others

D/O Prasad Rao Kanabadutaledhu Review: వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే..

జాగ్రత్తకు.. భయానికి తేడా చాలా చిన్నది. ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు.. ఎలాంటి సమస్యనైనా జయించగల ధైర్యంతో.. ప్రతి ఆడపిల్లా తన తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోగలగాలి.

D/O Prasad Rao Kanabadutaledhu Review: వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే..

వెబ్‌సిరీస్: డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు

స్ట్రీమింగ్: 27-02-2026

దర్శకుడు: కృష్ణ పోలూరు

నిర్మాత : కేవీ శ్రీరామ్

ప్రస్తుత తరుణంలో సినిమాలతో సమానంగా.. ఒకరకంగా చెప్పాలంటే అంతకుమించిన క్రేజ్ వెబ్ సిరీస్‌లకు ఉంది. అయితే చాలా వరకూ అవి ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉండటం లేదు. నేటి (ఫిబ్రవరి 27) నుంచి జీ5లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ అనే టైటిల్‌తో ఒక వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. కనబడుటలేదు అనేది దీని ట్యాగ్‌లైన్. టైటిల్ చూస్తేనే ఇది ఫ్యామిలీ మొత్తం చూడగలిగే వెబ్ సిరీస్ అని అర్థమవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా.. లేదా? చూద్దాం.

వెబ్ సిరీస్ కథేంటంటే..

జాగ్రత్తకు.. భయానికి తేడా చాలా చిన్నది. ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు.. ఎలాంటి సమస్యనైనా జయించగల ధైర్యంతో.. ప్రతి ఆడపిల్లా తన తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోగలగాలి. షేర్ చేసుకునేలా పెంచాలి అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను దర్శకుడు కృష్ణ పోలూరు రూపొందించారు. కిరాణా షాపు యజమాని అయిన ప్రసాదరావు (రాజీవ్ కనకాల)కు తన కూతురు స్వాతి (వసంతిక) అంటే ప్రాణం. కూతురుకు కూడా తండ్రంటే వల్లమాలిన ప్రేమ. అయిష్టంగానే కూతురికి సాఫ్ట్‌వేర్ జాబ్ రావడంతో హైదరాబాద్ పంపిస్తాడు. కట్ చేస్తే.. జోరున వర్షం.. కూతురి ఫోన్ కోసం తండ్రి ఎదురు చూస్తుంటాడు. పదే పదే కూతురికి ఫోన్ చేస్తుంటాడు కానీ ఆ ఫోన్ స్విచ్డాఫ్ అని వస్తుంది. వెంటనే వర్షంలోనే తన కూతురి కోసం నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం మొదలుపెడతాడు. ఏదో తెలియని ఆందోళన, భయం ఆ కన్నతండ్రి మదిని అల్లకల్లోలంగా మారుస్తూ ఉంటుంది. మరోవైపు హైదరాబాద్‌లోని ఓ హాస్టల్. అక్కడ స్వాతి (వసంతిక) అనే యువతి మిస్ అయ్యిందని ఆందోళన మొదలవుతుంది. ఎవరూ గేటు దాటి బయటకు వెళ్లకూడదని హాస్టల్ వార్డెన్ (గాయత్రి భార్గవి) హుకుం జారీ చేస్తుంది. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందిస్తుంది. మీడియా అక్కడకు వస్తుంది. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే స్వాతి హాస్టల్ లోపలికి వచ్చినట్టు కనిపిస్తుంది కానీ బయటకు వెళ్లినట్టుగా కనిపించదు. దీంతో హాస్టల్ అంతా వెదుకుతారు. కానీ ఎక్కడా స్వాతి కనిపించదు. స్వాతి మిస్సింగ్‌పై గందరగోళం నడుస్తుంటుంది. అప్పుడు ప్రసాదరావు అక్కడకు చేరుకుంటాడు. అసలు స్వాతి ఏమవుతుంది? కూతురు కనిపించలేదని తెలిసిన తండ్రి పరిస్థితి ఏంటి? ఈ మిస్సింగ్ వ్యవహారంలో స్వాతి రూమ్మేట్స్ పాత్ర ఏంటి? అసలు స్వాతి ఏమైంది? అనేది డాటర్ ఆఫ్ ప్రసాదరావు అనే వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

వెబ్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతుంది. అసలు స్వాతి ఏమైంది? అని తెలిసే వరకూ ఒకరకమైన సస్పెన్స్.. ఏమైంది అని తెలిశాక మరో రకమైన సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. ఒకవైపు పోలీస్ ఆఫీసర్‌గా స్వాతి కేసును ఛేదించేందుకు రెబెకా జోసెఫ్ (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది. ఒకవైపు ఆమె ఇన్వెస్టిగేషన్. మరోవైపు తన కూతురి కోసం తండ్రి ఇన్వెస్టిగేషన్. చివరిలో తేలిన నిజమేంటి? అనేది మనల్ని కంటతడి పెట్టిస్తుంది. ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రతి తండ్రి గుండె బరువెక్కుతుంది. వెబ్ సిరీస్ చూసిన తర్వాత తండ్రీకూతుళ్ల అనుబంధం ఎలా ఉండాలనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. యూత్ కూడా ఈ వెబ్ సిరీస్‌కు బాగా కనెక్ట్ అవుతారు. థ్రిల్లర్ ఎలిమెంట్‌తో పాటు స్వాతి ఎదుర్కొన్న పరిస్థితులు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులను, ప్రతి అమ్మాయిని కదిలిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

ఈ వెబ్‌సిరీస్‌లో తండ్రిగా రాజీవ్ కనకాల జీవించేశారు. తన కూతురి కోసం తండ్రి పడే ఆవేదన చూస్తుంటే అది వెబ్‌సిరీస్‌లా అనిపించదు. ఈ క్యారెక్టర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇక కూతురిగా వసంతిక చక్కగా ఒదిగిపోయింది. తండ్రిపై వల్లమాలిన ప్రేమతో పాటు కాస్త భయం. ఈ క్యారెక్టర్ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇక చెప్పుకోవల్సిన మరో క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ రెబెకా జోసఫ్. ఈ పాత్రలో ఉదయభాను ఒదిగిపోయారు. చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన క్యారెక్టర్‌తో ఉదయభాను ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక కృష్ణ పోలూరు ఎక్కడా సస్పెన్స్‌ను సడలనివ్వకుండా అద్భుతంగా కథను నడిపించారు. నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. ఈ సిరీస్‌ను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది.

చివరిగా.. ‘డాటర్ ఆఫ్ ప్రసాదరావు’ ప్రతి గుండెనూ టచ్ చేస్తుంది.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 27, 2026 5:34 AM