M4M: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’.. ఎప్పుడంటే..
మోహన్ వడ్లపట్ల సస్పెన్స్, మిస్టరీ, డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వినోదాన్ని సమర్థవంతంగా మిళితం చేస్తూ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే అనుభూతిని ఈ చిత్రం అందించింది.
అమెరికన్ నటి జో శర్మ, సమ్‌బీత్ ఆచార్య నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)”. దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం మే 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు, సినీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఈ చిత్రం ఐఎండీబీలో 9.1/10, బుక్ మై షోలో 9.6/10 వంటి అద్భుతమైన రేటింగ్స్‌ను సాధించింది. అలాగే పలు ప్రముఖ దినపత్రికలు, టెలివిజన్ ఛానెల్స్‌తో పాటు వినోద వెబ్‌సైట్లు అన్నీ ఈ చిత్రానికి 5లో 3.5 వరకు రేటింగ్స్ ఇస్తూ ప్రశంసించాయి. భారత్‌తో పాటు అమెరికాలోని ప్రేక్షకులు కూడా ఈ చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకుకున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా అక్కడి ప్రేక్షకులు అభివర్ణించారు.
థియేటర్లలో ఇంతటి అద్భుత విజయం సాధించిన ఈ చిత్రం ప్రదర్శన అనంతరం ఇప్పుడు “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం జూన్ 19 నుంచి పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. లయన్స్‌గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, జియోటీవీ, టాటా ప్లే బింజ్ తదితర ఓటీటీ వేదికల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. మోహన్ వడ్లపట్ల సస్పెన్స్, మిస్టరీ, డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వినోదాన్ని సమర్థవంతంగా మిళితం చేస్తూ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే అనుభూతిని ఈ చిత్రం అందించింది. ఈ చిత్రం థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే ప్రేక్షకులను ఓటీటీలోనూ ఆకట్టుకోనుంది.
అనూహ్యమైన ట్విస్ట్‌లు, ఉత్కంఠభరితమైన కథనం, బలమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. షాకింగ్ క్లైమాక్స్‌తో ఈ చిత్రాన్ని ముగించిన తీరు కూడా ఆసక్తికరమే. ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి హీరోయిన్ జో శర్మ నటన. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధ పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు, శక్తివంతమైన నటన ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను అందుకొని చిత్రంలోని అత్యంత బలమైన అంశాల్లో ఒకటిగా నిలిచాయి. కాబట్టి సినీ ప్రేక్షకులు జూన్ 19 నుంచి తమ ఇళ్లలోనే కూర్చొని “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” అందించే మిస్టరీ, సస్పెన్స్, ఉత్కంఠభరితమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు.