Akhanda 2: ముంబై వేదికగా ‘అఖండ 2’ రివ్యూ ఇచ్చిన తమన్
బాలయ్య లాయల్, రాయల్ అని.. ప్రజలంటే ఆయనకెంతో ప్రేమని అన్నారు. సినిమాల్లోనూ.. నిజ జీవితంలోనూ ఆయనొక లెజెండ్ అని కొనియాడారు. ఆయనపై తన ప్రేమను మ్యూజిక్ ద్వారా తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోకి ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటారు. వీరి కాంబోలో వచ్చిన ఎన్నో చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించాయి. ఈ కోవలోనే వచ్చిన ‘అఖండ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో 'అఖండ 2: తాండవం' (Akhanda 2: Thandavam) కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త (Samyuktha) ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ఆది పినిశెట్టి (Adi Pinishetty) ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించనున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ (Akhanda 2 First Single)-ది తాండవం రిలీజ్ ఈవెంట్ నేడు (శుక్రవారం) ముంబైలో జరిగింది.
ఆధ్యాత్మికతకు అద్దం పడుతూ అద్భుతమైన ఈ పాటకు తమన్ (Music Director Thaman) సంగీతం అందించారు. బాలకృష్ణ అఘోర అవతారంలో, అఘోర మంత్రాలతో శివ తాండవం చేయడం గూస్ బంప్స్ తెప్పించింది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కథానాయకుడిగా కొనసాగుతున్న తనకు సెకండ్ ఇన్నింగ్స్ అనేదే లేదన్నారు. ‘అఖండ 2’లో హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమంతో పాటు ధర్మంగా ఉండాలని.. అన్యాయానికి తలవంచవద్దని చెప్పడం జరిగిందన్నారు. బోయపాటితో చేసిన మూడు చిత్రాలు హ్యాట్రిక్ సాధించాయని.. ఇది నాలుగవ చిత్రమని బాలయ్య అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, తనది హిట్ కాంబినేషన్ అన్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలకమైన పాత్రలోనటించారని ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ సినిమాను జార్జియా, మధ్యప్రదేశ్ తదితర ప్రదేశాల్లో ఉన్న అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించినట్టు వెల్లడించారు. ఈ సినిమాను సమర్పిస్తున్న తన కూతురు తేజస్వి.. గతంలోనూ తను హోస్ట్‌గా చేసిన ఇండియాలోనే నంబర్ వన్ షో ‘అన్‌స్టాపబుల్’ఖి క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేసిందని బాలయ్య వెల్లడించారు.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఇది ఒక సినిమా కాదని.. భారతదేశ ఆత్మ, ధర్మమని.. సినిమా చూసిన వారంతా అదే ఫీల్ అవుతారన్నారు. కుటుంబమంతా కలిసి వెళ్లి ఆనందంగా చూసే చిత్రమని.. దీనిలో మన వేదం, సంస్కృతి వంటి అంశాలన్నింటినీ చూస్తారన్నారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ సాధిస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మైనస్ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేశామని.. అందుకు శివుడే దారి చూపించాడని అన్నారు. తమన్ మాట్లాడుతూ.. బాలయ్య లాయల్, రాయల్ అని.. ప్రజలంటే ఆయనకెంతో ప్రేమని అన్నారు. సినిమాల్లోనూ.. నిజ జీవితంలోనూ ఆయనొక లెజెండ్ అని కొనియాడారు. ఆయనపై తన ప్రేమను మ్యూజిక్ ద్వారా తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. బాలయ్య ప్రతీ చిత్రం తనకొక కేస్ స్టడీ అని.. తానెంతో నేర్చుకున్నానని అన్నారు. ఇంటర్వెల్ సీన్ పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని.. సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంటుందని ముందుగానే తమన్ సినిమాకు తన రివ్యూ ఇచ్చేశారు.
నిర్మాత గోపి ఆచంట (Producer Gopi Achanta) మాట్లాడుతూ.. ఇదొక అద్భుతమైన ప్రయాణమని.. ముంబై నుంచి తమ పాన్ ఇండియా ప్రమోషన్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అఖండ 2 పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతోందని ఆయన వెల్లడించారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. బాలయ్య బాబుతో పని చేయడం అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని తెలిపారు. బంగారం లాంటి మనసున్న మనిషి బాలయ్య అని ఆది కొనియాడారు. బోయపాటి, బాలయ్య, తమన్ కాంబోలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని.. ఇదొక బ్లాక్ బస్టర్ కాంబో అని.. ఈ సినిమా సునామీ సృష్టించబోతోందన్నారు.
ప్రజావాణి చీదిరాల