others

E Vitara Price: ఈ-విటారా ధర, ఫీచర్స్ ఇవే..

గుజరాత్ హన్సల్‌పూర్‌లో మోదీ.. మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను నేడు (మంగళవారం) విడుదల చేశారు. భారత్‌లో తయారైన ఈ కారు 100 దేశాలకు పైగా ఎగుమతి కానుండటం విశేషం.

E Vitara Price: ఈ-విటారా ధర, ఫీచర్స్ ఇవే..

మేక్ ఇన్ ఇండియా (Make In India)లో భాగంగా భారత్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. భారత చరిత్రలోనే ఎన్నడూ లేనిది.. ఏకంగా ఒక కారు లాంచింగ్ కోసం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) రంగంలోకి దిగారు. స్వదేశీ ఉత్పత్తులను మెరుగుపరచాలనే భావనతో సుజుకి మోటార్ (Suzuki Motar) హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌లను ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్‌ను మోదీ ప్రారంభించారు. అనంతరం ఈ కంపెనీకి చెందిన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఈ విటారా (E Vitara)’ను ప్రారంభించారు. గుజరాత్ హన్సల్‌పూర్‌లో మోదీ (Modi).. మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను నేడు (మంగళవారం) విడుదల చేశారు. భారత్‌లో తయారైన ఈ కారు 100 దేశాలకు పైగా ఎగుమతి కానుండటం విశేషం. దీని ప్రాముఖ్యత, ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఈ విటారా ధర (E Vitara Price) విషయానికి వస్తే రూ. 17- 22 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ కారు సెప్టెంబర్ తొలి వారంలో మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ (EV)కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నాయి. టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఈవీ మార్కెట్‌లోకి రానుండగా.. వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ విటారా సిద్ధమవుతోంది. ఇక మోదీ ప్రారంభించిన సుజుకి కొత్త ఫెసిలిటీలో వివిధ భాగాలను ఉత్పత్తి చేయనున్నారు. ప్లాంట్ లిథియం-అయాన్ బ్యాటరీలకు అవసరమైన 80 శాతానికి పైగా భాగాలను ఉత్పత్తి చేయనున్నారు. దీని కారణంగా దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరముండదు. వాస్తవానికి మారుతి సుజుకి ఈ విటారాను గత ఏడాది చివరిలోనే యూరప్‌ (Europe)లో ప్రవేశపెట్టారు.

ఆ తరువాత ఈ విటరా ఈ ఏడాది మన దేశంలో జరిగిన మొబిలిటీ షోలో కనిపించింది. ఇక ఈ విటారా ఫీచర్స్ విషయానికి వస్తే.. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో పాటు ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఆటో-హోల్డ్ ఫంక్షన్‌, స్పోక్ స్టరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఒక్కసారి దీనిని చార్జ్ చేస్తే 500 కి.మీ వెళ్లవచ్చు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 26, 2025 9:54 AM