Kiran Abbavaram: కిరణ్ స్థానంలో చిరు ఉంటే ఇలాగే ప్రశ్నిస్తారా?
చిరంజీవి (Chiranjeevi) కానీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కానీ ఉంటే ఇలాగే ప్రశ్నిస్తారా? ఎందుకో కిరణ్ అబ్బవరంను మాత్రం కొందరు మీడియా ప్రతినిధులు కనిపించినప్పుడల్లా మాటలతో పొడుస్తూనే ఉంటారు.

చిన్న సినిమా, పెద్ద సినిమానే కాదు.. చిన్న హీరో, పెద్ద హీరో అన్న తారతమ్యాలు కూడా ఉంటాయి. ఇది బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని నిజం. పెద్ద హీరో కనిపిస్తే ఒకలా.. చిన్న హీరో కనిపిస్తే మరోలా మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా హీరో కిరణ్ అబ్బవరం (Hero Kiran Abbavaram) ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాడు. అదే స్థానంలో చిరంజీవి (Chiranjeevi) కానీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కానీ ఉంటే ఇలాగే ప్రశ్నిస్తారా? ఎందుకో కిరణ్‌ను మాత్రం కొందరు మీడియా ప్రతినిధులు కనిపించినప్పుడల్లా మాటలతో పొడుస్తూనే ఉంటారు.
రేపు (అక్టోబర్ 18)న కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ‘కె-ర్యాంప్’ (K-Ramp) చిత్రం విడుదల కానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే సినిమా రిలీజ్.. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మీడియాతో క్యూ అండ్ ఏ (Question and Answer) ప్రెస్‌మీట్ నిర్వహించారు. దీనికి కిరణ్ రావడమే ఒక రకమైన జోష్‌తో ఆనందంగా వచ్చారు. తన సినిమా పక్కాగా రిలీజ్ అవుతుందన్న ఆనందంలో ఉన్నారు. అలాంటి ఆనందాన్ని ఓ మీడియా (Media) ప్రతినిధి హరించివేశారు. అసలేం జరిగిందంటే.. ‘కె -ర్యాంప్’ చిత్రంలో ఒక ఇబ్బందికర పదం ఉంది. దీనిని మీ తల్లిదండ్రులతో ఆ పదం వాడుతారా? అని ప్రశ్నించారు. తాను ఆ పదాన్ని తన తల్లిదండ్రులతో అనలేదని ఫ్రెండ్‌తో అన్నానని కిరణ్ తెలిపారు. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా? అని మీడియా ప్రతినిధి తిరిగి ప్రశ్నించారు. తన సినిమా గురించి ఇది నాలుగో ప్రెస్‌మీట్ అని.. ఇప్పటికే నాలుగు సార్లు ఆన్సర్ చేశానని.. పదే పదే తాను ఆన్సర్ చేయలేనని కిరణ్ తెలిపారు.
ఏం చెప్పదలుచుకున్నారు సర్?
‘మిమ్మల్ని మీరు సమర్ధించుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ అని ఎలా చెబుతారు? దీనిని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఎలా అంటారు?’ అని మరోమారు మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి కిరణ్ తాను సమర్థించుకోవడం లేదని.. సెన్సార్ అయ్యిందని దానిని తొలగించామని చెప్పారు. తిరిగి ట్రైలర్ ద్వారా మార్కెట్‌లోకి వదిలేశారు కదా అని సదరు మీడియా ప్రతినిధి.. అప్పటికీ ఓపికగానే.. సర్ మీరిప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సర్? అని కిరణ్ అడిగారు. పబ్లిసిటీ కోసం వదిలారా? ఆ పదం వాడటానికి ఎథిక్స్ లేవా? అంటూ తిరిగి నిలదీయగా.. కిరణ్ ‘నో ఆన్సర్ సర్ నాకు.. మీరేదో మాట్లాడాలి అనుకుంటున్నారు.. నేను దాన్ని ప్రొలాంగ్ చేయలేను’ అని చెప్పేసి సైలెంట్ అయ్యారు. తరువాత నరేష్ మైక్ తీసుకుని సర్ది చెప్పారు. సెన్సార్ అయిపోయింది పదాన్ని తొలగించారు. ఇంకేంటి ప్రాబ్లమ్? అదే ప్లేసులో చిరంజీవి కూర్చొని ఉంటే అలాగే నిలదీయగలరా? ఎందుకిలా కిరణ్ కనిపించినప్పుడల్లా ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు?
అలవి కాని చోట కాదు..
అడగవచ్చు.. కానీ ఒకటే ప్రశ్నను ఎన్ని సార్లు అడుగుతారు? ఎన్ని సార్లు ఇబ్బంది పెడతారు? పైగా ఆ వ్యక్తి మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్.. తప్పక హిట్ అవుతుందన్న ఆనందంలో ఉన్నప్పుడు ఇలా మనసు నొచ్చుకునే ప్రశ్నలు అవసరమా? ప్రశ్న అడిగేందుకు సందర్భం కూడా ముఖ్యమే కదా.. అదెందుకు ఆలోచించరు? మరీ ఇంత దారుణమా? గతంలోనూ ఓ మీడియా ప్రతినిధి కిరణ్‌ను ఇలాగే ఇబ్బంది పెట్టారు. అసలు అతడినే ఎందుకు అంతలా? ఎదురుగా చిరంజీవి కానీ పవన్ కల్యాణ్ కానీ ఉంటే ఇలాగే ప్రశ్నలడుగుతారా? చిన్న హీరోల దగ్గరా మీ ప్రతాపం? అడగవచ్చు.. తప్పులేదు కానీ అలవికాని చోట కాదు..
ప్రజావాణి చీదిరాల