Dandora: నా పాత్రను అర్థం చేసుకోవడం ప్రేక్షకులకు పెద్ద టాస్క్
దాదాపు కొత్త దర్శకులతోనే పని చేస్తున్నానని.. మన మేకర్స్ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారని... మన దగ్గర కావల్సినంత పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నా కూడా పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారని శివాజీ అన్నారు.
విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘దండోరా’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో శివాజీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇలాంటివి చాలా అరుదు..
‘కోర్ట్’ కంటే ముందుగానే ‘దండోరా’ కథను విన్నట్టు శివాజీ తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని వెల్లడించారు. తనకు సినిమాకు సంబంధించిన అడ్వాన్స్‌ను మేకర్స్ ముందుగానే ఇచ్చారని.. కానీ ప్రొడక్షన్ పరంగా ఆలస్యమవడంతో ‘కోర్ట్’ చిత్రం ముందుగా విడుదలైందన్నారు. ఈ చిత్రంలో తాను వ్యవసాయదారుడిగా కనిపిస్తానని.. తన పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని.. మంచివాడో.. చెడ్డవాడో తెలుసుకోవడం అనేది ప్రేక్షకులకు పెద్ద టాస్క్ అని పేర్కొన్నారు. చిత్రంలోని అన్ని పాత్రలూ తన చుట్టే తిరుగుతాయని వెల్లడించారు. ఇలాంటి చిత్రం కానీ.. కథ కానీ.. పాత్ర వంటివి చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు. అన్ని పాత్రలకూ మంచి ప్రాధాన్యత ఉంటుందని శివాజీ తెలిపారు.
ఎమోషనల్‌గా సాగే చిత్రం..
‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదని... అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి రూపొందించిన చిత్రమని శివాజీ పేర్కొన్నారు. అన్ని రకాల భావావేశాలున్న సినిమా మాత్రమే కాకుండా గొప్ప స్క్రీన్ ప్లే ఉన్న చిత్రమని తెలిపారు. ‘కోర్ట్’ చిత్రంలో మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ ‘దండోరా’లోని తన పాత్రకి కూడా వస్తుందని శివాజీ తెలిపారు. నటుడిగా ఎంతో అదృష్టం ఉంటే తప్పా ఇలాంటి పాత్రలు రావు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లభించింది. ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే పాత్ర దొరికింది. అద్భుతమైన కంటెంట్‌తో ఎమోషనల్‌గా సాగే చిత్రమిది. ‘దండోరా’ చిత్రంలో బిందు మాధవి పాత్రను చాలా క్లాసీగా చూపించారని.. ప్రతీ ఒక్కరూ సినిమాతో, పాత్రలతో కనెక్ట్ అవుతారని వెల్లడించారు.
ఎన్నో నెగిటివ్ పాత్రలు..
దాదాపు కొత్త దర్శకులతోనే పని చేస్తున్నానని.. మన మేకర్స్ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారని... మన దగ్గర కావల్సినంత పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నా కూడా పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారని శివాజీ అన్నారు. ‘దండోరా’లో నవదీప్, నందు, రవికృష్ణ ఇలా అందరూ అద్భుతమైన ఆర్టిస్టులేనని పేర్కొన్నారు. ఇక్కడ మన వాళ్ల గురించి మనమే తక్కువ అంచనా వేసుకుంటామన్నారు. తాను 30 ఏళ్లుగా నుంచి ఇక్కడే ఉన్నానని.. గతంలో ఎన్నో నెగెటివ్ పాత్రలు పోషించానని తెలిపారు. కానీ మన దర్శకులకు నేను ఎక్కువగా కనిపించలేదేమోనని శివాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు కాలం కలిసి వచ్చిందని.. కాబట్టి ప్రస్తుతం విభిన్న పాత్రల్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్టు తెలిపారు. ‘దండోరా’ తరువాత తన నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోందని శివాజీ వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల