Vodafone Idea: ఆ ఒక్క మాటతో అమాంతం పెరిగిన ఐడియా షేర్స్..
షేర్ మార్కెట్‌లో ఏదేని ఒక్క ప్రకటన చాలు.. ఆ స్టాక్‌ని అమాంతం పైకి లేపడానికి లేదంటే పాతాళానికి తొక్కేయడానికి.. ఇక్కడ కూడా ప్రభుత్వం చెప్పిన ఒకే ఒక్క మాటతో వొడాఫోన్ ఐడియా షేర్లు అమాంతం పెరిగాయి.

షేర్ మార్కెట్ (Share Market)లో ఏదేని ఒక్క ప్రకటన చాలు.. ఆ స్టాక్ (Stock)ని అమాంతం పైకి లేపడానికి లేదంటే పాతాళానికి తొక్కేయడానికి.. ఇక్కడ కూడా ప్రభుత్వం చెప్పిన ఒకే ఒక్క మాటతో వొడాఫోన్ ఐడియా షేర్లు (Vodafone Idea Shares) అమాంతం పెరిగాయి. తాజాగా ఏజీఆర్ (AGR) బకాయిలకు సంబంధించి వొడాఫోన్ ఐడియా ((Vodafone Idea) టెలికాం కంపెనీ చేసిన విజ్ఞప్తికి తామేమీ వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు (Supreme Court)కు ప్రభుత్వం తెలియజేయడంతో ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు 10 శాతం పెరిగాయి. ఇవాళ (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12:33 గంటలకు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (Vodafone Idea Ltd) షేర్లు రూ.0.75 లేదా 9.57% పెరిగి రూ.8.59 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ స్టాక్ రూ.7.91 వద్ద ప్రారంభమై.. సెషన్‌లో రూ.8.71 గరిష్ట స్థాయిని.. రూ.7.81 కనిష్ట స్థాయిని టచ్ చేసింది. దీని 52 వారాల గరిష్ట స్థాయి రూ.13.02 కాగా.. 52 వారాల కనిష్ట స్థాయి వచ్చేసి.. రూ.6.12.
టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) నుంచి అదనపు ఏజీఆర్ డిమాండ్లకు సంబంధించి వొడాఫోన్ ఐడియా కేసును సుప్రీంకోర్టు సెప్టెంబర్ 26న సమీక్షించనుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వొడాఫోన్ ఐడియాలో 49% ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో కోర్టు వొడాఫోన్ ఐడియాకు కొంత ఉపశమనం కల్పించింది. ప్రభుత్వానికి వీఐ (VI) కంపెనీ సుమారు రూ. 83,400 కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. మార్చి నుంచి రూ.18 వేల కోట్ల వార్షిక చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఇవి జరిమానాలు, వడ్డీతో కలిపి మొత్తంగా దాదాపు రూ. 2 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. వీఐ కంపెనీపై ఆర్థిక భారం పెరగడం వలన 18 వేలకు మందికి పైగా ఉద్యోగులకు ఇది ఇబ్బందికరంగా మారనుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం రూ.53,000 కోట్లకు పైగా బకాయిలను ఈక్విటీగా మార్చడంతో ఆ కంపెనీకి తాత్కాలిక ఉపశమనం లభించింది.