Kothamalupu: ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది..
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘కొత్తమలుపు’ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఇందులో ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు.
ప్రముఖ నేపథ్య గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తాటి బాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ జోష్‌ను పెంచేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘కొత్తమలుపు’ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఇందులో ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని... సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చిందన్నారు. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ.. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించామని.. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరిందన్నారు. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నామన్నారు. జూన్ 12న సినిమా విడుదల కానుందని తెలిపారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది తనకు తొలి చిత్రమని.. దర్శకుడికి, హీరోయిన్‌కు కూడా తొలి చిత్రమని పేర్కొన్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. కమెడియన్ మహేంద్ర సినిమా లో చేసిన కామెడీ హైలెట్ గా నిలుస్తుందని అన్నారు..
హీరో ఆకాష్ గోపరాజు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్ భైరవి అర్ధ్యా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రమని.. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందన్నారు. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయని పేర్కొన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కొందరు మాట్లాడుతూ.. ‘కొత్త మలుపు’ కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిందన్నారు. జూన్ 12న విడుదల కానున్న ‘కొత్త మలుపు’ ప్రేక్షకులకు ప్రేమ, సస్పెన్స్, హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో కూడిన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు.