థియేటర్‌లో పాప్‌కార్న్ దోపిడీ.. నీ ఇంగితజ్ఞానానికి ఏమైంది? తుప్పు పట్టిందా?
సినిమా అంటే ఒకప్పుడు వినోదం.. కానీ ఇప్పుడు అది జేబుకి వేసే ఒక పెద్ద గండం. టికెట్ రేటు కంటే లోపల అమ్మే ‘గడ్డి’ (పాప్‌కార్న్) రేటు ఎక్కువగా ఉందని ఏడుస్తూ, థియేటర్లకు జనం రావడం లేదని విశ్లేషణలు చేసే మేధావులు ఒకవైపు..
సినిమా అంటే ఒకప్పుడు వినోదం.. కానీ ఇప్పుడు అది జేబుకి వేసే ఒక పెద్ద గండం. టికెట్ రేటు కంటే లోపల అమ్మే ‘గడ్డి’ (పాప్‌కార్న్) రేటు ఎక్కువగా ఉందని ఏడుస్తూ, థియేటర్లకు జనం రావడం లేదని విశ్లేషణలు చేసే మేధావులు ఒకవైపు.. అసలు మిమ్మల్ని ఎవడు తినమన్నాడు? అని సూటిగా ప్రశ్నించే ఇంగితజ్ఞులు మరోవైపు. సినిమా చూడటానికి వెళ్తున్నామా లేక మూడు గంటల పాటు పీకల దాకా మేయడానికి వెళ్తున్నామా? అనే కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది.
సినిమాకా, మేత మేయడానికా?
అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది థియేటర్ల పరిస్థితి. టికెట్ ధర మీద దోపిడీ, పాప్‌కార్న్ మీద అన్యాయం, కూల్ డ్రింక్ మీద అరాచకం.. ఇవన్నీ సరే! కానీ, ఇక్కడ అసలు ప్రశ్న ఒకటి ఉంది. గతంలో టికెట్ ధరల కేసు విచారణలో ఒక గౌరవనీయ న్యాయమూర్తి అడిగిన మాట గుర్తుందా? మూడు గంటల పాటు సినిమాను తినకుండా చూడలేరా? మీరు వెళ్తున్నది సినిమా చూడటానికా.. లేక అక్కడ షడ్రుచులు ఆస్వాదించడానికా? అని. నిజంగానే, ఆ మూడు గంటలు నోరు కట్టుకోలేనంత ఆకలి మనల్ని ఏం చేస్తోంది? ఇది ఆకలా లేక అలవాటా? అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్న సామెత మనకి సరిగ్గా సరిపోతుంది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు లోపల స్నాక్స్ కోసం ఏడుస్తున్నారని వాపోతుంటారు. అసలు మీ పిల్లల్ని పాప్‌కార్న్ కొనకుండా నియంత్రించలేకపోతున్నారంటే ఆ తప్పెవరిది? దానికి థియేటర్ యజమానిని నిందించడమెందుకు? సినిమానా? పాప్‌కార్నా? ఏది ముఖ్యం? ఒకే సమయంలో ఒకే పని చేయాలి అన్న కనీస ఇంగితజ్ఞానం మనకెందుకు లేదు? ఎందుకనీ అనేది తెలుసుకోవాలి.
పక్కవాడి కోసమే ఈ పాట్లు!
నిజం ఒప్పుకుందాం.. థియేటర్లో మనం పాప్‌కార్న్ కొనేది ఆకలితో కాదు, పక్క సీటు వాడి భయంతో! ఇంట్లో కడుపు నిండా తిని వెళ్లినా, థియేటర్లో వందల రూపాయల స్నాక్స్ కొనకపోతే పక్కవాడు మనల్ని ఎలా అంచనా వేస్తాడోనన్న భయం కూడా ఒకటి ఉంటుంది. థియేటర్‌లో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ తాగడమనేది కొందరికి స్టేటస్ సింబల్. ఇక మన స్టేటస్ దెబ్బతింటుందేమో అని, కష్టపడి సంపాదించిన డబ్బును పాప్‌కార్న్ మీద తగలేస్తున్నాం. పక్కవాడి కోసం ఆర్భాటం.. ఇంటికెళ్తే ఆకలి కేకలు అన్నట్లు ఉంది మన తీరు. ఎవరైనా గన్ పెట్టి మిమ్మల్ని పాప్‌కార్న్ కొనమంటున్నారా? లేదు కదా! ధరలు ఎక్కువ అని తెలిసినప్పుడు, కొనకుండా సినిమా చూసి వస్తే ఎలాంటి ఇబ్బందీ లేదు కదా. పైగా ఎవరూ కొనకుంటే థియేటర్ వాడు కొద్ది రోజులకైనా మారొచ్చేమో. రేట్లు తగ్గించవచ్చేమో. తిట్టుకుంటూనే.. కష్టమైనా కొంటున్నాం కాబట్టే రేట్లు అలా పెట్టారు. ఒకవేళ ఎవరూ తీసుకోకుంటే రేట్లు అలా ఉండవేమో. కానీ ఆ ఆలోచన ఎవరికి ఉంటుంది? పిల్లలకు పాప్‌కార్న్ అంటే అంత ఇష్టమైతే, సినిమా అయ్యాక బయట తక్కువ రేటుకు దొరికే దగ్గర కొనివ్వొచ్చు. లేదంటే ఇంట్లోనే వేయించి పెట్టొచ్చు. థియేటర్ లోపల వేల రూపాయలు తగలేస్తేనే అది పిల్లల మీద ప్రేమో లేక మీ ధనవంతుల హోదాకో గుర్తు కాదు కదా.
సినిమా చూడు.. జేబును కాపాడు!
సినిమా థియేటర్లకు జనం రాకపోవడానికి దోపిడీ ఒక కారణం కావచ్చు, కానీ మనకు ఎప్పుడు ఏం చేయాలో స్పష్టత లేకపోవడం అంతకంటే పెద్ద కారణం. సినిమా చూస్తూనే తినాలన్న రూల్ అయితే ఏమీ లేదు కదా.. ఈ ఇంగితజ్ఞానం లేకుండా పిల్లలను పెంచుతూ, వ్యవస్థను తిట్టడంలో అర్థం లేదు. ఇప్పటికైనా ‘మేత’ మీద ధ్యాస తగ్గించి, ‘సినిమా’ మీద దృష్టి పెడితే.. జేబు సేఫ్, మీ ఇంగితజ్ఞానమూ సేఫ్! చివరగా ఒక్క మాట.. థియేటర్లో ఆ వందల రూపాయల పాప్‌కార్న్ కొనకపోతే నీ ‘స్టేటస్’ పడిపోతుందని నువ్వు భయపడుతున్నావేమో కానీ, నిజానికి ఆ రేట్లు చూసి కూడా క్యూలో నిలబడి కొంటున్న నిన్ను చూసి పక్కవాడు ‘వీడెవడ్రా బాబు.. ఇంత అమాయకంగా బలి అయిపోతున్నాడు!’ అని జాలిపడేవారు సైతం ఉంటారని తెలుసుకోవాలి. పక్క సీటు వాడు ఏమనుకుంటాడో అన్న భయం నీ సంపాదనను కరిగించేస్తోంది. వాడు నీ ఇంటికొచ్చి నీ పిల్లల ఫీజులు కట్టడు, నీ అప్పులు తీర్చడు. సినిమా అంటే ఒక అనుభూతి, దాన్ని కళ్లతో చూసి ఆస్వాదించాలి కానీ, నోటితో నమిలి మింగేది కాదు. ‘అడిగిందల్లా కొనివ్వడం గొప్ప పెంపకం కాదు.. ఏది ఎక్కడ కొనాలో, ఏది కొనకూడదో నేర్పడమే అసలైన పెంపకం’. ఇప్పటికైనా కళ్లు తెరుచుకో.. లేదంటే నీ ‘స్టేటస్’ మాట దేవుడెరుగు, నీ జేబు మాత్రం ప్రతి ఇంటర్వెల్‌లో ‘దివాలా’ తీస్తూనే ఉంటుంది!
ప్రజావాణి చీదిరాల