Sasi Kiran Tikka: సీఎం మరణవార్త ముందే చెప్పేశాం.. వారానికే వైఎస్ఆర్ మృతి..
అనుకోకుండా చేసిన ఒక పని రివర్స్ అయితే ఎలా ఉంటుంది? మన ప్రమేయం లేకపోవచ్చుగాక.. కావాలనే చేశారని అంటారు కదా.. అసలే లోకులు పలు కాకులు.. చిన్న దానికే నానార్థాలు.. పరమార్థాలు తీసి రచ్చ చేస్తారు.

అనుకోకుండా చేసిన ఒక పని రివర్స్ అయితే ఎలా ఉంటుంది? మన ప్రమేయం లేకపోవచ్చుగాక.. కావాలనే చేశారని అంటారు కదా.. అసలే లోకులు పలు కాకులు.. చిన్న దానికే నానార్థాలు.. పరమార్థాలు తీసి రచ్చ చేస్తారు. అలాంటిది ఒక పెద్ద ఘటన జరిగితే ఊరుకుంటారా? అసలేం జరిగింది? ఎవరు ఏం మాట్లాడారు? మా మానాన మేము మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఈ రచ్చ ఏంటి అంటారా? చెబుతామండీ.. చెబుతాం.. చెప్పాలనే కదా మా తపనంతా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ దర్శకుడు తమ సినిమాలోని ఓ సన్నివేశాన్ని టీవీ ఛానల్స్‌లో చిత్రీకరించాల్సి ఉంటే వెళ్లి చిత్రీకరించారట. అది కాస్తా వారానికే రియల్ లైఫ్‌లో జరిగింది. యావత్ దేశం షాకైంది.. ఈ సినిమా తీసిన వారికి మాత్రం చుక్కలు కనిపించాయి. అదేదో సాధారణ విషయమైతే ఎవరూ పట్టించుకోకపోదురు.. కానీ ఒక రాష్ట్రానికి సీఎం మరణిస్తే.. అది తమ సినిమాలోని సీఎం మరణించిన సన్నివేశాన్ని తీసిన వారానికే.. పైగా తీసింది ఎక్కడో కాదు.. పలు టీవీ ఛానళ్లలో.. అయినా సరే పెద్దగా ఏమీ కాకపోవు.. సీఎం మరణవార్తను దర్శకుడు ముందుగానే మీడియాకు చెప్పేశారు. ఇంకేముంది? ఇదిగో తోక అంటే అదిగో పులి అనే మీడియా సమక్షంలో ఆ సన్నివేశాన్ని సదరు దర్శకుడే స్వయంగా పంచుకుంటే ఊరుకుంటుందా? అన్ని టీవీ ఛానల్స్ ఆ న్యూస్‌ను టెలికాస్ట్ చేశాయి. వారానికే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మరణవార్త. కావాలనే ముందుగా ఆ మూవీ టీంతో చెప్పించారు.. పక్కాగా ఆ చనిపోయిన సీఎంది హత్యేనంటూ నానా రకాల ప్రచారాలు.. ఇంతకీ ఆ సీఎం ఎవరో మీకు అర్థమైపోయే ఉంటుంది.
అది చూసిన ఆగిన గుండెలెన్నో..
ఆయన మరెవరో కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy). ఆ సినిమా మరేదో కాదు.. ‘లీడర్’. ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందింది. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శశి కిరణ్ తిక్కా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైఎస్ఆర్ మరణం మరువలేనిది. దాదాపు మూడు రోజుల పాటు ఉభయ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తల్లడిల్లిపోయింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంది. ఆశలన్నీ అడియాసలయ్యాయి. వైఎస్ఆర్ (YSR) దేహం కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. అది చూసిన ఆగిన గుండెలెన్నో.. ఆయన మరణం ప్రమాదం కాదని.. కావాలని ప్రమాదం సృష్టించారంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది. ఆయనను రాజకీయ ప్రత్యర్థులే పొట్టనబెట్టుకున్నారంటూ సాక్షాత్తు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ఎన్నో మార్లు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు అప్పట్లో సాక్ష్యంగా ‘లీడర్’ (Leader) చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) వ్యాఖ్యలను నిదర్శనంగా చూపించారు.
సినిమా కథలా అవుతదా?
అసలేం జరిగిందంటే.. ‘లీడర్’ చిత్రంలో సీఎం చనిపోయిన ఘటన ఉంటుంది. సీఎం చనిపోయారంటే ఛానల్స్‌లో న్యూస్ వస్తుంది కదా. ఆ సన్నివేశాలను పలు న్యూస్ ఛానళ్లకు వెళ్లి చిత్రీకరించారు. అయితే ఆ సమయంలో శేఖర్ కమ్ముల సీఎం చనిపోయిన సన్నివేశం గురించి రివీల్ చేశారు. సీన్ కట్ చేస్తే వారానికే అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాపర్ మిస్ అవడం.. ఆ తరువాత ఆయన మరణించినట్టుగా తెలిసింది. అది ప్యూర్ కో ఇన్సిడెన్స్. కానీ కొందరు మాత్రం కావాలనే తమ చేత చెప్పించారని విమర్శలు గుప్పించారని ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్న శశి కిరణ్ తిక్క (Sasi Kiran Tikka) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తమకు కూడా సీన్‌ను ముందే చెప్పేశామేంటన్న ఫీలింగ్ వచ్చిందని తెలిపారు. ‘‘వైఎస్ఆర్ చాపర్ మిస్ అయినప్పుడు ఆయనకు ఏమీ అవ్వకూడదని కోరుకున్నాం కానీ.. ఒకవేళ ఏమైనా అయితే మన సినిమా కథలా అవుతదా? అని తెగ డిస్కస్ చేసుకుంటూ ఆందోళన చెందాం’’ అన్నట్టుగా శశికిరణ్ తిక్క తెలిపారు.
ప్రజావాణి చీదిరాల