Nandu: ‘సైక్ సిద్దార్థ్’ ఫస్ట్ హాఫ్ రానా.. సెకండాఫ్ సురేష్ బాబు
సినీ రంగంలో అడుగు పెట్టిన వారికి వైకుంఠపాళి. నిచ్చెనలే కాకుండా అడుగడునా కాటేసే పాములుంటాయి. వాటిని దాటుకుంటూ వెళితేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. దీనికోసం ఏళ్లకేళ్లు శ్రమించే వారుంటారు. అలాంటి వారిలో నటుడు నందు కూడా ఒకరు.
సినిమా అనేది చూసేవారికి రంగుల ప్రపంచం. కానీ ఆ రంగంలో అడుగు పెట్టిన వారికి వైకుంఠపాళి. నిచ్చెనలే కాకుండా అడుగడునా కాటేసే పాములుంటాయి. వాటిని దాటుకుంటూ వెళితేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. దీనికోసం ఏళ్లకేళ్లు శ్రమించే వారుంటారు. అలాంటి వారిలో నటుడు నందు కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన నటించి.. నిర్మించిన చిత్రం ‘సైక్ సిద్దార్థ్’ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
ఎప్పుడో ‘100% లవ్’ చిత్రాన్ని చూసిన వారంతా ఇంకేముంది నందు లైఫ్ సెట్ అనుకున్నారు. కట్ చేస్తే ఆ చిత్రానికి సంబంధించిన క్రెడిట్ అంతా నాగచైతన్య, తమన్నాలకు మాత్రమే దక్కింది. ఆ తరువాత చాలా చిత్రాల్లో కనిపించాడు కానీ ఎందుకో మంచి క్రేజ్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది.. అలా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు వస్తుంటాయి. నందుకి కూడా అలాగే వచ్చేవట. కానీ చెబుదామంటే.. ఎక్కడ తీసుకోరోనన్న భయం. ఆ సమయంలోనే తానే ఒక సినిమా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందట. అలా అప్పటి నుంచి సినిమా తీయడం కోసం తన సంపాదన నుంచి కొంత డబ్బును సైడ్ చేస్తూ వచ్చాడు.
గీత సహకారం తీసుకున్నాడా?
ఐపీఎల్ యాంకరింగ్, ఢీ షో యాంకరింగ్‌తో పాటు పలు చిత్రాల్లో వచ్చిన రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని తన కల సాకారం కోసం వెచ్చిస్తూ వచ్చాడు. అలా వచ్చిన డబ్బుతోనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. అలా సైక్ సిద్దార్థ్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. మరి తన సతీమణి గీతా మాధురి నుంచి సహకారం తీసుకున్నాడా? అంటే సింగిల్ ఎన్‌పీ కూడా తీసుకోలేదని నిర్మొహమాటంగా చెప్పాడు. తన తల్లి తన దగ్గర ఆడపిల్ల సంపాదన నుంచి రూపాయి కూడా తీసుకోవద్దని ప్రామిస్ తీసుకుందని.. తాను ఆ మాటపైనే ఇప్పటికీ నిలబడి ఉన్నానని చెప్పుకొచ్చాడు. తనకు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి అందిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేనిదన్నాడు. అంతేకాదండోయ్.. నందులో పట్టువదలని విక్రమార్కుడున్నాడు.
రానాను ఇంత గట్టిగా ఎవరూ వాడలేదేమో..
ఇప్పటికే రానా దగ్గుబాటిని ఎంతలా హింసించాడనే దానికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు వచ్చాయి. బాహుబలిని భళ్లాలదేవ ఓ మోస్తరుగానే ఇబ్బందిపెట్టాడు కానీ ఈ భళ్లాల దేవను మాత్రం నందు ఎంతలా హింసించాడో ఆ వీడియోలను చూస్తే తెలుస్తుంది. పడుకున్నా.. జిమ్‌లో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. అక్కడికెళ్లి తన సినిమాకు ప్రమోషన్ చేయమంటూ హింసించాడు. మొత్తానికి రానాను ఇంత గట్టిగా ఎవరూ వాడి ఉండిరేమో. ఇక తన చిత్రాన్ని సైతం రానా, సురేష్‌బాబుతోనే పోల్చాడు. ఫస్ట్ హాఫ్ రానా అని.. సెకండ్ హాఫ్ సురేష్ బాబు అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్ జెన్ జీ బ్యాచ్‌ను బాగా ఆకట్టుకుంటుందని.. సెకండ్ హాఫ్ మహిళలు సహా అందరినీ ఆకట్టుకుంటుందని నందు చెప్పుకొచ్చాడు.
రెట్టింపైన ఆనందం
సురేష్ బాబు దగ్గుబాటి తన చిత్రాన్ని కొనడంతో తను సేఫ్ జోన్‌లోకి వచ్చేశానని.. కానీ చిత్రానికి మంచి లాభాలొస్తే ప్రొడ్యూసర్‌గా తనకు మంచి బూస్ట్ ఇచ్చినట్టవుతుందని నందు భావన. మొత్తానికి నందు అయితే చాలా ఆనందంగా కనిపించాడు. దీనికి కారణం డల్లాస్ ప్రీమియర్స్ పడటమే. అక్కడి ప్రీమియర్ షోకి వెళ్లిన గీతా మాధురి చిత్రాన్ని చూసిన మీదట అక్కడి వారి రెస్పాన్స్‌ను నందుకు చెప్పడంతో ఆయన ఆనందం రెట్టిపైంది. ఇప్పటికే ‘దండోరా’ చిత్రం ఇచ్చిన కిక్‌తో మంచి జోష్‌లో ఉన్న నందుకి ‘సైక్ సిద్దార్థ్’ సైతం మంచి కిక్ ఇస్తుందని కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. నూతన సంవత్సరం తనకు సక్సెస్‌తో పాటు ప్రాఫిట్స్‌ను కూడా తెస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు. ఆల్ ది బెస్ట్ నందు..
ప్రజావాణి చీదిరాల