేదనకు గురవుతాయనేది కళ్లకు కట్టేలా చూపించారు. ఇక సినిమాకు క్లైమాక్స్ కూడా ప్రాణమే. ఈ క్లైమాక్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది నవదీప్ గురించి. గ్రామ సర్పంచ్‌గా ఈ చిత్రంలో నటించిన నవదీప్.. క్లైమాక్స్‌ సీన్‌లో అదరగొట్టాడు.

టెక్నికల్, ఎవరెలా చేశారంటే..

ఈ సినిమాలో చెప్పుకోదగిన మైనస్‌లు అయితే ఏమీ లేవనే చెప్పాలి. టెక్నికల్ పరంగా సినిమా విషయానికి వస్తే.. రివర్స్ స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ‘దం.. దం.. దండోరా’ అంటూ మార్క్ కె.రాబిన్ సినిమాకు హైలైట్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. నటీనటుల నటన విషయానికి వస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివాజీ గురించి. ఆయనే ఈ సినిమాకు ప్రాణం. మంగపతిని మరపింపజేసేలా నటించారు. ఇక నందుకు కూడా మంచి పాత్ర లభించింది. ఆయన నటన కూడా చాలా బాగుంది. బిందు మాధవికి డబ్బింగ్ సెట్ అవలేదు కానీ ఆమె నటన, ఆమె పాత్రను మలచిన తీరు అన్నీ అద్భుతంగానే ఉన్నాయి. రవికృష్ణ క్యారెక్టర్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ నటన పరంగా ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా చేశారు.

ఫైనల్‌గా.. అకట్టుకున్న దం.. దం.. దండోరా

రేటింగ్: 3.5/5

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 25, 2025 4:20 AM