Viswambhara: చిరు బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్ ఫ్యాన్స్‌కు కొంత మోదం.. కొంత ఖేదం..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. రేపు (ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులకు ‘విశ్వంభర’ మేకర్స్ పుట్టినరోజు ట్రీట్ ఇచ్చేశారు. ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వదిలారు.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర (Viswambhara)’. రేపు (ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులకు ‘విశ్వంభర’ మేకర్స్ పుట్టినరోజు ట్రీట్ ఇచ్చేశారు. ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వదిలారు. ముందుగానే దర్శకుడు వశిష్ట (Director Vasista) ఈ సినిమా గురించి ఓ చందమామ కథ లాంటి సినిమా అని చెప్పారు. గ్లింప్స్ చూస్తుంటే మనకు ఆ కథలే గుర్తొస్తాయి. ఇక మొత్తానికి ఓ చిన్నారికి చందమామ కథను వివరిస్తున్నట్టుగా విశ్వంభర కథను చెప్పించేందుకు గ్లింప్స్ ద్వారా వశిష్ట అయితే ప్రయత్నించారనడంలో సందేహం లేదు. అయితే గతంలో కూడా ఈ సినిమా నుంచి గ్లింప్స్ వదిలారు. కానీ జనాలకే ఏమాత్రం ఎక్కలేదు. మరి ఇప్పుడు సీజీ వర్క్ పర్ఫెక్ట్‌గా చేయించి మరీ వదిలారు. మరి ఇప్పుడు ఫ్యాన్స్ ఓకే అంటారా? ముందుగా గ్లింప్స్ సంగతేంటో చూద్దాం.
ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈ రోజైనా చెబుతావా మురా’ అనే ఓ చిన్నారి వాయిస్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను గ్లింప్స్‌గా మేకర్స్ వదిలారు. ‘ఒక సంహారం.. దాని తాలూకు యుద్ధం.. ఒకడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం... అలసిపోని ఆశయానికి ఊపిరి పోసే వాడొకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని.. గొప్పగా ఎదురు చూసింది’’ అనే వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ వదిలారు. వీడియో ఆరంభంలో తేలును.. చివరిలో చిరు చేతిలో ఏదో ఒక జంతువు కన్నును అయితే చూపించారు. అలాగే శివలింగాన్ని సైతం చూపించారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీని మాత్రం గ్లింప్స్‌లో ప్రకటించలేదు. వచ్చే ఏడాది సమ్మర్ అని చెప్పారు కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇది ఫ్యాన్స్‌కు కొంత నిరుత్సాహాన్ని అయితే కలిగిస్తుందనడంలో సందేహం లేదు. మొత్తానికి గ్లింప్స్ మెగాస్టార్ ఫ్యాన్స్‌కు ‘కొంత మోదం.. కొంత ఖేదం’ అని చెప్పాలి. విడుదల తేదీని కూడా ప్రకటించి ఉంటే పూర్తిస్థాయిలో మోదమని చెప్పేవాళ్లం.
అసలు ఇప్పుడు కాదు.. ఈ ఏడాది ఆరంభంలోనే అంటే జనవరిలోనే ఈ చిత్రం విడుదల అయి ఉండాలి. రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ కారణంగా విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. కనీసం ఏడాది తర్వాత అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి అయినా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ అది కుదరదని మేకర్స్ చెప్పేశారు. మరీ సినిమా కోసం ఇంత మేకర్స్ ఇంత సమయం తీసుకోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సోషియో ఫాంటసీ డ్రామాలోో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రజావాణి చీదిరాల