హైదరాబాద్‌లో డిజిటల్ మార్కెటింగ్, ఏఐపై జాతీయ సదస్సు
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ni-msme) క్యాంపస్‌లో మార్చి 12, 13 తేదీలలో ఈ సదస్సు జరుగనుంది.
‘డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఆటోమేషన్ అండ్ ఈ-కామర్స్’ అంశంపై జాతీయ స్థాయి సదస్సు హైదరాబాద్‌లో జరుగనుంది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ni-msme) క్యాంపస్‌లో మార్చి 12, 13 తేదీలలో ఈ సదస్సు జరుగనుంది. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈల డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
డిజిటల్ నైపుణ్యాల పెంపుదల
దేశ జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 30 శాతంగా ఉంది. అయినా కూడా ఏఐ ఆధారిత మార్కెటింగ్, ఆటోమేషన్ వినియోగంలో ఇంకా అవగాహన లోపం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే సదస్సు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సోషల్ మీడియా ట్రెండ్స్, ఏఐ కంటెంట్ క్రియేషన్, కస్టమర్ సైకాలజీ మరియు బ్రాండింగ్ వంటి అంశాలపై నిపుణులు సమగ్రంగా వివరిస్తారు.
ప్రభుత్వ ప్లాట్‌ఫార్మ్స్‌పై అవగాహన
ఈ సదస్సులో భాగంగా జీఈఎం, ఓఎన్‌డీసీ, టీఆర్ఈడీఎస్ వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగంపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దీంతో పాటు స్టార్టప్ లాంచ్, గో-టు-మార్కెట్ వ్యూహాలు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై పరిశ్రమల నిపుణులు ప్రసంగిస్తారు.
భాగస్వామ్యాలకు వేదిక
ఈ సదస్సులో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, విద్యార్థులు,పరిశోధకులు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇది కేవలం శిక్షణకే పరిమితం కాదు. పరిశ్రమల మధ్య నెట్‌వర్కింగ్, జ్ఞాన వినిమయం, కొత్త వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటుకు ఇదొక వేదిక కానుంది.
రిజిస్ట్రేషన్ వివరాలు
సదస్సుకు సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ https://www.nimsme.gov.in/surl/he0v
సదస్సుకు హాజరు కావాలనుకునే వారు మార్చి 9 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 లోపు రిజిస్టర్ చేసుకునే వారికి 'ఎర్లీ బర్డ్' ఫీజు రూ. 1,200 కాగా, అనంతరం రూ. 2,000గా ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సీట్లు పరిమితం కాబట్టి ఆసక్తి ఉన్న వారు ముందుగానే నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.