Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవ దహనం
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ (గురువారం) ఉదయం 6-6.30 గంటల మధ్య రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి.
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ (గురువారం) ఉదయం 6-6.30 గంటల మధ్య రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బస్సుతో పాటు టిప్పర్‌లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులోని 10 మంది ప్రయాణికులు సజీవ దహనమవగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ప్రమాదంతో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బస్సు 20 మందికి పైగా ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం. బస్సు ముందు భాగంలో ఉన్నవారు చకచకా దూకేశారు. కానీ వెనుక భాగంలో ఉన్నవారు మాత్రం బయటకు రాలేక మృతిచెందినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్న సుమారు 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. మృతుల్లో కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఉండొచ్చని భావిస్తున్నారు.