నెత్తురోడుతున్న నేలపై బ్యూటీక్వీన్.. తొలిసారిగా మిస్ యూనివర్శ్ పోటీకి..
అందానికి నేలతో సంబంధం లేదు. ఎక్కడైనా పుట్టొచ్చు. చూపు తిప్పుకోనివ్వని కొందరికే సొంతం. బ్రహ్మదేవుడు ఎంత మనసు పెట్టి మలిచాడో అనిపిస్తుంది. ఒకప్పుడు అందం అంటే.. చందమామ లాంటి మొహం..

అందానికి నేలతో సంబంధం లేదు. ఎక్కడైనా పుట్టొచ్చు. చూపు తిప్పుకోనివ్వని కొందరికే సొంతం. బ్రహ్మదేవుడు ఎంత మనసు పెట్టి మలిచాడో అనిపిస్తుంది. ఒకప్పుడు అందం అంటే.. చందమామ లాంటి మొహం.. ఆ మోముకు మరింత అందాన్నిచ్చే బొట్టు.. సోగ కన్నులు.. సొట్ట బుగ్గలు.. అందమైన అధరాలు.. వీటన్నింటికీ మరింత శోభను తెచ్చిపెట్టే చీరకట్టు.. ఇప్పుడైతే అవేమీ కాదు.. మంచి హైట్, ఫిజిక్, ఆరోగ్యం, తెలివి వంటివన్నీ అందానికి కొలమానాలే. ముఖ్యంగా అందాల పోటీలో పరిగణలోకి తీసుకునేవి కూడా ఇవే.
పాలస్తీనా (Palestine) అంటే మనకు గుర్తొచ్చేది.. రెండేళ్ల యుద్ధం.. శవాల గుట్టలు.. రక్తమోడుతున్న నేల.. అసలు పాలస్తీనాను ఒక రాజ్యంగానే గుర్తించని దేశాలు సైతం చాలానే ఉన్నాయి. అలాంటి నేలపై నుంచి మిస్ యూనివర్స్ (Miss Universe) పోటీకి ఓ అందం సన్నద్ధమవుతోంది. ఇప్పుడు అర్థమైందా.. అందానికి నేలతో పని లేదని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో.. ఆమె పేరు నదీన్ ఆయుబ్ (Nadeen Ayoub). ఇప్పటి వరకూ పాలస్తీనా నుంచి మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికయ్యిందే లేదు. నదీన్ ఆయుబే తొలి పోటీదారు. పాలస్తీనా నుంచి అంతర్జాతీయ వేదికపైకి ఓ ఆశయంతో అడుగు పెడుతున్న బ్యూటీ క్వీన్ ఆయుబ్. కిరీటం కోసం కాదట.. తన దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను మోసుకొస్తున్నానని చెబుతోంది. నదీన్ ఆయుబ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది.
మిస్ ఎర్త్ ఫైనల్స్‌లో..
ఆమె ఒక అడ్వకేట్ (Advocate), మోడల్ (Model), లిటరేచర్ (Literature), సైకాలజీ (Psychology)ల్లో డిగ్రీ, సర్టిఫైడ్ వెల్‌నెస్ అండ్ న్యూట్రిషన్ కోచ్ (wellnesss and Nutrition Coach), గ్రీన్ అకాడమీ అనే సంస్థ వ్యవస్థాపకురాలు.. పైగా ‘సయిదత్ పాలస్తీన్’ అనే ఎన్‌జీవో (NGO)తో కలిసి మహిళల కోసం ఎంతగానో శ్రమిస్తున్న సామాజిక కార్యకర్త. అందంతో పాటు ఇన్ని విషయాలు కలిసి ఉండటమనేది చాలా అరుదు కదా.. అందుకే ఆమె అంతర్జాతీయ వేదికపై పాలస్తీనా నుంచి మిస్ యూనివర్స్ 2025 పోటీలో పాల్గొనబోతోంది. నవంబర్‌లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ పోటీ జరుగనుంది. వాస్తవానికి నదీన్ ఆయుబ్‌కి ఈ అందాల పోటీలేమీ కొత్తకాదు.. గతంలో అంటే 2022లో మిస్ పాలస్తీనాగా ఎంపికైంది. ఆ తరువాత ‘మిస్ ఎర్త్ (Miss Earth)’ పోటీల్లో పాల్గొని ఫైనల్స్‌లోకి అడుగు పెట్టి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వేదికపై తాను కాలు మోపడం వెనుక ఉద్దేశం విశ్వసుందరి కిరీటాన్ని తలపై ధరించాలని కాదు.. అందాల పోటీలు.. సమస్యలను తెలిపే వేదికలు కూడా కావడమే.
భవిష్యత్తుపై ఆశలు..
దేశం, సంస్కృతుల గొప్పతనమే కాదు.. తన దేశంలో జరుగుతున్న నరమేధాన్నిసైతం ఆమె తన దేశ ప్రజల తరుపున వారి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటోంది. విశ్వ సుందరి పోటీల్లో 140 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే తమ దేశ పరిస్థితులను, తమకు భవిష్యత్తుపై ఉన్న ఆశలను, పోరాట పటిమను తెలియజేయాలనుకుంటున్నట్టు నదీన్ ఆయుబ్ చెబుతోంది. ముఖ్యంగా తన దేశంలోని మహిళలకు ఉపాధి చూపించడం, వాళ్ల కథలను పరిచయం చేయడం వంటివి ఇప్పటికే ఆమె చెస్తోంది. ఇప్పుడు ప్రపంచానికి తెలియజేసేందుకు మంచి మార్గంగా అందాల పోటీలను ఆయుబ్ ఎంచుకుంది. ఇక భారత్ తరుఫున మిస్ యూనివర్స్ పోటీలో మణిక విశ్వకర్మ పాల్గొనబోతున్న విషయం తెలిసిందే.
ప్రజావాణి చీదిరాల