Mitra Mandali: కడుపుబ్బ నవ్వించే కథ..
ప్రస్తుతం జనాలను అమితంగా ఆకట్టుకోవాలంటే.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అయినా అయ్యుండాలి లేదంటే సీటు ఎడ్జ్‌న కూర్చోబెట్టే థ్రిల్లర్ అయినా అయ్యుండాలి.

ప్రస్తుతం జనాలను అమితంగా ఆకట్టుకోవాలంటే.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అయినా అయ్యుండాలి లేదంటే సీటు ఎడ్జ్‌న కూర్చోబెట్టే థ్రిల్లర్ అయినా అయ్యుండాలి. ఈ రెండు జానర్లకు ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గదు. ఇక ఈ నెల 16న దీపావళి (Diwali) కానుకగా.. వెండితెరపై నవ్వుల టపాసులు కాల్చడానికి ‘మిత్ర మండలి’ (Mitra Mandali) చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే నేడు సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందో తెలుస్తుంది. సినిమా మొత్తం మంచి ఫామ్‌లో ఉన్న కమెడియన్స్‌ను తీసుకున్నారు. ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ (Rag Mayur), ప్రసాద్ బెహరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో ఒక విచిత్రమైన పోలీసు పాత్రలో వెన్నెల కిషోర్ (Vennela Kishore), కీలక పాత్రలో సత్య (Satya), సరదా అతిథి పాత్రలో అనుదీప్ కె.వి. (Director Anudeep KV) కనిపించనున్నారు. ట్రైలర్‌ను సైతం వీరందరిపై కట్ చేశారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణలో ప్రియదర్శి మాట్లాడుతూ.. ప్రేక్షకులు సంతోషంగా నవ్వుకుని థియేటర్ నుంచి బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ‘మిత్రమండలి’ సినిమా చేసినట్టు వెల్లడించాడు. ఈ సినిమా ‘జాతిరత్నాలు’ (Jathi Rahnalu Movie)కు మించి ఉంటుందని తెలిపాడు. నలుగురు స్నేహితులు ఒకచోట చేరి సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో తమ సినిమా అలా ఉంటుందని చెప్పాడు. నిహారిక ఎన్ఎమ్ మాట్లాడుతూ.. మిత్రమండలి కథ తనకు సరిగ్గా సరిపోతుందని.. అందుకే కచ్చితంగా ఈ సినిమా చేయాలని అనుకున్నట్టు తెలిపింది. తొలి సినిమాతోనే మంచి ప్రాధాన్యమున్న పాత్ర రావడం సంతోషంగా ఉందని పేర్కొంది.
చిత్ర సమర్పకులు బన్నీ వాస్ (Bunny Vas) మాట్లాడుతూ.. మూడు నెలల క్రితం 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) టీమ్ తమ సినిమాని విడుదల చేయమని కోరుతూ తన దగ్గరకు వచ్చారన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కోసం తాను వాళ్ళని పిలిచానని.. ఇది నిజమైన విజయం అని అన్నారు. 'మిత్ర మండలి' (Mitra mandali) చాలా మంచి కథ అని.. అందరినీ కడుపుబ్బ నవ్విస్తుందన్నారు. దర్శకుడు, నిర్మాత ఆదిత్య హాసన్ (Aditya Haasan) మాట్లాడుతూ.. తాను ఈ సినిమా చూశానని... సినిమాలో సోషల్ సెటైర్ ఉందని వెల్లడించారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉంటారన్నారు. బన్నీ వాసు ఖాతాలో మరో విజయం పక్కాగా వచ్చి చేరుతుందన్నారు.
ప్రజావాణి చీదిరాల