Entertainment

Santhana Prapthirastu Review: ‘సంతాన ప్రాప్తిరస్తు’కు ప్రేక్షకుల ఆశీర్వాదం దక్కుతుందా?

‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం ముఖ్యంగా రెండు అంశాలను హైలైట్ చేసింది. ఒకటి మారుతున్న జీవన విధానంలో యువతలో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్, తండ్రికూతుళ్ల వల్లమాలిన ప్రేమ. ఏ కూతురుకైనా తండ్రే హీరో.

Santhana Prapthirastu Review: ‘సంతాన ప్రాప్తిరస్తు’కు ప్రేక్షకుల ఆశీర్వాదం దక్కుతుందా?

చిత్రం: సంతాన ప్రాప్తిరస్తు

విడుదల తేదీ: 14-11-2025

నటీనటులు: విక్రాంత్, చాందిని చౌదరి, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, తరుణ్‌ భాస్కర్, అభినవ్ గోమటం, తాగుబోతు రమేష్ తదితరులు..

సంగీతం: సునీల్‌ కశ్యప్‌

దర్శకత్వం: సంజీవ్‌ రెడ్డి

నిర్మాతలు: మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి, సంజీవ్‌

ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్నవి మూడు, నాలుగు జానర్లే. వాటిలో కామెడీ ఎంటర్‌టైనర్, సస్పెన్స్ థ్రిల్లర్ తప్పనిసరిగా ఉంటాయి. చిన్న సినిమాలు అయితే దాదాపుగా ఇటీవలి కాలంలో అయితే కామెడీ ఎంటర్‌టైనర్ లేదంటే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నాయి. అలా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిందే ‘సంతాన ప్రాప్తిరస్తు’. మరి కామెడీ ప్రేక్షకులను అలరించిందా? చూద్దాం.

‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం ముఖ్యంగా రెండు అంశాలను హైలైట్ చేసింది. ఒకటి మారుతున్న జీవన విధానంలో యువతలో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్, తండ్రికూతుళ్ల వల్లమాలిన ప్రేమ. ఏ కూతురుకైనా తండ్రే హీరో. అలాగే ఏ తండ్రికైనా తన కూతురే క్వీన్. ప్రేమ ఒక స్థాయి వరకూ ఓకే కానీ అవధులు దాటితేనే జీవితానికే నష్టంగా పరిణమించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఇదే అంశాన్ని చూపించారు.

సినిమా కథేంటంటే..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన చైతన్య (Hero Vikranth) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. అక్కాబావే అతనికి సర్వస్వం. హైదరాబాద్‌లో వారి ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంటాడు. ఓ పబ్లిక్ ఎగ్జామ్ రాసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కల్యాణి (Chandini Chowdary)ని చూసి చూడగానే ప్రేమలో పడిపోతాడు. కొన్ని సంఘటనల తర్వాత కల్యాణి కూడా చైతన్యను ఇష్టపడుతుంది. కానీ ఆమె తండ్రి ఈశ్వరరావు (Muralidhar Goud) దీనికి అంగీకరించడు. తన కూతురికి ప్రభుత్వోద్యోగితోనే వివాహం చేయాలనుకుంటున్నాడు. దీంతో వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంటారు. మామ ఈశ్వరరావు తామిద్దరినీ విడదీయకుండా ఉండేందుకు పిల్లల్ని కనడమే పరిష్కారంగా చైతన్య భావిస్తాడు. కానీ పిల్లలు కలగకపోడంతో వైద్యులను ఆశ్రయించగా.. టెస్టుల్లో అతనికి స్పెర్మ్ కౌంట్ తక్కువ అని తేలుతుంది. వారికిక పిల్లల్ని కనే అవకాశం లేదా? విషయం తెలుసుకున్న ఈశ్వరరావు ఏం చేశాడు? తనకున్న సమస్య కారణంగా చైతన్య ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు? చివరికి చైతన్య, కల్యాణి జీవితం ఎలాంటి మలుపు తీసుకుందనే అంశాలను వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

సినిమా ఎలా ఉందంటే..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు పైకే వేలల్లో జీతాలు.. వెనకంతా ఈఎంఐలే అనుకునే వ్యక్తి ఈశ్వరరావు.. తన కూతురిపై అతి ప్రేమతో పెళ్లయినా కూడా అల్లుడి నుంచి విడదీసి వేరొక పెళ్లి చేయాలని భావిస్తుంటాడు. చైతన్యకు కూడా భార్యపై అమితమైన ప్రేమ. ఎలాగైనా తన భార్య తన నుంచి దూరం కాకుండా చూసుకోవాలనుకుంటాడు. కల్యాణి విషయానికి వస్తే తండ్రిని విపరీతంగా నమ్మే వ్యక్తి. ఈ మూడు క్యారెక్టర్ల మధ్య కథంతా నడుస్తుంది. వాస్తవానికి సంతాన లేమి సమస్య అనేది చాలా సున్నితమైనది. దీనిని ఎక్కడా అపహాస్యం చేయకుండా.. వల్గారిటీకి తావివ్వకుండా డీల్ చేసిన తీరును మెచ్చుకుని తీరాల్సిందే. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ వంటి కొందరు కమెడియన్స్‌ను తీసుకున్నారు కానీ వారి కామెడీ టైమింగ్‌ను దర్శకుడు మరింత వాడుకుని ఉండవచ్చేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మొత్తమ్మీద కథను ఇంకాస్త గట్టిగా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది.

ఎవరెలా చేశారు?

హీరో విక్రాంత్ కొన్ని సన్నివేశాల్లో మినహా ఓవరాల్‌గా బాగానే నటించాడు. చాందిని చౌదరి తన పాత్రను చక్కగానే పోషించింది. వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్ వంటి వారంతా ఎవరి పాత్రల్లో వారు అద్భుతంగా నటించారు. సంగీతం విషయానికి వస్తే పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ అంతా బాగుంది. నిర్మాణ విలువలు సైతం కథకు తగినట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘సంతాన ప్రాప్తిరస్తు’ను కొంతమేర ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్: 2.75

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 14, 2025 12:43 PM