Entertainment

అంత సీన్ లేదా? మనమే ఎక్కువ ఊహించుకుంటున్నామా?

కొందరిని చూస్తే అద్భుతాలను సృష్టించడానికే పుట్టారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే.. కొందరు దర్శకుల విజన్, క్రియేటివిటీ మనల్ని మెస్మరైజ్ చేస్తాయి.

అంత సీన్ లేదా? మనమే ఎక్కువ ఊహించుకుంటున్నామా?

కొందరిని చూస్తే అద్భుతాలను సృష్టించడానికే పుట్టారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే.. కొందరు దర్శకుల విజన్, క్రియేటివిటీ మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. ఒక సినిమాటిక్ యూనివర్స్‌ని సృష్టించడమంటే సాధారణ విషయం కాదు. అది కూడా తలపండిన దర్శకుడై ఓకే అనుకోవచ్చు.. ఇప్పుడు ఎవరి గురించి చెబుతున్నానో అర్థమయ్యే ఉంటుంది.. లోకేష్ కనగరాజ్.

మూడు పదుల వయసులోనే సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌ల లిస్ట్‌లో చేరడం సాధారణ విషయం కాదు. ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే సంచలనమేమీ సృష్టించలేదు.. ఒక సాధారణ హిట్‌ అంతే.. లోకేష్ (Director Lokesh Kanagaraj) తొలి చిత్రం ‘మానగరం (Managaram)’. ఆ తరువాత వచ్చిన ‘ఖైదీ (Khaidi)’తో మాత్రం మెస్మరైజ్ చేశాడు. ఒకరాత్రి నుంచి తెల్లవారేలోపు జరిగే కథతో సింపుల్ అండ్ స్వీట్‌గా సినిమా తీశాడు. ఒక అద్భుతాన్నే సృష్టించాడు. అనుక్షణం ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తాడు. సాధారణ దర్శకుడు మాదిరిగానే హిట్, ఫ్లాప్‌ల మధ్య కాలం గడిపాడు. మూడో చిత్రం స్టార్ హీరో విజయ్‌తో ‘మాస్టర్ (Master)’ చేసి ఫ్లాపును మూట గట్టుకున్నాడు. తిరిగి నాలుగో చిత్రం ‘విక్రమ్ (Vikram)’తో కెరటంలా లేచాడు. అందరూ ముక్కున వేలేసుకునేలా చేశాడు. అద్భుత విజయం సాధించిన తన రెండు చిత్రాలను కలిపి ‘సినిమాటిక్ యూనివర్శ్ (Cinematic Universe)’ అంటూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. దీంతో లోకేష్ పేరు మారుమోగింది.

హాలీవుడ్ చిత్రాన్నే కాపీ కొట్టాడా?

లోకేష్ కనగరాజ్ పేరు టాలీవుడ్‌ (Tollywood)లోనూ మారుమోగింది. కొత్త ట్రెండ్‌కు తెలుగు ప్రేక్షకులు సైతం ఉర్రూతలూగారు. ఆ తరువాత వచ్చిన ‘లియో’ మాత్రం ఫ్లాప్ అనేకంటే డిజాస్టర్ అనడం మేలేమో. హాలీవుడ్ సినిమా రేంజ్‌లో తీయాలని భావించారో.. లేదంటే ఏకంగా హాలీవుడ్ (Hollywood) చిత్రాన్నే కాపీ కొట్టాడో కానీ ‘లియో’ మునుపెన్నడూ అందుకోనంత దారుణ పరాజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిందే ‘కూలీ’. సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయో.. సినిమాలో కంటెంట్ తగ్గిందో కానీ తిరిగి ప్రేక్షకులకు ఈ సినిమా కూడా షాక్ ఇచ్చింది. అటు ‘వార్ 2’ (War 2) ఉన్నా కూడా జనాలు ‘కూలీ (Coolie)’ని తమ ఫస్ట్ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. కానీ సినిమా చూసిన జనాలకు మైండ్ బ్లాక్ అయ్యింది. అంతకు ముందు చూసిన అప్‌డేట్స్‌కి సినిమాకు పొంతనే లేదు. చివరకు నాగార్జున (Nagarjuna) పోషించిన విలన్ పాత్రను చూసి ఫ్యాన్స్ సైతం అవాక్కయ్యారు. ఇలాంటి పాత్రను ఎందుకు ఒప్పుకున్నారంటూ రచ్చ చేస్తున్నారు. సినిమాలో లాజిక్‌కు అందని విషయాలుండటం సహా ఎన్నో సన్నివేశాలు జనాలను మెప్పించలేకపోయాయి. దీంతో ‘కూలీ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

వండర్స్ క్రియేట్ చేయడమేంటి?

వాస్తవానికి లోకేష్ కనగరాజ్‌కు హిట్‌, ఫ్లాపులు కొత్తేమీ కాదు కానీ.. ఇలా వరుసగా ఇబ్బందుల్లో పడటమైతే కొత్తే. పెద్దగా అంచనాల్లేని.. కనీసం భారీ బడ్జెట్ కూడా కాని.. ‘ఖైదీ’ చిత్రం వండర్స్ క్రియేట్ చేయడమేంటి? ఈ చిత్రం బీభత్సమైన అంచనాలు, హంగూ ఆర్భాటాలతో వచ్చి చతికలబడటమేంటి? అసలు మనమే లోకేష్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నామా? సినిమాటిక్ యూనివర్శ్‌ను చూసి ఇక బ్రహ్మ కోటి మందికి రాయాల్సిన రాతనంతా ఇతని నుదుటనే రాశాడని ఫీలవుతున్నామా? తెలియకుండా ఉంది. మొత్తానికి నెక్ట్స్ సినిమా లోకేష్ బ్లాక్ బస్టర్ ఇవ్వలేదంటే.. సౌత్ టాప్ లిస్ట్ నుంచి లోకేష్ కిందకు పడిపోయినట్టేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 16, 2025 5:10 PM