Entertainment

Sampradayini Suppini Suddapusani Review: శివాజీ, లయ మేజిక్ వర్కవుట్ అయ్యిందా?

వరుస సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ విన్‌.. సెకండ్ ఇన్నింగ్స్ మంచి విజయాలను అందుకుంటున్న నటుడు శివాజీ కలయికలో రూపొందిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.

Sampradayini Suppini Suddapusani Review: శివాజీ, లయ మేజిక్ వర్కవుట్ అయ్యిందా?

వరుస సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ విన్‌.. సెకండ్ ఇన్నింగ్స్ మంచి విజయాలను అందుకుంటున్న నటుడు శివాజీ కలయికలో రూపొందిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 20 ఏళ్ల తర్వాత లయతో కలిసి శివాజీ ఈ చిత్రంలో అలరించారు. సినిమాకు బీభత్సమైన ప్రమోషన్స్ నిర్వహించి అంచనాలను అయితే పెంచేశారు. ఈ చిత్రాన్ని స్వయంగా శివాజీయే నిర్మించారు. మరి శివాజీకి ఈ చిత్రం సక్సెస్‌ను అందించిందా? అంచనాలను అందుకుందా?

కథేంటంటే...

పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీరామ్‌ (శివాజీ) నీతి నిజాయితీలే ప్రాణంగా బతుకుతుంటాడు. కొత్తకోట సమీపంలోని హార్స్‌లీ హిల్స్‌లో భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు అలియాస్‌ నితిన్‌ (రోహన్‌)తో కలిసి జీవిస్తుంటాడు. కొడుకేమో రీల్స్ పిచ్చి. భార్యకు కొడుకంటే విపరీతమైన ప్రేమ. వీరిద్దరూ కలిసి శ్రీరామ్‌కు చుక్కలు చూపిస్తుంటారు. ఒకరోజు ట్రాఫిక్‌ను ఆపేసిన సందర్భంలో శ్రీరామ్‌కు.. ఆ ఊరి ఎస్సై విక్రమ్‌ వాసుదేవ్‌ (ప్రిన్స్‌)కు గొడవ అవుతుంది. విక్రమ్ వాసుదేవ్‌కు ఆడవాళ్ల పిచ్చి. ఆ ఓ దీపావళి రోజున శ్రీరామ్ వాళ్ల ఇంటికి విక్రమ్ వస్తాడు. కట్‌ చేస్తే.. శివాజీ ఇంటికి వచ్చేసరికి శ్రీరామ్‌ కొడుకు చేతిలో ఆ ఎస్సై హత్యకు గురవుతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. మరోవైపు రూ.కోటి డబ్బు ఉన్న తన గిఫ్ట్‌ బ్యాగ్‌ ఎత్తుకెళ్లారంటూ స్థానిక ఎమ్మెల్యే తిమ్మప్ప (శరత్‌ లోహితాశ్వ) గ్యాంగ్‌ శ్రీరామ్‌ వెంట పడుతుంది. నిజంగానే శ్రీరామ్ ఆ డబ్బు బ్యాగ్‌ను ఎత్తుకెళ్లాడా? ఎస్సైని బిట్టు ఎందుకు చంపాడు? ఆ తరువాత శ్రీరామ్ కుటుంబం ఎలాంటి కష్టాలు పడింది. చివరికి కథ ఏ మలుపు తీసుకుంది? వంటి అంశాలను తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఒక చిన్న కుటుంబం. భార్య, కొడుకు చేసే పనులకు నిజాయితీపరుడైన భర్త ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ముఖ్యంగా సినిమా మొత్తం ఈ ముగ్గురి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొన్ని పాత్రలు వచ్చినా కూడా ఏదో అతిథి పాత్రల మాదిరిగా ఉంటుందే తప్ప పూర్తి స్థాయిలో రోల్ ఏ నటుడికి దక్కలేదు. దర్శకుడు సుధీర్ ఈ చిత్రాన్ని కామెడీ అండ్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌గా చూపించే యత్నమైతే చేశారు కానీ కామెడీ పెద్దగా ఎక్కడా కూడా వర్కవుట్ కాలేదు. కథలో కొత్తదనం లేకున్నా.. థ్రిల్‌ను మాత్రం బాగానే మెయిన్‌టైన్ చేశారు. రఘుతో లయ, రోహన్ పాత్రల్ని పరిచయం చేసిన తీరు బాగుంటుంది. ఎస్సై విక్రమ్ హత్య నుంచి సినిమాలో థ్రిల్ ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం.. ఎస్సై హత్య.. ఆ తరువాత శవాన్ని మాయం చేయాలనుకోవడం వంటి అంశాలతో రూపొందింది. సెకండాఫ్ నుంచి కథలో థ్రిల్ అనేది ప్రారంభమవుతుంది. రోహన్ పాత్ర.. ఒక ఐదేళ్ల పిల్లాడి చేత చేయిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ఐదేళ్ల పిల్లాడు హత్య చేసి దానిని గుర్తించలేదంటే నమ్మొచ్చు. కానీ రోహన్‌కు హత్య చేసినా ఆ విషయం తెలియకపోవడం.. పోలీసుల దగ్గర అమాయకంగా ఉండటం వంటివన్నీ అసహజంగా అనిపిస్తాయి. అంతేకాకుండా సాగదీత కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ప్రీక్లైమాక్స్‌ ట్విస్ట్ మాత్రం అందరికీ నచ్చుతుంది. అలాగే బండ్ల గణేశ్ పాయ సాంగ్ జోష్ తీసుకొస్తుంది.

ఎవరెలా చేశారంటే..

శివాజీ ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు. ఇక శ్రీరామ్ తరహా పాత్రల్లో అయితే జీవించేస్తారు. ఈ సినిమాలో ఆయన అదే చేశారు. ఈ చిత్రం శివాజీ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఇక శివాజీకి లయ తోడవటం కూడా ఓ ప్లస్. ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. వీళ్లిద్దరి నేపథ్యంలో వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. రోహన్ తన పాత్రలో చక్కగానే నటించాడు కానీ ప్రేక్షకులకు కనెక్ట్ అవడం కాస్త కష్టం. ప్రిన్స్, రఘుబాబు, అలీ, శరత్‌ లోహితాశ్వ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. సాగదీత లేకుండా కథను మరింత ఆసక్తికరంగా దర్శకుడు సుధీర్ మలచి ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. అలీ వంటి కమెడియన్స్‌ను తీసుకున్నారు కానీ వారిని సరిగా వాడలేదేమో అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా పేలవంగా ఉంది. స్క్రీన్‌ప్లే మెప్పిస్తుంది.

ఫైనల్‌గా.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నవ్వులు పంచడం కష్టమే కానీ థ్రిల్ పంచుతుంది.

రేటింగ్: 2.75/5

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 6, 2026 2:12 PM