జమ్మూ కశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్.. పెను విధ్వంసం
అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి వరదలు సంభవించి 10 కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ జిల్లాలతో సహా..
జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఒక్కసారిగా వరదలు (Floods) విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని డోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ (Cloudburst) కారణంగా నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి వరదలు సంభవించి 10 కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ జిల్లాలతో సహా జమ్మూ ప్రాంతంలోని అనేక ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) ముందుగానే హెచ్చరించింది. ఈ క్రమంలోనే ముందుగానే జమ్మూ డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ (Government), ప్రైవేటు పాఠశాలల (Private Schools)ను మూసివేశారు.
అలాగే కొండచరియలు విరిగిపడటంతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. చీనాబ్ (Cheenab), రావి (Ravi), తావి వంటి నదులు సైతం ప్రమాదకర స్థాయిని మించి మరీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే దోడాలోని ఒక కీలక రహదారి కొట్టుకుపోయింది. రాత్రి పూట నదులు మరింత ఉధృతం దాల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నదీ ప్రాంత వాసులు, కొండ చరియలకు సమీపంలో ఉండేవారంతా దూర ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయక బృందాలను సైతం అధికారులు అప్రమత్తం చేశారు.