Biggboss9: సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్‌కు తెరదీసిన బిగ్‌బాస్.. వరస్ట్ స్ట్రాటజీ..
సంజన చేస్తున్న పనులు అంత చిరాకు తెప్పిస్తున్నాయి. మాట మాట్లాడితే దొంగతనాలు తప్ప ఆమె చేస్తున్నదేమీ లేదు. అదే స్ట్రాటజీని ఎంత కాలం కొనసాగిస్తుందో ఏమాత్రం అర్థం కావడం లేదు.

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు (Biggboss Season 9 Telugu) ఈ వారమైతే వరస్ట్ అని చెప్పాలి. దరిద్రంగా సాగుతున్న గేమ్‌కి ఏదో బిగ్‌బాస్ (Biggboss) నానా తంటాలు పడి ఒక హైప్ తెచ్చాడులే అనుకుంటే అంతలోనే వారమంతా టాస్కుల్లేవు.. ఏమీ లేవు. ఏదో ఒక చెట్టును బయట పెట్టేసి వాటికి పండ్లు పెట్టి గ్రీన్, బ్లాక్, రెడ్ అంటూ షో చేశారు. ఇక ఇప్పుడు రెడ్ వచ్చిన వారంతా కలిసి ఒకరిని హౌస్ (Biggboss House) నుంచి బయటకు పంపాలట. సరే.. నలుగురూ కలిసి సంజనాని బయటకు పంపించాలని నిర్ణయించారు. ఆమె కూడా పెద్దగా ఆర్గ్యూ ఏమీ చేయకుండానే బయటకు వెళ్లిపోయింది. ఇలా సడెన్‌గా బయటకు పంపడమంటే సీక్రెట్ రూమ్‌కి పంపడమేనని తెలియనంత అమాయకులు హౌస్‌మేట్స్ కారు.. అలాగే సంజన కూడా. ఒకరకంగా చెప్పాలంటే ముందు నుంచే సీక్రెట్ రూమ్ (Biggboss Secret Room) కాన్సెప్ట్ ఉందని బయట కూడా రచ్చవుతోంది.
వాళ్లకు ఆమాత్రం తెలియదా?
ఈ నేపథ్యంలో సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ పెడితే ఎవరికి ఇంట్రస్ట్ ఉంటుంది. దాని ద్వారా అసలు బిగ్‌బాస్ సాధించేదేమిటి? అందరూ గత సీజన్లన్నీ చూసేసి బాగా పండిపోయి వచ్చినవారే. వాళ్లకు ఆమాత్రం తెలియదా? ఈమాత్రం చోద్యానికి అర్జనుడి (Arjuna)ని కాదు.. కృష్ణుడిని కాదంటూ ఏవేవో డైలాగ్స్. ఒక వరస్ట్ గేమ్‌కి ఇన్నేసి బిల్డప్స్ అవసరమా? ఏదో భారీగా ప్లాన్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి తీరా చూస్తే కామెడీ స్కిట్స్‌తో టైమ్‌పాస్ చేయిస్తున్నాడు బిగ్‌బాస్. ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా? పోయిన వారమే కదా.. బిగ్‌బాస్ రేటింగ్స్ గురించి ఓ రేంజ్‌లో ఉన్నాయంటూ నాగార్జున (Akkineni Nagarjuna) చెప్పారు. ఈ వారం అంత ఉంటుందా? అనేది సందేహమే. ఇక సంజనాను సీక్రెట్ రూంలోకి కాదు.. అసలు ఎలిమినేట్ (Eliminate) చేసి బయటకు పంపిస్తేనే బాగుంటుంది.
దొంగతనాలు తప్ప చేస్తున్నదేం లేదు..
సంజన చేస్తున్న పనులు అంత చిరాకు తెప్పిస్తున్నాయి. మాట మాట్లాడితే దొంగతనాలు తప్ప ఆమె చేస్తున్నదేమీ లేదు. అదే స్ట్రాటజీని ఎంత కాలం కొనసాగిస్తుందో ఏమాత్రం అర్థం కావడం లేదు. ఆమె ఏదైనా ప్లాన్ చేసినా కూడా దొంగతనం చుట్టే ఆమె ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. పైగా సిగిరెట్స్ దాచేసి హ్యూమన్ ఎమోషన్స్‌తో ఆటాడుతోంది. వాస్తవానికి సుమన్ శెట్టి (Suman Shetty) స్మోక్ చేస్తారనే విషయం ఎక్కడా కూడా బిగ్‌బాస్ చూపించలేదు. ఈమె దొంగతనాల కారణంగా అతను రచ్చ అవుతున్నాడు. ఈమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తే ఈమె గురించి హౌస్‌మేట్స్ అంతా ఏదేదో మాట్లాడుకుంటారు. తద్వారా ఏదో కంటెంట్ రాబడదామని బిగ్‌బాస్ చూస్తున్నట్టున్నారు. కానీ అక్కడున్నదంతా ముదుర్లే. వారికి అవగాహన ఉంది. సంజనా ప్రస్తావనే తీసుకురాకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి బిగ్‌బాస్ టాస్క్‌ల ప్లానింగ్ టీం ఎవరైతే ఉన్నారో వారిని తీసేస్తే.. షో కొంచెం బాగుపడుతుందేమో..
ప్రజావాణి చీదిరాల