Entertainment

Butchibabu Sana: ‘పెద్ది’లో రామ్ చరణ్ ఎక్కడా కనిపించరు..

దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌తో పాటు తెలంగాణలోని పహల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశామన్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా రామ్ చరణ్ పహల్వాన్ శిక్షణ తీసుకున్నారని బుచ్చిబాబు వెల్లడించారు.

Butchibabu Sana: ‘పెద్ది’లో రామ్ చరణ్ ఎక్కడా కనిపించరు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా బీభత్సంగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందకు రానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లను సైతం ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా విలేకరులసమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఏడాదిన్నరలోపే..

తన తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు ‘పెద్ది’తో వస్తున్నానని.. అంత పెద్ద సక్సెస్ అందుకున్నాక ఏ దర్శకుడికి అన్నేళ్ల సమయం పట్టదని బుచ్చిబాబు పేర్కొన్నారు. కానీ తన విషయంలోనే అలా జరిగిందన్నారు (నవ్వుతూ). తన గురువుగారు సుకుమార్ తనను చరణ్ దగ్గరకు తీసుకెళ్లారని తెలిపారు. తను కథ చెప్పగానే చరణ్‌కు నచ్చిందట. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తి చేశామని బుచ్చిబాబు తెలిపారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయాలని చరణ్‌కు ఉండేదట. అందుకే ఆ కథతోనే సినిమా చేశానని వెల్లడించారు. క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే.. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌తో పాటు తెలంగాణలోని పహల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశామన్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా రామ్ చరణ్ పహల్వాన్ శిక్షణ తీసుకున్నారని బుచ్చిబాబు వెల్లడించారు.

అంత ఈజీగా ఏమీ జరగలే..

అయితే ఎన్టీఆర్‌తో అనుకున్న కథను రామ్ చరణ్‌తో తీశారంటూ వస్తున్న వార్తలపై బుచ్చిబాబు స్పందించారు. ఎన్టీఆర్ కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరని.. ఇది పూర్తిగా చరణ్ కోసం తయారు చేసిన కథ అన్నారు. చరణ్‌ని కన్విన్స్ చేయడం అంత ఈజీగా ఏమీ జరగలేదట. కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమేనని.. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉందన్నారు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ పాత్రల గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. వీళ్లందరూ ఆ పాత్రలకు పర్ఫెక్ట్‌గా సరిపోతారన్నారు. శివన్న ఒక గురువుగా కనిపిస్తారని.. ఆటను బతికించేవాడి పాత్ర చేశారన్నారు. అలాగే జగపతిబాబు చేసిన అప్పలసూరి పాత్ర చాలా బరువైనదని.. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అదని పేర్కొన్నారు. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుందన్నారు.

చరణ్ వల్లే సాధ్యం..

జాన్వి కపూర్ పాత్ర గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. జాన్వి కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారని.. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారన్నారు. బుచ్చిబాబు చేసిన తొలి సినిమాకు రూ.25 కోట్లు అయితే, రెండో సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్‌తో తీయడంపై స్పందించిన బుచ్చిబాబు.. ఇది చరణ్ వల్లే సాధ్యమైందన్నారు. హీరోని బట్టి సినిమా తయారయ్యే విధానం మారుతుందిదన్నారు. ఈ సినిమాలో 'అబ్బనీ తీయని దెబ్బ' పాటను రీక్రియేట్ చేశారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుందన్నారు. అది వచ్చినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి దాన్ని కూడా మ్యూట్ చేసేశామన్నారు. రెహమాన్ ఆల్బమ్స్ అంటే తనకు చాలా ఇష్టమని బుచ్చిబాబు తెలిపారు. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో కల కన్నానని.. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చిందన్నారు. ఆయన పాటలను స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశానని.. ఇక మీదట లైఫ్ లాంగ్ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయానన్నారు.

చిరంజీవి తిడతారనుకున్నా..

అప్పట్లో పుష్ప సినిమా గురించి "పది కేజీఎఫ్‌లతో సమానం" అని బుచ్చిబాబు అన్నారు. మరి పెద్ది గురించి ఏమంటారని ఆయనను విలేకరులు ప్రశ్నించగా.. పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడన్నారు. ఈ సినిమా షూటింగ్‌లో చరణ్‌కి చాలా గాయాలయ్యాయని బుచ్చిబాబు తెలిపారు. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయని.. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం తనకు చాలా భయమేసిందన్నారు. ముఖ్యంగా చిరంజీవి తిడతారేమో అని భయపడ్డానని కానీ ఆయన "బుచ్చి వీడియో పంపించు" అన్నారు (నవ్వుతూ) అని తెలిపారు. పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించామని... ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లానన్నారు. తాను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారన్నారు. క్లైమాక్స్ గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్‌గా చూపించడం కత్తి మీద సాము లాంటిదన్నారు.

చాలా ఎమోషనల్‌గా..

క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలన్నారు. ఈ సినిమాలో స్పోర్ట్స్ ఎమోషన్‌తో పాటు బ్యాక్‌డ్రాప్‌లో చాలా పెద్ద కథ ఉంటుందన్నారు. ఒక 15 నిమిషాల మెయిన్ ఎమోషనల్ బ్లాక్ ఉందన్నారు. దాన్ని ట్రైలర్‌లో రివీల్ చేయలేదన్నారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ వస్తున్న వార్తలపై బుచ్చిబాబు స్పందించారు. సీక్వెల్ వంటివేమీ అనుకోలేదన్నారు. ఫైనల్ కాపీ చూశాక మంచి సినిమా తీశాననే ఫీలింగ్ కలిగిందన్నారు. పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే.. ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండని బుచ్చిబాబు పేర్కొన్నారు. సినిమా సూపర్‌గా.. చాలా ఎమోషనల్‌గా... కమర్షియల్‌గా ఉంటుందన్నారు. ఇందులో చరణ్ ఎక్కడా కనిపించరని... పెద్ది మాత్రమే కనిపిస్తాడన్నారు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని బుచ్చిబాబు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఇంకా సినిమా చూడలేదని.. సురేఖ గారు ఒక సీక్వెన్స్ చూసి ఎమోషనల్ అయ్యారన్నారు.

 

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 2, 2026 3:57 PM