Ustaad Bhagat Singh: 'కాలరే ఎత్తరా' అంటున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'..
'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ చిత్రం నుంచి విడుదలైన అప్‌డేట్స్ అన్నీ మంచి రెస్పాన్స్‌ను రాబట్టాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో గీతం 'కాలరే ఎత్తరా'ను మేకర్స్ విడుదల చేశారు. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. భారీ సెట్స్, కట్టిపడేసే విజువల్స్, వందల కొద్దీ డ్యాన్సర్స్‌తో ఈ పాటను తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, రామ్ మిర్యాల గానం, కాసర్ల శ్యామ్ సాహిత్యం మొత్తంగా పాటను ఓ స్థాయికి లేపేశాయి.
సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే కథ కూడా వినకుండా సినిమా చేయడానికి రాశి ఖన్నా అంగీకరించిందని.. ఈ పాటలో ఆమె కూడా పవన్‌తో కలిసి స్టెప్పులేసిందన్నారు. 1500-2000 మందితో భారీ స్థాయిలో ఈ పాటను తెరకెక్కించినట్టుగా వెల్లడించారు. కల్యాణ్ ఈ సినిమాని ప్రాణం పెట్టి పని చేశారని.. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయిద్దని చెప్పారు. సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ సీన్స్ లో పవన్ అద్భుతంగా నటించాన్నారు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించగా.. మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారని హరీష్ శంకర్ తెలిపారు.
నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగా వచ్చిందని.. 'గబ్బర్ సింగ్' స్థాయికి తగ్గకూడదనే కసితో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారన్నారు. పవన్ కల్యాణ్‌తో గుర్తుండిపోయే చిత్రం చేయాలని అందరూ కోరుకుంటారని.. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని తమకు ఇచ్చినందుకు హరీష్ శంకర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ పడిన కష్టం న భూతో న భవిష్యతని పేర్కొన్నారు. రాశి ఖన్నా మాట్లాడుతూ.. అందరి ఉత్సాహం చూస్తుంటే పాట ఎంతగా నచ్చిందో అర్థమవుతుందన్నారు. తాను కూడా ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేసినట్టు వెల్లడించారు. పవన్‌తో కలిసి మాస్ సాంగ్‌కు స్టెప్పులేయడం ఆనందాన్నిచ్చిందన్నారు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్‌లో రెండు మంచి పాటలు రాసినప్పటికీ పవన్ కల్యాణ్‌కి ఒక మంచి డ్యాన్స్ నంబర్ రాయలేదనే వెలితి ఉండేదని.. 'కాలరే ఎత్తరా'తో అది తీరిపోయిందన్నారు. ఈ ఉగాది పండుగను 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరింత ఉత్సాహంగా జరుపుకుందామని అన్నారు. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 14న ట్రైలర్ విడుదల కానుండగా.. మార్చి 15న ప్రి రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించనున్నారు. శ్రీలీల, పార్థిబన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.