Maareesan Review: పులిని వెదుక్కుంటూ జింక వెళితే పరిస్థితేంటి?
పులి, జింక అంటే ఇదేదో జంతువుల సినిమా అనుకునేరు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. దీని టైటిల్ ‘మారీశన్’. జూన్‌లో థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది

పులి, జింక అంటే ఇదేదో జంతువుల సినిమా అనుకునేరు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), వడివేలు (Vadivelu) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. దీని టైటిల్ ‘మారీశన్ (Maareesan)’. జూన్‌లో థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫహాద్ ఫాజిల్, వడివేలు ఇద్దరూ అద్భుతమైన నటులే. మరి వీరి నటన ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? తెలుసుకుందాం.
సినిమా కథేంటంటే..
స్వతహాగా దొంగ అయిన దయాకర్ (ఫహాద్ ఫాజిల్) ఓ రాత్రి ఓ ఇంట్లో దొంగతనానికి వెళతాడు. అక్కడే వేదాచలం (వడివేలు)ను చూస్తాడు. అతను వయసు మీదపడటంతో అల్జీమర్స్‌తో బాధపడుతుంటాడు. దయాకర్ వెళ్లేసరికి వేదాచలం చేతులు గొలుసులతో కట్టేసి ఉంటాయి. తన కొడుకు కుమారే తనను గొలుసుతో కట్టేశాడని తనను విడిపిస్తే డబ్బు ఇస్తానని చెబుతాడు. విడిపించుకుని ఏటీఎం వద్దకు అతడిని దయాకర్ తీసుకెళతాడు. అతడు డ్రా చేస్తుంటే బ్యాలెన్స్ అమౌంట్ దయాకర్ చూస్తాడు. రూ.25 లక్షలు వేదాచలం వద్ద ఉన్నాయని తెలిసి వాటిని ఎలాగైనా కొట్టేయాలని అతడిని వదలకుండా ఎక్కడికంటే అక్కడికి బైక్‌పై తీసుకెళుతూ ఉంటాడు. అసలు వేదాచలం ఎవరు? అతనికి నిజంగానే అల్జీమర్స్ ఉందా? డబ్బు కొట్టేయాలనుకున్న దయాకర్ కథ చివరకు ఏమైంది? ‘మారీశన్’ అంటే రాక్షసుడు. మరి ఈ కథలో రాక్షసుడు ఎవరు? అనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
సినిమా ఎలా ఉందంటే..
తమిళ్ చిత్రాలు ఏవైనా కూడా సింపుల్ కథతో మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి. ఈ కథ కూడా అలాంటిదే సింపుల్ రోడ్ ట్రిప్ మూవీ. వేదాచలం, దయాకర్ కలిసి చేసిన జర్నీయే ఇది. కామెడీ, ఎమోషన్ సమపాళ్లలో కలగలిసిన చిత్రమిది. దర్శకుడు సుధీశ్ శంకర్ కథను చాలా ఆసక్తికరంగా నడిపించారు. పహాద్ ఫాజిల్, వడివేలు నటన ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పాలి. ప్రేక్షకుడు సినిమా చూస్తుంటే వీరి జర్నీలో తను కూడా ప్రయాణం చేస్తాడు. ఏసీపీగా కోవైసరళ కనిపించింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా కూడా ఆకట్టుకున్నారు. ఊహించని ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని చక్కగా దర్శకుడు నడిపించారు. ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
ఫైనల్‌గా..: ‘మారీశన్ ఎమోషన్, థ్రిల్, కామెడీ ఎంటర్‌టైనర్
ప్రజావాణి చీదిరాల