సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించిన స్టోరీ ‘ధర్మస్థల’
మన దేశంలో శాస్త్రవేత్తలకు సైతం అందని మిస్టరీ ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ ఆలయం చుట్టూ ఏదైనా మానవమాత్రులు జరుపుతున్న మిస్టరీ ఉంటే?

మన దేశంలో శాస్త్రవేత్తలకు సైతం అందని మిస్టరీ ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ ఆలయం చుట్టూ ఏదైనా మానవమాత్రులు జరుపుతున్న మిస్టరీ ఉంటే? ఒకప్పుడు టీవీలో రహస్యం అనే సీరియల్ వచ్చింది. దేవాలయం చుట్టూ మానవులు నడిపించే మిస్టరీకి సంబంధించి ఉంటుంది. ప్రస్తుతం సరిగ్గా అలాంటి మిస్టరీయే కాకున్నా.. ఓ దేవాలయం విషయంలో ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. దేశం మొత్తం చర్చించుకునేలా చేశాయి. అదే ధర్మస్థల. సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తి అక్కడ 15 ఏళ్లకు పైగా పని చేసిన శానిటరీ వర్కర్.. రోజుకో ట్విస్ట్‌తో కాకపుట్టించిందీ కేసు.
కర్ణాటకలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమే ధర్మస్థల (Dharmastala). ఇక్కడ మంజునాథుడు (Lord Manjunatha) కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శానిటరీ వర్కర్‌గా పని చేసిన భీమా. తాను పని చేస్తున్న సమయంలో వందల కొద్దీ అమ్మాయిల శవాలను పూడ్చిపెట్టానని.. అవన్నీ లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలవేనంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతను ధర్మస్థలలో పనిచేసింది 1998-2014 మధ్యలో.. మరి ఇంత కాలం తర్వాత ఫిర్యాదేంటి? అని అడిగితే కూడా గతంలో తాను ఫిర్యాదు చేసేందుకు సాహసించగా తనను చితకబాదారని.. తన ఇంట్లోని ఒక చిన్నారిని లైంగిక వేధింపులకు గురి చేశారని చెప్పుకొచ్చాడు. దీంతో తాను దూరంగా వెళ్లిపోయానంటూ చెప్పుకొచ్చాడు. ఒక సాధారణ వ్యక్తి.. అందునా చేసింది చిన్న ఆరోపణేమీ కాదు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. అతను చెప్పిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించగా.. ఒక్కచోట మినహా శవాల ఆనవాళ్లేమీ కనిపించలేదు. అది కూడా లైంగిక వేధింపులకు పాల్పడిన వారి అమ్మాయిలవి కాదని విచారణలో తేలింది.
చివరకు తేలిందేంటంటే..
కట్ చేస్తే.. భీమా మాట మార్చాడు. తను చెప్పినవన్నీ అబద్ధాలేనని.. తనను అలా చెప్పేందుకు ఎవరో ప్రేరేపించారంటూ మాట మార్చాడు. అక్కడి నుంచి భీమా రోజుకో ట్విస్ట్ ఇస్తూ వచ్చాడు. తన ముసుగును చివరకు తొలగించాడు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వం, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు అతడిని అరెస్టు చేశారు. ఒక రాత్రంతా బీమాను సిట్ అధికారులు విచారించారు. చివరకు తేలిందేంటంటే.. కట్టుకథలతో బీమా అందరినీ ఆందోళనకు గురిచేశాడని.. సిట్ తేల్చింది. ఇవాళ (శనివారం) బీమాను కోర్టులో హాజరుపరిచారు. ధర్మస్థల కేసులో బెంగుళూరుకు చెందిన సుజాత భట్ అనే మహిళ సైతం తన కూతురు 2003లో ధర్మస్థలకు వెళ్లి తిరిగి రాలేదంటూ చెప్పినదంతా అబద్ధమని పోలీసులు తేల్చారు. ఈ విషయాన్ని సుజాత కూడా అంగీకరించడంతో పోలీసులు ఆమెను సైతం అరెస్ట్ చేశారు. ఇక బీమా పేరు సీఎన్ అలియాస్ చిన్నా అని.. అతడి ఫోటోను సైతం రివీల్ చేశారు.
అంత సాహసమా?
ఇన్ని విషయాలను తేల్చిన పోలీసులు.. అసలు బీమా అలియాస్ చిన్నా ఎందుకు అంత సాహసానికి ఒడిగట్టాడో తేల్చారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. వాస్తవానికి ఇలాంటి ఆరోపణ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనేది బీమా ఆలోచించే ఉంటాడు కదా. మరెందుకు ఇంత పెద్ద ఆరోపణ ఎందుకు చేశాడనేది ఇప్పటికీ అంతుబట్టని విషయమే.. మొత్తానికి సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించిన స్టోరీ ‘ధర్మస్థల’.