Food delivery companies vs Hotel Owners: స్విగ్గీ, జొమాటోలకు చెక్?
హోటల్ యజమానులు మాత్రం ఫుడ్ డెలివరీ సంస్థలు మాత్రం నష్టాలను భరించలేమంటూ తిరుగుబాటుకు దిగారు. ఈ క్రమంలోనే స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) వంటి సంస్థలకు చెక్ పెడుతున్నారా? నెక్ట్స్ ఏంటి?

ప్రస్తుత తరుణంలో అంతా బిజీ లైఫ్ గడిపేస్తున్నారు. వంట చేసుకునే సమయం కూడా ఉండటం లేదు. బ్యాచ్‌లర్స్‌తో పాటు కుటుంబాలు సైతం దాదాపుగా ఫుడ్ డెలివరీ సంస్థలపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ సంస్థలు (Food delivery companies) అటు హోటల్ యజమానుల (Hotel Owners)ను ఇటు కస్టమర్లను ఎడాపెడా దోచేస్తున్నారు. కస్టమర్ల (Customers)కు అంటే తప్పదు కానీ హోటల్ యజమానులు మాత్రం ఫుడ్ డెలివరీ సంస్థలు మాత్రం నష్టాలను భరించలేమంటూ తిరుగుబాటుకు దిగారు. ఈ క్రమంలోనే స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) వంటి సంస్థలకు చెక్ పెడుతున్నారా? నెక్ట్స్ ఏంటి? వంటి అంశాలను చూద్దాం.
అమ్మో.. స్విగ్గీ, జొమాటో లేకుంటే పరిస్థితేంటి? రోజు గడుస్తుందా? అన్నట్టుగా ఉంది చాలా మంది పరిస్థితి. ఈ తరుణంలోనే హోటల్ యజమానులు అధిక లాభాల్ని ఆశిస్తూ తమను నష్టాలకు గురి చేస్తున్నారంటూ ఫుడ్ డెలివరీ సంస్థలపై తిరుగుబాటుకు దిగారు. అంతేకాదు.. జొమాటో, స్విగ్గీ వంటి పెద్ద కంపెనీలకు చెక్ పెడుతున్నట్టు వెల్లడించారు. ఇక ఇది ఎక్కడంటారా? మన తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కాదులెండి.. తమిళనాడు (Tamilnadu)లో.. ఇక్కడ పలు చోట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలపై ఒక ఉద్యమం అయితే ప్రారంభమైంది. రానున్న రోజుల్లో రాష్ట్ర మొత్తం వ్యాపిస్తుందని అంటున్నారు. తొలుత తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం.. ప్రస్తుతం కడలూరు జిల్లాకు వ్యాపించింది. మరికొన్ని జిల్లాల్లో సైతం ఈ రెండు రాష్ట్రాల స్ఫూర్తితో హోటల్ యజమానుల సంఘాలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఏకపక్షంగా డిస్కౌంట్లు..
స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్ (Food Delivery Apps)లు భారీ మొత్తంలో కమిషన్లు తీసుకుంటూ తమను నట్టేట ముంచుతున్నాయని హోటల్ యజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఏకపక్షంగా డిస్కౌంట్లు ప్రకటిస్తూ తమను ఇబ్బందులపాలు చేస్తున్నాయని అంటున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు తమ స్వప్రయోజనాల కోసం తమ మనుగడకే ప్రమాదం సృష్టిస్తున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా స్పందన అయితే రావడం లేదని అంటున్నారు. దీంతో ఆయా సంస్థలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. పెద్ద డెలివరీ యాప్‌లు కమీషన్ల (Commissions)నే 30-35 శాతం వసూలు చేస్తూ.. పైగా తమ నుంచి జీఎస్టీ (GST)లను సైతం బాదుతున్నాయని ఆవేదన చెందుతున్నాయి. నైపుణ్యత కలిగిన వంట మాస్టర్ల.. హోటల్ నిర్వహణ ఖర్చులకు తోడు ఇంత కమీషన్లు, జీఎస్టీలను చెల్లించాల్సి రావడంతో నష్టాల పాలవ్వాల్సి వస్తుందట. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లకు చెక్ పెట్టి.. ‘జారోజ్’ (Zaroz) వంటి యాప్‌లకు ఆహ్వానం పలుకుతున్నాయి.
‘రీజోయ్’ పేరుతో..
ఇది ఇప్పటికే కేరళ (Kerala)లో సైతం కొనసాగుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లను బహిష్కరిస్తున్నాయి. ఇది ఇప్పుడు కాదు.. కేరళలో 2021లోనే ప్రారంభమైంది. ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు వసూలు చేస్తున్న భారీ కమీషన్లను వ్యతిరేకిస్తూ కొచ్చిలోని కొన్ని హోటళ్ల యజమానులు సొంతంగా యాప్‌లను రూపొందించుకోవడం ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (Kerala Hotel and Restaurant Association) స్వతహాగా ‘రీజోయ్’ (Rejoy) పేరుతో డెలివరీ యాప్‌ను తీసుకొచ్చాయి. ఈ ఉద్యమం తెలుగు రాష్ట్రాలకు ఆమాటకొస్తే దేశవ్యాప్తంగా పాకే అవకాశం లేకపోలేదు. పెద్ద ఫుడ్ డెలివరీ సంస్థలు కమీషన్ల కక్కుర్తిని తగ్గించుకోకపోతే ఇక మీదట కష్టమేనని అంతా భావిస్తున్నారు.