TG News: అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ.. తెలంగాణలో రసవత్తర రాజకీయం..!
బీజేపీ (BJP)కి ఆశలేమో ఆకాశాన్నంటుతున్నాయి కానీ అడుగులు మాత్రం ఆ దిశగా సాగడం లేదని తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలంతా ఈ ఎన్నికల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదనేది అక్షర సత్యం.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) రసవత్తరంగా మారబోతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొనడంతో ఇక్కడ స్థానిక ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)ను తలపిస్తున్నాయి. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) మూడు పార్టీలకూ విజయం చాలా ముఖ్యం కావడంతో ఎవరి వ్యూహ రచనలో వారున్నారు. స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ (Local Body Elections Schedule) రావడంతో పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. అయితే నలుగురికీ నచ్చినది నాకసే నచ్చదన్నట్టుగా కాషాయ పార్టీ వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికలు బీజేపీకి సవాల్‌గా మారాయి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి బలాన్ని నిరూపించుకోవాలనేది బీజేపీ ఆలోచన. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తమకు బాగా కలిసొస్తుందనేది కమలం పార్టీ ఆలోచన. అయితే బీజేపీకి ఆశలేమో ఆకాశాన్నంటుతున్నాయి కానీ అడుగులు మాత్రం ఆ దిశగా సాగడం లేదని తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలంతా ఈ ఎన్నికల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదనేది అక్షర సత్యం.
జాడ లేకుండా పోయిన కిషన్ రెడ్డి
ముఖ్య నేతలు సైతం స్థానిక సంస్థలను పట్టించుకోకపోవడానికి కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఉన్నంతగా ఈ పార్టీకి అంతగా కేడర్ లేదు. దీంతో బీజేపీకి ఇది ప్రధాన అవరోధంగా మారింది. దీంతో కేడర్ లేకుండా గ్రామాలకు వెళ్లి ఇజ్జత్ తీసుకోవడమెందుకని బీజేపీ నేతలంతా వెనుకడుగు వేస్తున్నట్టుగా టాక్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా జాడ లేకుండా పోయారని టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల పరిస్థితి ఇలా ఉంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubleehills bypoll)కు సైతం సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ అయితే ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థిని ఫిక్స్ చేయలేదు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారమంతా కిషన్ రెడ్డి భుజస్కందాలపైనే ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) సైతం ఒక సందర్భంలో చెప్పారు.
ఎవరికి వారే యమునా తీరే..
ఇక్కడ టికెట్ కేటాయించే విషయంలో కిషన్ రెడ్డి (Kishan Reddy) వర్సెస్ రాంచందర్ రావు (BJP Leader Ramchender Rao) మధ్య వార్ నడుస్తోంది. ఒకరు ఫైనల్ చేసిన అభ్యర్థిని మరొకరు తిరస్కరిస్తున్నారట. ఈ ఉపఎన్నిక భారం మాత్రం కిషన్ రెడ్డిదేనని టాక్. మరోవైపు ముఖ్య నేతగా ఉన్న బండి సంజయ్ అసలు ఈ ఎన్నికలతో తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారట. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం తనకంటూ ఒక గీత గీసుకుని దానిలోనే కూర్చున్నారట. మహా అయితే రెండు నియోజకవర్గాలను ఎంచుకుని అదే తమ పరిధి అని చెబుతున్నారని టాక్. నాయకులే బయటకు రాకపోతే ఉన్న అరకొర కేడర్ మాత్రం వస్తుందా? కేడర్ కూడా తమకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోందట. ఉత్తర తెలంగాణలో బీజేపీకి బలం ఎక్కువ. అక్కడ కూడా నేతలంతా ఇదే ధోరణి. బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్ (Konda Visweswar), రఘునందన్ రావు (MP Raghunandan Rao), ఈటల రాజేందర్ (Etela Rajender), డీకే అరుణ (DK Aruna) వంటి వారు కూడా తమ నియోజకవర్గ పరిధిని దాటి బయటకు రావడం లేదట. మరి పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ ఆశలు ఎలా నెరవేరుతాయి? గతంలో కాంగ్రెస్ ఏ పరిస్థితిలో ఉందో ఇప్పుడు అదే పరిస్థితిలో బీజేపీ ఉంది. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే..
ప్రజావాణి చీదిరాల