Scrub Typhus: ముంచుకొస్తున్న ముప్పు.. జ్వరం అని వదిలేశారో..
ప్రస్తుతం భారత్‌ను వేధిస్తున్న సమస్య స్క్రబ్ టైఫస్. భారత్‌లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలుసుకుందాం.
ప్రస్తుతం భారత్‌ను వేధిస్తున్న సమస్య స్క్రబ్ టైఫస్. భారత్‌లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలుసుకుందాం. పేను కంటే చిన్న పురుగు కుట్టడం వలన. ఇది గడ్డి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. పొదలు, అడవులు, దట్టమైన గడ్డి ప్రదేశాల్లో ఈ పురుగు ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు వ్యక్తిని కుట్టడం వలన ‘ఓరియెంటియా సుట్సుగముషి’ అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెంది తద్వారా స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి కారణంగా జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు ఆలస్యమైతే కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్‌లో కూడా తేడా వచ్చేస్తుంది. ఆలస్యమవుతున్నా కొద్దీ ఇది వ్యక్తి మృతికి కారణమవుతుంది.
వ్యాధి లక్షణాలతో మృతి..
‘స్క్రబ్ టైఫస్’కు సంబంధించి వైద్యులు ఇమ్యునో క్రోమటోగ్రఫిక్ టెస్ట్ (ICT) చేస్తారు. అందులో పాజిటివ్ అని తేలిందంటే స్క్రబ్ టైఫస్‌గా గుర్తించబడుతుంది. నాలుగు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి లక్షణాలతో మరణించడంతో దీనిపై ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం ఏటా దాదాపుగా పది లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. జ్వరం వచ్చిన వెంటనే నిర్వహించే టెస్టులతో పాటు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. గతంలో అయితే గ్రామాల్లోనే ఈ కేసులు కనిపించేవి. ఇప్పుడు పట్టణాల్లోనూ కేసులు కనిపిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

వ్యాధి నిర్ధారణకు..
ఈ వ్యాధి సోకినప్పుడు తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలుంటాయి. కానీ సరైన సమయంలో గుర్తించకుంటే మాత్రం అవయవాల పనితీరును దెబ్బతీసి ప్రాణాలకే ప్రమాదంగా పరిణమిస్తుంది. కొద్దిమందిలో ఇది సిగిరెట్‌తో కాల్చితే ఎలా మచ్చ పడుతుందో అలాంటి మచ్చే ఏర్పడుతుంది. ఈ మచ్చ అనేది ముఖ్యంగా తొడలు, బాహువులు, మెడ, జననేంద్రియ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అందరిలో ఈ మచ్చ కనిపించాలని లేదు. కొందరిలో అసలు కనిపించదు. వ్యాధి నిర్ధారణకు సీఆర్‌పీ టెస్ట్ చేయించాలి. ఈ జబ్బును నిర్ధారించేందుకు మరో టెస్ట్ కూడా నిర్వహిస్తారు. అదే ఇమ్యునో క్రోమటోగ్రఫిక్ టెస్ట్ (ఐసీటీ). అత్యంత విశ్వనీయ పరీక్ష.. అలాగే అన్ని చోట్ల అందుబాటులో ఉండే పరీక్ష యాంటీబాడీ ఎలీసా.
చికిత్స అందిస్తే..
పొద పురుగు కుట్టిన 7-10 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు వ్యక్తిలో కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు పరీక్షల్లో ఫాల్స్ టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది. దానికి మందులు వాడి అసలు వ్యాధిని మరిస్తే ఇబ్బందికరంగా మారుతుంది. దాదాపు వారం రోజుల్లో వ్యాధి అన్ని అవయవాలపై ప్రభావం చూపి గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు, ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు గర్భిణిల్లో ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సకాలంలో ఈ జబ్బును గుర్తించి చికిత్స అందిస్తే.. త్వరగా తగ్గిపోతుంది. పిల్లలు, గర్భిణులకు అయితే అజిత్రోమైసిన్ ఐదు రోజులు పాటు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. మిగిలిన వారికి డాక్సీసైక్లిన్ వారం రోజులు ఇవ్వాలట. ఆలస్యమైతే మాత్రం యాంటీ బయాటిక్స్ కూడా పనిచేయవని వైద్యులు చెబుతున్నారు.