IBomma: ‘బొమ్మ’ ఆట కట్టించినందుకు సినీ పరిశ్రమ హర్షం
కొన్నేళ్లుగా ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా ఐబొమ్మ (IBomma).. దీని కారణంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది నిర్మాతలు నష్టపోయారు. ఇండస్ట్రీకి ఈ పైరసీ భూతం పెద్ద తలనొప్పిగా పరిణమించింది.
కొన్నేళ్లుగా ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా ఐబొమ్మ (IBomma).. దీని కారణంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది నిర్మాతలు నష్టపోయారు. ఇండస్ట్రీకి ఈ పైరసీ భూతం పెద్ద తలనొప్పిగా పరిణమించింది. సినిమా థియేటర్‌లో ఉండగానే.. పైరసీ భూతం నెట్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చేస్తోంది. దీంతో థియేటర్స్‌కి వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి సినీ పరిశ్రమ విపరీతంగా నష్టపోతోంది. ఈ క్రమంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీకి ఆనందాన్నిచ్చింది. దీనిపై చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు నేడు ప్రెస్‌మీట్ నిర్వహించి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
భరత్ భూషణ్ మాట్లాడుతూ... ఐబొమ్మ అనే పైరసీ వెబ్‌సైట్ ఓనర్ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసినందుకు డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీనికోసం కష్టపడి పనిచేసిన పోలీసు బృందంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వానికి, ఫిలిం ఛాంబర్ పైరసి సెల్ వారికి సైతం భరత్ భూషణ్ ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ... ‘చిత్ర పరిశ్రమ కోసం డిపార్ట్మెంట్ నుంచి ఎంతో మంది పోలీస్ అధికారులు పని చేశారన్నారు. ఈ ప్రయత్నంలో విదేశీ పోలీసులు సైతం సాయంగా నిలిచారన్నారు. దేశం మొత్తమ్మీద తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కటే పైరసీ సెల్ మెయింటైన్ చేస్తోందన్నారు. పోలీసులు చాలా కష్టపడి ఐబొమ్మ రవిను పట్టుకున్నారనీ.. దీనికి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... పైరసిని అరికట్టినందుకుగానూ.. పోలీస్ వారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు పైరసీని ఆశ్రయిస్తున్నారన్నారు. కానీ దీని కారణంగా చిన్న సినిమాలు సైతం ఇబ్బంది పడుతున్నాయన్నారు. అలాగే సినిమా క్యూబ్, యుఎఫ్ఓ వెళుతున్న సందర్భంలో సర్వర్లు బలంగా ఉండేలా చూసుకోవాలని శ్రీనివాసరావు హితవు పలికారు. ఇకపై వారి దగ్గర నుంచి సినిమాలు లీక్ అయితే దానికి వారే బాధ్యత వహించాలన్నారు.
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ... సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ అని తెలిపారు. అది టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్‌గా తీసుకోవడం సినీ పరిశ్రమకు వరంగా మారిందన్నారు. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చే విధంగా ఉండాలని అనిల్ కుమార్ అన్నారు.
అమ్మి రాజు మాట్లాడుతూ... ప్రభుత్వం, పోలీసులు కలిసి మా సినిమా పరిశ్రమకు గొప్ప సాయం చేశారని.. వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులు అందరూ థియేటర్‌లోనే చూడాలని కోరుకుంటున్నానన్నారు.
వీర శంకర్ మాట్లాడుతూ... సినీ పరిశ్రమ తరపున పైరసీ చేసేవారిని పట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పైరసీ చేసేవారిపై బలమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నామని... అలాగే సినిమా ఎక్కడ నుంచి పైరసీ అవుతుందో గుర్తించి వారు కూడా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ముత్యాల రామ ప్రసాద్ మాట్లాడుతూ... పైరసీకి పాల్పడుతున్న ఇమ్మడి రవిని పట్టుకోవడం గొప్ప విషయమే కానీ ఇలా ఎంతో మంది ఉన్నారన్నారు. సినిమాలను ఇతర వెబ్‌సైట్స్ ద్వారా కూడా పైరసీ చేస్తున్నారన్నారు. కాబట్టి రూల్స్ కఠినంగా ఉండేలా చూడాలన్నారు. ఐబొమ్మ రవిని పట్టుకున్నందుకు ప్రభుత్వానికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
బాపిరాజు మాట్లాడుతూ... తాను నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఈ పైరసీ వల్ల ఎంతో ఇబ్బంది పడినట్టు వెల్లడించారు. వారిని పట్టుకోవడంలో తమ వంతు కృషి చేసిన అందరినీ ఆయన అభినందించారు. ఈ సినిమాల కోసం తామెంతో కష్టపడి పెట్టుబడులు పెడుతున్నామని... ఇలా పైరసీ చేస్తే తమకు బతకడమే కష్టమవుతుందన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... థియేటర్‌లో కాకుండా HD ప్రింట్‌లు రావడంతో సినిమాలు నేరుగా హాక్ చేసి పైరసీ చేస్తున్నారనే విషయం తమకు అర్థమైందన్నారు. దానిని అరికట్టేందుకు పైరసీ సెల్ నుంచి పోలీసుల వరకూ చాలా మంది కష్టపడి పని చేశారన్నారు. వారిని అందరూ అభినందించారు.
మీడియా నుంచి రాంబాబు మాట్లాడుతూ... పైరసీ జరిగిపోయిన తర్వాత కాకుండా ముందుగానే జరగకుండా ఆపేస్తే మంచిదన్నారు. పైరసీ అరికట్టడంలో తమ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని రాంబాబు తెలిపారు.
ప్రజావాణి చీదిరాల