Entertainment

Boney Kapoor: వామ్మో బోనీ కాబట్టి తట్టుకుని నిలబడ్డారు.. వేరొకరైతేనా?

ఒక సినిమా చేయాలనుకుంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. అందులో సందేహమే లేదు. ప్రతి సినిమాకు అనుకున్న బడ్జెట్‌కు ఎంతో కొంత అయితే పెరుగుతుంది. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు.

Boney Kapoor: వామ్మో బోనీ కాబట్టి తట్టుకుని నిలబడ్డారు.. వేరొకరైతేనా?

ఒక సినిమా చేయాలనుకుంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. అందులో సందేహమే లేదు. ప్రతి సినిమాకు అనుకున్న బడ్జెట్‌కు ఎంతో కొంత అయితే పెరుగుతుంది. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. గిరి గీసుకుని కూర్చొని అందులోనే ఖర్చు ఉండాలంటే అది సాధ్యం కాదు. అయితే అనుకున్న బడ్జెట్‌కు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌ పెరిగితేనో.. అప్పుడు పరిస్థితేంటి? ఆ నిర్మాత ఏం కావాలి?

రూ.100 కోట్ల చిత్రాన్ని భారీ బడ్జెట్ (Budget) చిత్రంగా పేర్కొంటారు. అలాంటిది నిర్దేశిత వ్యయం కన్నా ఏకంగా రూ.90 కోట్ల ఖర్చు పెరిగితేనో.. దానిని ఏమనాలి? భారీ బడ్జెట్ అనాలంటే నిర్దేశిత వ్యయం అది కాదే.. ఆ చిత్రాన్ని నిర్మించిన వ్యక్తి బోనీ కపూర్ (Boney Kapoor) కాబట్టి సరిపోయింది. వేరొకరైతే తట్టుకుని నిలబడేవారు కూడా కాదేమో. పోనీ ఇంత భారీ బడ్జెట్ పెట్టినందుకు కలెక్షన్స్ (Collections) ఏమైనా గొప్పగా వచ్చాయా? అంటే అదీ లేదు. అప్పుల కుప్ప వచ్చి నెత్తిన పడింది. ఆ చిత్రమే ‘మైదాన్’ (Maidaan). తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను బోనీ వెల్లడించారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ (Covid Lockdown)కి పూర్వం అంటే 2020 జనవరి నాటికి మూవీ చిత్రీకరణ దాదాపు 70 శాతం పూర్తైందని బోనీ తెలిపారు. సినిమాకు సంబంధించిన కొన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను 2020 మార్చి ఎండింగ్‌లో షూటింగ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. దీనికోసం అంతర్జాతీయ టీమ్స్ (International Teams) సైతం ముంబైకి చేరుకున్నాయి.

మంచినీళ్ల బాటిళ్ల ఖర్చుతో..

సీన్ కట్ చేస్తే సడెన్ లాక్‌డౌన్ (Lockdown). బస్సులు, రైళ్లు, విమానాలు.. ఆ మాటకొస్తే జనజీవనమే స్తంభించిపోయింది. ఏదో పది లేదంటే 20 రోజులో లాక్‌డౌన్ ఉంటుందని అంతా భావించారు కానీ అది కాస్తా నెలల తరబడి కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదు. దీంతో షూటింగ్ (Shooting) కోసం ముంబైకి వచ్చిన అంతర్జాతీయ క్రీడాకారులందరికీ ముంబైలోనే వసతి ఏర్పాటు చేయాల్సి వచ్చిందని బోనీ కపూర్ వెల్లడించారు. ఇక మ్యాచ్‌లను షూట్ చేసే సమయంలో సెట్స్‌లో సుమారు 800 మంది ఉండేవారని.. వారందరికీ తాజ్ హోటల్ (Taj Hotel) నుంచి భోజనం తెప్పించేవాడినని బోనీ కపూర్ తెలిపారు. కోవిడ్ (Covid) నిబంధనలను దృష్టిలో పెట్టుకుని.. అంబులెన్స్‌లు, వైద్యులను అందుబాటులో ఉంచేవాడినని వెల్లడించారు. ఎక్కువ మంది కలిసి భోజనం చేసే వీలు లేపోవడంతో ఎక్కువ టెంట్లు వేయాల్సి వచ్చిందని.. చివరకు మంచి నీళ్ల బాటిళ్ల (Water Bottles)కే కొంతమేర బడ్జెట్ కేటాయించాల్సి వచ్చిందన్నారు. మంచినీళ్లకు కేటాయించిన బడ్జెట్‌తో చిన్న సినిమా నిర్మించవచ్చని పేర్కొన్నారు.

తుఫాన్‌కు కొట్టుకుపోయిన సెట్..

గోటి చుట్టుపై రోకలి పోటు అన్న చందంగా.. అసలే అప్పటికే లాక్‌డౌన్ కారణంగా సినిమా బడ్జెట్ తడిచి మోపెడైతే.. అది చాలదన్నట్టుగా తుఫాన్ (Cyclone) కూడా దానికి తోడైంది. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు బ్యాంకాక్ వెళ్లిన చిత్రబృందానికి అక్కడ కూడా వ్యయం భారీగా పెరిగిపోయింది. ముంబైలో షూటింగ్ కోసం వేసిన ఫుట్‌బాల్ స్టేడియం (Football Stadium) సెట్ కాస్తా తుఫాన్‌కు కొట్టుకుపోవడంతో బడ్జెట్ మరింత పెరిగింది. మొత్తంగా రూ.120 కోట్లు అనుకున్న బడ్జెట్.. సినిమా పూర్తయ్యే నాటికి రూ.210 కోట్లకు చేరింది. పోనీ సినిమా ఏమైనా విడుదలై మంచి సక్సెస్ సాధించిందా? అంటే అదీ లేదు. కేవలం రూ.68 కోట్లు సాధించింది. ఎక్కడ రూ.210 కోట్లు.. ఎక్కడ రూ.68 కోట్లు..? కొందరు తమ రెమ్యూనరేషన్‌ నుంచి 15 శాతం అయితే తగ్గించుకున్నారట. ఎంత తగ్గించుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? నష్టం కొండంత పెరిగింది. అంతా విధి లిఖితం.. ఎవరినీ నిందించలేమని బోనీ కపూర్ తెలిపారు. ‘మైదాన్’ చిత్రం ఫుట్‌బాల్ కోచ్ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా రూపొందింది. అమిత్ శర్మ (Director Amit Sharma) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయ్యద్ పాత్రను అజయ్ దేవగణ్ (Ajay Devagan) పోషించారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 9, 2025 12:41 PM