Entertainment

Ustaad Bhagat Singh: ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉందా?

పవన్‌కల్యాణ్‌ సినిమా అంటే అంచనాలు సర్వసాధారణం. అందునా హరీష్ శంకర్, పవన్ కాంబో అంటే విపరీతమైన క్రేజ్. దీనికి కారణం వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ చేసిన మ్యాజిక్. మరి ఈ సారి ఆ మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా?

Ustaad Bhagat Singh: ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉందా?

సినిమా పేరు: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌

విడుదల : 19-03-2026

నటీనటులు: పవన్‌కల్యాణ్‌, శ్రీలీల, రాశీఖన్నా, కె.ఎస్‌.రవికుమార్‌, పార్దీబన్‌, రావురమేష్‌..

దర్శకత్వం: హరీశ్‌శంకర్‌

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, తమన్‌

నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్‌

పవన్‌కల్యాణ్‌ సినిమా అంటే అంచనాలు సర్వసాధారణం. అందునా హరీష్ శంకర్, పవన్ కాంబో అంటే విపరీతమైన క్రేజ్. దీనికి కారణం వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ చేసిన మ్యాజిక్. మరి ఈ సారి ఆ మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా? ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసేలా సినిమా ఉందా? చూద్దాం.

కథేంటంటే..

చదలమర్రి నల్లనాగప్ప(పార్దీబన్‌)కు ముఖ్యమంత్రి కావాలనేది లక్ష్యం. దానికోసం అతను దేనికైనా వెనుకాడడు. దీనికి అడ్డుగా ఉన్న ముఖ్యమంత్రిపై హత్యాయత్నం చేస్తాడు. పార్టీలోని మరో వ్యక్తిని అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకోగా ఆయనను హత్య చేయిస్తాడు. ఆ తరువాత నల్లనాగప్ప ముఖ్యమంత్రి అవుతాడు. తండ్రి ముఖ్యమంత్రి అవడంతో అతని కొడుకు (కిల్లి క్రాంతి)కు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఎంజాయ్ చేయడానికని స్నేహితులతో కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్తాడు. అక్కడి పోలీసులు వందల టన్నుల గంజాయిని సీజ్‌ చేశారని తెలుసుకుని.. దాని కోసం అక్కడి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేస్తాడు. అక్కడి ఇన్‌స్పెక్టర్ భార్యను వివస్త్రను చేయడానికి యత్నిస్తే అప్పుడు ఉస్తాద్ భగత్‌సింగ్ (పవన్ కల్యాణ్) ఎంట్రీ ఇస్తారు. ముఖ్యమంత్రి కొడుకు స్నేహితులను చంపేసి కొడుకును బంధిస్తాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది? ముఖ్యమంత్రికి.. భగత్‌సింగ్‌కు ఉన్న గొడవ ఏంటి? అసలు ఉస్తాద్ ఎవరు? అనే విషయాలను వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

హరీష్ శంకర్, పవన్ కాంబో లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చింది. ఇదొక మాస్ సబ్జెక్ట్.. ఫ్యాన్స్‌కు నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కామెడీకి కామెడీ బాగానే వర్కవుట్ అయ్యింది. ఎమోషన్ గట్టిగానే పండింది. ఫైట్స్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి. ప్రథమార్థం అంతా పవన్ ఎంట్రీ.. రాశి ఖన్నాతో పరిచయం.. ముఖ్యమంత్రి కొడుకుని కిడ్నాప్ చేయడం వంటి అంశాలతో రూపొందించిన హరీష్ శంకర్.. సెకండాఫ్‌ను అసలు కథలోకి తీసుకెళ్లారు. ఇక సినిమాకు డైలాగ్స్ చాలా పెద్ద ఎసెట్ అని చెప్పాలి. ఇక పవన్ కల్యాణ్ ఓల్డ్ సాంగ్స్ కొన్ని ఫ్యాన్స్‌కు జోష్ తెప్పిస్తాయి. ప్రథమార్థం అంతా కొన్ని ట్విస్ట్‌లు పెట్టిన దర్శకుడు సెకండాఫ్‌లో వాటిని రివీల్ చేస్తూ ఆసక్తికరంగా నడిపించారు. ద్వితీయార్ధంలో పవన్, శ్రీలీల ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే..

పవన్‌కల్యాణ్‌ అయితే తన పాత్రలో జీవించేశారు. ‘గబ్బర్‌సింగ్‌’ మాదిరిగానే ఫుల్ జోష్‌తో ఆకట్టుకున్నారు. ఇక పార్తీబన్ విషయానికి వస్తే.. సినిమాకు ఆయన కాకుండా మరొకరు అయ్యుంటే చెప్పలేం. అంతలా పవన్‌కు సరిజోడైన విలన్ అని చెప్పాలి. హీరోయిన్లలో రాశి ఖన్నా పాత్ర నామమాత్రమే. శ్రీలీల పాత్ర కథలో చాలా కీలకం. అనుకున్నట్టే తను చాలా బాగా చేసింది. ఇక రావురమేష్‌, కె.ఎస్‌.రవికుమార్‌ అంతా పరిధి మేర పాత్రలను రక్తి కట్టించారు.

సాంకేతికంగా..

హరీశ్‌శంకర్‌ కథను నడిపించిన తీరు చాలా బాగుంది. డైలాగులు ఈ సినిమాకు హైలైట్‌. ఇక తమన్‌ నేపథ్య సంగీతం, దేవిశ్రీ పాటలు సినిమాకు చాలా ప్లస్ అని చెప్పాలి. కెమెరా వర్క్‌ కూడా బావుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్‌గా.. ఫ్యాన్స్ కాలర్ ఎగురవేయవచ్చు..

రేటింగ్: 3.5/5

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 19, 2026 8:32 AM