TGSRTC: హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..
ఈ విధానం వలన ఎదురయ్యే సమస్యలను సైతం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విధానం వలన కొన్ని లాభాలున్నాయి. కొన్ని సవాళ్లు ఉన్నాయి. లాభాల విషయాన్ని పక్కనబెడితే సవాళ్లను ఎదుర్కొనగలిగితే..

హైదరాబాద్ (Hyderabad)లో ప్రయాణమంటే నరకం. మరీ ఉదయం 8 నుంచి 11 లోపు.. సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకూ ప్రయాణం చేయాలంటే నరకమే. మెట్రోలు సైతం కాలు పెట్టే గ్యాప్ కూడా ఉండదు. ఈ జనాలంతా ఎక్కడికి వెళతున్నార్రా బాబు అనిపిస్తుంటుంది.. కొత్తగా ప్రయాణించే వారికి. ఈ ప్రయాణ కష్టాలైతే ఎలాగూ తప్పవు కానీ హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు (RTC Bus) ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసే క్రమంలో స్మార్ట్ కార్డుల (Smart Cards)ను ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలోనే నగరంలో పైలట్ ప్రాజెక్టును చేపట్టనుంది. తద్వారా విద్యార్థుల బస్ పాస్‌లను స్మార్ట్‌కార్డుల రూపంలోకి మార్చాలని నిర్ణయించింది.
అనంతరం మిగిలిన ఇతర పాస్‌లు ఉన్నాయి కదా. మహాలక్ష్మి (Mahalakshmi) ఉచిత ప్రయాణ లబ్ధిదారులు సహా వాటన్నింటికీ స్మార్ట్ కార్డులను జారీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో ఈ స్మార్ట్ కార్డుల వ్యవస్థపై ఆలోచనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లనూ స్మార్ట్ కార్డ్ విధానాన్ని అమల్లోకి తేవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం వలన ఎదురయ్యే సమస్యలను సైతం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విధానం వలన కొన్ని లాభాలున్నాయి. కొన్ని సవాళ్లు ఉన్నాయి. లాభాల విషయాన్ని పక్కనబెడితే సవాళ్లను ఎదుర్కొనగలిగితే ఈ విధానం సత్ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
లాభాలు.. సవాళ్లేంటంటే..
స్మార్ట్‌కార్డు విధానం అందుబాటులోకి వస్తే ముఖ్యంగా ప్రయాణికులకు చాలా లాభాలున్నాయి. ప్రయాణికులు తమ ఆధార్, ఇతర చిరునామా ధ్రువీకరణ కార్డుల అవసరం ఉండదు. అలాగే ఈ స్మార్ట్ కార్డు కలిగినవారు రెన్యువల్ కోసం ప్రతి నెలా బస్ పాస్ జారీ చేసే కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ (Digital) పద్ధతిలోనే రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఆర్టీసీ బస్సులను సర్దుబాటు చేసేందుకు సైతం వీలు కలుగుతుంది.
ఇక సవాళ్లేంటంటే.. ఆర్టీసీ బస్సులో నగరంలో నిత్యం 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారిలో సుమారు 18 లక్షల మంది మహిళలే ఉండగా.. వీరందరికీ కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రయాణించే వారి సంగతి ఓకే కానీ ఇతరుల మాటేంటి? అంటే మహాలక్ష్మి ఉచిత ప్రయాణం రోజూ వినియోగించుకునేవారుంటారు. అప్పుడప్పుడు వినియోగించుకునేవారుంటారు. రోజూ వినియోగించుకునేవారు ఓకే కానీ అప్పుడప్పుడు వినియోగించుకునేవారి మాటేంటి? ఒకవేళ స్మార్ట్ కార్డు లేని వారు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాల్సి వస్తే వారికి ఎలాంటి వెసులుబాటు కల్పించాలనేది సమస్య. ఇక ఆర్టీసీ అధికారులు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.