Entertainment

Kodamasimham: చిరు తొలిసారి గడ్డంతో చేసిన చిత్రం.. ఎన్నో విశేషాలకు కేరాఫ్..

ఈ సినిమాలో తనకు మోహన్‌బాబు (Mohan babu) చేసిన సుడిగాలి పాత్ర బాగా నచ్చిందన్నారు. మోహన్ బాబు కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను అంత బాగా ఒప్పించి మెప్పించి ఉండేవారు కారని చిరు (Chiru) తెలిపారు.

Kodamasimham: చిరు తొలిసారి గడ్డంతో చేసిన చిత్రం.. ఎన్నో విశేషాలకు కేరాఫ్..

తనకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టమని.. ‘క్లింట్ ఈస్ట్ వుడ్, గ్రెగరీ పెక్, ఒమర్ షరీఫ్ వంటి స్టార్స్ చేసిన సినిమాలను ఇష్టంగా చూస్తుండేవాడినని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తెలిపారు. ఆయన నటించిన కౌబాయ్ చిత్రం కొదమసింహం (Kodamasimham) రీరిలీజ్ నేపథ్యంలో ఆయన ఓ వీడియో సందేశంలో సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు కథను రమా ఫిలింస్ (Rama Films) నాగేశ్వరరావు, డైరెక్టర్ మురళీ మోహన్ రావు (Director Murali Mohan Rao)తో కలిసి వచ్చి తనకు కథ చెప్పారని వెల్లడించారు. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా ‘కొదమసింహం’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చిరు వెల్లడించారు. తొలిసారి తాను గడ్డం పెంచి నటించిన సినిమా ఇదని తెలిపారు.

ఈ సినిమాలో తనకు మోహన్‌బాబు (Mohan babu) చేసిన సుడిగాలి పాత్ర బాగా నచ్చిందన్నారు. మోహన్ బాబు కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను అంత బాగా ఒప్పించి మెప్పించి ఉండేవారు కారని చిరు (Chiru) తెలిపారు. విలన్‌గా బాలీవుడ్ లెజెండరీ నటుడు ప్రాణ్ నటించారని.. ఆయనతో కలిసి నటించే అదృష్టం తనకు ‘కొదమసింహం’ (Kodamasimham) సినిమాతో దక్కిందని చిరు తెలిపారు. ‘జపం జపం జపం కొంగ జపం’ పాట తనకు చాలా ఫేవరేట్ సాంగ్ అని తెలిపారు. ప్రభుదేవా (Prabhudeva) చక్కటి కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో ఫ్లోర్ నుంచి గోడపైకి స్టెప్స్ వేస్తూ మళ్లీ ఫ్లోర్ మీదకు వచ్చే డ్యాన్స్ మూవ్‌మెంట్ ఉందని.. దానిని ఒకే షాట్‌లో చేయడంతో అంతా సర్‌ప్రైజ్ అయ్యారని తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభుదేవా తన 16వ ఏటా ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

ఆ సమయంలో ప్రభుదేవాకు ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయట. అయితే చిరు ఆయనే వచ్చి కొరియోగ్రఫీ చేయాలని పట్టుబట్టడంతో ప్రభుదేవా పరీక్షలు అయిపోయేవరకూ సెట్‌ను కదిలించకుండా అలాగే ఉంచామంటూ చిత్ర నిర్మాత చెప్పుకొచ్చారు. ఇక జపం జపం పాటను మెట్లున్న ఒక వీల్‌కు కెమెరా పెట్టి దానిని చేసినట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏంటంటే చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు రాధ (Radha) అయితే మరొకరు సోనమ్. ఈమె బాలీవుడ్ నటి. అలాగే ఈ చిత్రంలో విలన్‌గా ప్రాణ్ నటించారు. ఆయన కూడా బాలీవుడ్ నటుడే కావడం విశేషం. ఇలా ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు బాలీవుడ్ నటులు అప్పట్లోనే ఈ చిత్రంలో నటించడం విశేషం. ఇన్ని విశేషాలకు కారణమైన ఈ సినిమా 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. ‘కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 20, 2025 6:56 AM