Jeffrey Epstein: ఎప్‌స్టీన్ సెక్స్ రాకెట్ మాదిరిగానే.. సెన్సేషన్‌గా ఎప్‌స్టీన్ మరణం
ఎప్‌స్టీన్ సెక్స్ రాకెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. సోషల్ మీడియా అంతా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న న్యూస్ ఇది. ప్రతి ఒక్కరినీ ఈ న్యూస్ కదిలిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఎప్‌స్టీన్ (Jeffrey Epstein).
ఎప్‌స్టీన్ సెక్స్ రాకెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. సోషల్ మీడియా అంతా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న న్యూస్ ఇది. ప్రతి ఒక్కరినీ ఈ న్యూస్ కదిలిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఎప్‌స్టీన్ (Jeffrey Epstein). ఆయన మరణం కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. 2019 ఆగస్టు 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో మాన్‌హట్టన్ జైల్లో మృతి చెందాడు. ప్రస్తుతం దీని గురించి కూడా వివాదం నడుస్తోంది. అదేంటంటే.. ఎప్‌స్టీన్ మరణ ప్రకటన అనేది ఒకరోజు ముందుగానే తయారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా న్యాయశాఖ తాజాగా కొన్ని ఫైళ్లను విడుదల చేసింది. ఆ ఫైళ్లలో ఎప్‌స్టీన్ మరణ తేదీ ఆగస్టు 9గా ఉండటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎప్‌స్టీన్ తన జైలు గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఆ ప్రకటన విడుదలైన నాటి నుంచే ఎప్‌స్టీన్ మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. దీనికి కారణం ఆగస్టు 9 నాటి సీసీటీవీ ఫుటేజ్. ఆ రోజు రాత్రి 10.30 గంటల సమయంలో ఆరెంజ్ రంగు దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఎప్‌స్టీన్ జైలు గదివైపు కదులుతున్నట్టుగా కొన్ని సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
కొత్తగా విడుదలైన రికార్డుల్లో ఆ కదులుతున్న వ్యక్తిని ఖైదీ కావొచ్చని పేర్కొనడం జరిగింది. కానీ న్యాయశాఖ మాత్రం అతడు జైలు అధికారి అని చెబుతోంది. కాగా.. ఎప్‌స్టీన్ చనిపోయాడని గుర్తించిన తర్వాత తీసిన ఫొటోలను సైతం తాజాగా విడుదల చేశారు. వాటిలో ఓ ఫోటో పలు అనుమానాలకు తావిస్తోంది. ఎప్‌స్టీన్ మరణించాడని గుర్తించిన 16 నిమిషాల తర్వాత స్ట్రెచర్‌పై ఉన్న అతడిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్టుగా ఓ చిత్రంలో కనిపించింది. అది మాత్రమే కాదు.. ఎప్‌స్టీన్ మృతిని ఆసుపత్రిలో ధ్రువీకరించిన తర్వాత తీసిన ఫొటోల్లో అతని పేరును తప్పుగా రాయడం సైతం పలు అనుమానాలకు తావిస్తోంది.