జమ్మూలో పెను విషాదం.. 38 మంది మృతి
దేశంలోనే అత్యంత అందమైన ప్రదేశం జమ్మూకశ్మీర్.. ప్రస్తుతం అది ప్రకృతి విలయతాండవానికి విలవిల్లాడిపోయింది. భారీ క్లౌడ్‌బరస్ట్ ఎందరో జీవితాలను పొట్టనబెట్టుకుంది.

దేశంలోనే అత్యంత అందమైన ప్రదేశం జమ్మూకశ్మీర్ (Jammu Kashmir).. ప్రస్తుతం అది ప్రకృతి విలయతాండవానికి విలవిల్లాడిపోయింది. భారీ క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) ఎందరో జీవితాలను పొట్టనబెట్టుకుంది. ఒక్కసారిగా మెరుపు వరదలు అక్కడి కిశ్త్‌వాడ్ ప్రాంతంలోని చోసిటీని చుట్టుముట్టాయి. ఊహించని పరిణామానికి భారీగా ప్రాణనష్టాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకూ 38 మంది మృతదేహాలను వెలికితీశామని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎప్ సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), పోలీసులు (Police), ఆర్మీ (Army), తదితరులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
కిశ్త్‌వాడ్ జిల్లాలోని ప్రఖ్యాత మాచైల్ మాతా (చండీ)మందిరం ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లే వారికి చోసిటీ వద్దే యాత్ర బేస్ పాయింట్. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే యాత్రీకులంతా తమ వాహనాలను బేస్ పాయింట్ వద్ద ఉంచి కాలి నడకన దర్శనానికి వెళుతుంటారు. యాత్రికులు తమ వాహనాలు ఉంచి.. కాలి నడకన దర్శనానికి వెళ్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 2,800 మీటర్ల ఎత్తులో ఉన్న మాచైల్ మాతా మందిరానికి జూలై 25న యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర సెప్టెంబర్ 5 వరకూ కొనసాగనుంది. తాజాగా జరిగిన పెను విషాదంతో యాత్రను అధికారులు నిలిపివేశారు. యాత్రికులకు సహాయం అందించేందుకు అక్కడి అధికారులు హెల్ప్ డెస్క్‌తో పాటు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సాయం కావల్సిన వారు 9858223125, 6006701934, 9797504078, 8492886895, 8493801381, 7006463710 కాల్ చేయాలని సూచించారు.