Prabhas: నాడు ధూల్‌పేట్ ఈశ్వర్.. నేడు దునియా మెచ్చిన ‘రాజాసాబ్’
ఈశ్వర్ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాలనే భావనతో అప్పటికే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు వద్దనుకుని కొత్త హీరో కోసం సెర్చింగ్ ప్రారంభించారట. అలా ప్రభాస్ వారికి దొరికాడు.
ప్రభాస్ (Prabhas) నట ప్రస్థానం ప్రారంభమై అప్పుడే 23 ఏళ్లు (23 Years for Prabhas Career) అవుతోందా? ఎందుకో కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేస్తామని దర్శకుడు మారుతి (Director Maruthi) చెబితే కానీ అప్పుడు తెలియలే.. ఇన్నేళ్లవుతోందా? అని. పోనీ అన్నేళ్ల కెరీర్‌లో ఆయన నటించిన సినిమాలు పెద్దగా లేవులే అనుకుందామా? 23 ఉన్నాయి. అంటే మధ్యలో ‘బాహుబలి’ రెండు పార్టుల కోసం ఐదేళ్లు తీసుకున్నా.. ఆ తరువాత వచ్చిన ‘సాహో’ కోసం మరో దాదాపు మూడేళ్లు తీసుకున్నా కూడా 23 చిత్రాలు చేశాడు. ప్రభాస్ నటించిన తొలి సినిమా ‘ఈశ్వర్’ (Eeswar Movie). ఈ చిత్రం 2002లో నవంబరు 11న విడుదలైంది.
నటనలో శిక్షణను సైతం పూర్తి చేసుకోకుండానే ప్రభాస్ తెరంగేట్రం చేయాల్సి వచ్చింది. జయంత్ సి.పరాన్జీ (Jayanth C Paranjee) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాలనే భావనతో అప్పటికే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు వద్దనుకుని కొత్త హీరో కోసం సెర్చింగ్ ప్రారంభించారట. అలా ప్రభాస్ వారికి దొరికాడు. సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్న ప్రభాస్ ఫోటోలు తెప్పించుకుని చూడగానే హీరో మెటీరియల్ అని ఫీల్ అయిపోయారట జయంత్. ఓ హోటల్‌లో ప్రభాస్‌ను కలిసి తనకు కావల్సిన హీరో ఇతనేనని ఫిక్స్ అయిపోయారట. కానీ ప్రభాస్ మాత్రం తన శిక్షణ పూర్తి కాకపోవడంతో వద్దని చెప్పాడట. జయంత్ ధైర్యం చెప్పి బేసిక్ లైన్ చెప్పగానే ప్రభాస్ ఓకే చెప్పాడట. అలా ఆ సినిమా ప్రారంభమైంది.
ఎమ్మెల్యే కూతురిని పేదింటి కుర్రాడు ప్రేమిస్తే ఏం జరుగుతుందన్న కథాంశంతో ఈశ్వర్ చిత్రం తెరకెక్కింది. చిన్న కాన్సెప్ట్ ప్రభాస్‌కు పెద్ద సక్సెస్ తెచ్చి పెట్టింది. వాస్తవానికి తన వారసుడిని పరిచయం చేయమని ఇండస్ట్రీలోని పెద్దలే ఏదో ఒక దర్శకుడిని కోరుతారు. కానీ ప్రభాస్ విషయంలో రివర్స్.. అదృష్టం ఆయనకు చాలా గట్టిగా ఉన్నట్టుంది. అవకాశమే వెదుక్కుంటూ వచ్చింది. ఆయన కూడా దానిని చేజారనివ్వకుండా గట్టిగా పట్టుకున్నారు. సరిగ్గా 20 ఏళ్లు తిరగకముందే అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’తో సత్తా చాటాడు. ధూల్‌పేట్ ఈశ్వర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. దునియా మెచ్చిన ‘రాజాసాబ్’ అయ్యాడు. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ (The RajaSaab), ‘ఫౌజీ’ (Fauzi), ‘స్పిరిట్’ (Spirit) చిత్రాల్లో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ నుంచి పోస్టర్‌ను మేకర్స్ ప్రభాస్ 23 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా విడుదల చేశారు. మైదాన ప్రాంతంలో నోటిలో చుట్టతో స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్న పోస్టర్‌ను మేకర్స్ వదిలారు.
ప్రజావాణి చీదిరాల