BA Raju: సినీ దిగ్గజ జర్నలిస్ట్ బీఏ రాజు 66వ జయంతి..
జీవించి ఉండగానే తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకోగలగడం అతి కొద్ది మందికే సాధ్యం. దాదాపు 40 ఏళ్ల పాటు సినీ జర్నలిస్ట్‌గానూ.. పీఆర్వో, పబ్లిషర్, నిర్మాతగా రాణించడమంటే సాధారణ విషయం కాదు.
జీవించి ఉండగానే తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకోగలగడం అతి కొద్ది మందికే సాధ్యం. దాదాపు 40 ఏళ్ల పాటు సినీ జర్నలిస్ట్‌గానూ.. పీఆర్వో, పబ్లిషర్, నిర్మాతగా రాణించడమంటే సాధారణ విషయం కాదు. పైగా అన్నేళ్లపాటు అజాత శత్రువుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కొద్ది మందికే సాధ్యం. ఈ ఘనతలన్నీ బీఏ రాజుకు చెందుతాయి. నేడు ఆయన 66వ జయంతి. అగ్ర హీరోలు, దర్శకుల నుంచి కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టే వారి వరకూ ప్రతి ఒక్కరితో గౌరవ భావంతోనూ.. ప్రేమగా ఉండటమే కాకుండా కొందరు హీరోహీరోయిన్లకు మార్గనిర్దేశకులుగా ఉండేవారు.
అద్భుతమైన ప్రస్థానాన్ని బీఏరాజు కొనసాగించారు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు పబ్లిసిటీ బాధ్యతలతో తన కెరీర్ ప్రారంభించి, ఏకంగా 1500 సినిమాలకు పైగా పీఆర్వోగా పనిచేసిన ఘనత ఆయనది. ఎన్నో చిత్రాల విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా జర్నలిజంలోనూ చెరగని ముద్ర వేశారు. 1994లో తన సతీమణి బి. జయతో కలిసి 'సూపర్ హిట్' (Super Hit) వీక్లీని స్థాపించి 27 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా తన తుది శ్వాస వరకూ నడిపించారు. 2001లో చిత్ర నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. 'సూపర్ హిట్ ఫ్రెండ్స్' (Superhit Friends), 'ఆర్.జె సినిమాస్' (RJ Cinemas) బ్యానర్‌లపై ఆయన చిత్రాలను నిర్మించారు. 'ప్రేమలో పావని కళ్యాణ్', 'చంటిగాడు', 'లవ్లీ', 'వైశాఖం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను బీఏ రాజు దంపతులు నిర్మించారు.
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీఏ రాజు తోటి జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా ఉండేవారు. ఇండస్ట్రీలో లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తనయుడు మహేష్ బాబుతో బీఏ రాజుకు ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆయన భౌతికంగా లేకున్నా కూడా ఆయన స్థాపించిన 'IndustryHit.com' వెబ్ పోర్టల్, దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన 'ఎక్స్' (X) ఖాతా ద్వారా నిరంతరం ఆయన తనయుడు శివ కుమార్ సినీ అప్‌డేట్స్‌ను అందిస్తూనే ఉన్నారు. సూపర్ హిట్ ఫ్రెండ్స్, ఆర్.జె సినిమాస్ బ్యానర్‌లను పునరుద్ధరించి, త్వరలోనే ప్రముఖ స్టార్లతో సినిమాలు ప్రకటించేందుకు శివ సిద్ధమవుతున్నారు. బీఏ రాజు 66వ జయంతి సందర్భంగా ఆ పవిత్ర ఆత్మకు మనసారా నివాళులర్పిద్దాం.