Entertainment

Aata Sandeep: ఇప్పుడాయన ‘ఆట’ సందీప్ కాదు.. ‘ఛాంపియన్’

కష్టానికి ప్రతిఫలం దక్కక మానదు. ‘ఆట’ నుంచి సక్సెస్ వేట మొదలు పెట్టిన కొరియోగ్రాఫర్ సందీప్‌కు ఇంత కాలానికి ఒక మంచి సక్సెస్ వచ్చింది. ఆయన కొరియోగ్రఫీ చేసిన ‘ఛాంపియన్’ చిత్రంలోని పాటతో ఆయన రియల్ లైఫ్‌లో ఛాంపియన్‌గా మారారు.

Aata Sandeep: ఇప్పుడాయన ‘ఆట’ సందీప్ కాదు.. ‘ఛాంపియన్’

కష్టానికి ప్రతిఫలం దక్కక మానదు. ‘ఆట’ నుంచి సక్సెస్ వేట మొదలు పెట్టిన కొరియోగ్రాఫర్ సందీప్‌కు ఇంత కాలానికి ఒక మంచి సక్సెస్ వచ్చింది. ఆయన కొరియోగ్రఫీ చేసిన ‘ఛాంపియన్’ చిత్రంలోని పాటతో ఆయన రియల్ లైఫ్‌లో ఛాంపియన్‌గా మారారు. ఆ చిత్రమే మెగాస్టార్ చిరంజీవికి సైతం కొరియోగ్రఫీ చేసే అవకాశాన్ని ఇప్పించింది. తాజాగా గద్దర్ అవార్డును అందించింది.

ఎన్నో ఆశలు... ఎన్నో కలలు.. వాటన్నింటినీ నెరవేర్చుకోవడానికి ‘ఆట’ అనే ప్రోగ్రాం సందీప్‌కు ఒక సాధనమైంది. ఆయన కష్టం ‘ఆట’కు విన్నర్‌ని చేసింది. కట్ చేస్తే ఆ షోతో ఆట సందీప్‌గా మారిపోయారు. అక్కడి నుంచి కొన్ని సంవత్సరాల పాటు కృషి చేశారు. బిగ్‌బాస్‌లోనూ మెరిశారు. మొత్తానికి ఇంత కాలానికి ఆయన కల నెరవేరింది.. ఆశలు ఫలించాయి. ఒకటా.. రెండా.. పద్దెనిమిదేళ్ల తర్వాత లభించిన ప్రతిఫలంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కష్టం అనేది ఎప్పటికీ వృథా పోదనడానికి సందీప్ జీవితమే ఒక నిదర్శనం.

అది మాత్రమే సరిపోదు కదా..

సందీప్ భార్య జ్యోతి కూడా డ్యాన్స్ మాస్టరే. వీరిద్దరూ కలిసి వేసే స్టెప్స్‌కు సోషల్ మీడియా ఎప్పుడో ఫిదా అయిపోయింది. కానీ అది మాత్రమే సరిపోదు కదా. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు రావాల్సిందే. కానీ దానికి కూడా బాట వేసింది.. రీల్స్‌లో ఆయన చేసిన స్టెప్సే కావడం విశేషం. రీల్స్‌లో ఆయన స్టెప్స్ చూసిన నిర్మాత స్వప్నా దత్.. సందీప్‌ను ‘ఛాంపియన్’లో గిర గిర గిర గింగిరానివే.. పాట కోసం సంప్రదించారు. అదే ఆయనను ‘ఛాంపియన్’ను చేసింది.

కలవడమే వరమనుకుంటే..

సోషల్ మీడియా మొత్తం ఆ పాటకు స్టెప్స్ వేసింది. దానిని చూసిన మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారూ’లో ‘హుక్ స్టెప్’కు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారు. ఆయనను కలవడమే వరమనుకున్న సందీప్‌కు ఏకంగా ఆయన పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నారు. ఈ సాంగ్ కొరియోగ్రఫీతో ఇండస్ట్రీలో సందీప్ పేరు మారుమోగింది. ఇక తాజాగా గద్దర్ అవార్డు ఆయనను మరో మెట్టు ఎక్కించింది. ఇప్పుడు ఆయన ఆట సందీప్ కాదు.. ఛాంపియన్ సందీప్. ఇక మున్ముందు కూడా సందీప్‌ మరింత రాణించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సందీప్.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 9, 2026 4:22 PM