Entertainment

Movies: సంక్రాంతి పందెంకోళ్లు ట్రైలర్స్ వదిలాయి.. ఏది ది బెస్ట్ అంటే..

ఈసారి సంక్రాంతి కోడిపందేల కోసం ఆంధ్రాకు వెళ్లాల్సిన అవసరం లేదండోయ్.. థియేటర్స్‌కి వెళితే చాలు.. ఐదు పందెంకోళ్లు ఒక్కసారిగా తలపడితే ఎలా ఉంటుందో చూడొచ్చు.

Movies: సంక్రాంతి పందెంకోళ్లు ట్రైలర్స్ వదిలాయి.. ఏది ది బెస్ట్ అంటే..

ఈసారి సంక్రాంతి కోడిపందేల కోసం ఆంధ్రాకు వెళ్లాల్సిన అవసరం లేదండోయ్.. థియేటర్స్‌కి వెళితే చాలు.. ఐదు పందెంకోళ్లు ఒక్కసారిగా తలపడితే ఎలా ఉంటుందో చూడొచ్చు. జనవరి 9 - ‘ది రాజాసాబ్’.. జనవరి 12 - ‘మన శంకరవరప్రసాద్ గారు’, జనవరి 13 - ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, జనవరి 14 - అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ ఇద్దరు పెద్ద హీరోలు.. వారి మధ్య రవితేజ.. ఇక శర్వానంద్, నవీన్ పొలిశెట్టి చిత్రాలు పొంగల్ పోటీలో ఉన్నాయి. వాస్తవానికి చిరు, ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి చిత్రాల ట్రైలర్స్ చూసిన తర్వాత వాటికేమీ తీసిపోవేమో అనిపిస్తున్నాయి. వేటికవే సాటిలా ఉన్నాయి. అన్ని కామెడీ ఎంటర్‌టైనర్స్ అవడంతో ఏది ది బెస్ట్ అనేది డిసైడ్ చేయడం కాస్త కష్టమే.

19 ఏళ్ల తర్వాత..

‘ది రాజాసాబ్’ విషయానికి వస్తే ఒకటా అరా ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ముగ్గురు భామలతో తొలిసారిగా ప్రభాస్ రొమాన్స్ చేయనున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లతో ‘నాచే నాచే’ అనేశాడు. ఇక 19 ఏళ్ల తర్వాత రెబల్ స్టార్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అప్పుడెప్పుడో ‘యోగి’ సినిమాతో పొంగల్ బరిలోకి దిగితే.. తిరిగి ఇప్పుడే. ఇక మారుతి దర్శకత్వంలో హారర్ ఫాంటసీ చిత్రంగా ఇది రూపొందింది. దీనికి కామెడీ, నానమ్మ సెంటిమెంటు యాడ్ అయిపోవడం ప్రత్యేకత. మొత్తానికి చాలా కాలం తర్వాత మనం వింటేజ్‌ ప్రభాస్‌ను చూడబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. ముఖ్యంగా విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

టైటిల్‌తోనే..

ఇక ‘మన శంకరవరప్రసాద్ గారు’ విషయానికి వస్తే.. టైటిల్‌తోనే మార్కులు గట్టిగానే కొట్టేసింది. ప్రమోషన్స్ విషయంలోనూ టాప్‌లో ఉంది. ప్రారంభం నుంచే ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. విక్టరీ వెంకటేష్ యాడ్ అవడం ఈ సినిమాకు మరో ప్లస్. అలాగే నయనతార సినిమాకు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ట్రైలర్ విడుదలయ్యాక సినిమా మరింతగా జనాల్లోకి దూసుకెళ్లింది. కామెడీ ఎంటర్‌టైనర్ కావడం.. గతేడాది పొంగల్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకోవడం. దాని తాలూకు ఫ్లేవర్ ఇంకా తగ్గకపోవడం.. ఇప్పటికే ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు.. చాలా కాలం తర్వాత చిరు తనలోని కామెడీ యాంగిల్‌ను బయటకు తీయడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.

పొంగల్ ఫీస్ట్..

ఆ తరువాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనడంలో సందేహమే లేదు. ఇటీవల ఒకటీ అర రవితేజకు ఝలక్ ఇచ్చినా కూడా ఈ సినిమా ఆ నెగిటివిటీనంతా మడతెట్టేసేలా ఉంది. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే క్యారెక్టర్‌లో రవితేజ నటించనట్టుగా ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సత్య, వెన్నెల కిషోర్ వంటివారు ప్లస్ అని చెప్పాలి. ఇది కూడా ప్రేక్షకులకు మంచి పొంగల్ ఫీస్ట్ అందిస్తుందనే అనిపిస్తోంది.

కామెడీకి లోటుండదు..

ఇక ‘అనగనగా ఒకరాజు’ విషయానికి వస్తే నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పది మంది కమెడియన్ల పెట్టు. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్. గ్లామర్ కోసం మీనాక్షి చౌదరి ఉండనే ఉంది కదా. ఈ సినిమా కూడా పొంగల్ ఫీస్ట్. ఏమాత్రం కామెడీకి లోటుండదు. ప్రేక్షకులకు కావల్సింది కూడా అదే కాబట్టి ఈ చిత్రం ఫెయిల్యూర్‌కి దరి దాపుల్లో కూడా ఉండదని టాక్.

భారీ అంచనాలు..

ఇక ‘నారీ నారీ నడుమ మురారి’. శర్వానంద్ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. ఈసారి ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవుతుందనడంలో సందేహమే లేదు. ఈ చిత్రంలో కూడా హీరో ఇద్దరు భామల మధ్య నలిగిపోతుంటాడు. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇది కూడా మంచి కామెడీ ఎంటర్‌టైనర్. ట్రైలర్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది కాబట్టి సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్..

ఇవి చాలవన్నట్టుగా విజయ్ నటించిన ‘జయ నాయగన్’ కూడా పొంగల్ బరిలో ఉండనుంది. ఈ చిత్రం కూడా జనవరి 9న విడుదల కానుంది. అయితే పై చిత్రాలన్నింటికీ ఈ చిత్రానికి ఏమాత్రం పొంతన లేదు. అవన్నీ కామెడీ ఎంటర్‌టైనర్స్ అయితే ఇది మాత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. విజయ్ చివరి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటున్నాయి. ఇక పొంగల్ కింగ్ ఎవరనేది నాలుగు రోజులు ఆగితే కానీ తెలియదు. అప్పుడే ఏ సినిమాకు ఏ వరుసలో ఉందనేది కూడా తెలుస్తుంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 8, 2026 10:18 AM