Entertainment

Mirai Review: ఫిక్షనల్ స్టోరీ ఆకట్టుకుందా?

ఒక ఫిక్షనల్ స్టోరీని చందమామ కథలా అందంగా వివరిస్తేనే అందరికీ నచ్చుతుంది. అదొక అద్భుతంలా అనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు కావల్సినవి హంగులూ, ఆర్భాటాలు.

Mirai Review: ఫిక్షనల్ స్టోరీ ఆకట్టుకుందా?

చిత్రం: మిరాయ్

విడుదల తేదీ: 12-09-2025

నటీనటులు: తేజ సజ్జ, రితిక నాయక్, మంచు మనోజ్, శ్రియ శరణ్, జగపతిబాబు, జయరాం, గెటప్ శీను తదితరులు

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

సంగీతం: గౌరీ హరి

నిర్మాత: టీజీ విశ్వప్రసాద్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని

ఒక ఫిక్షనల్ స్టోరీని చందమామ కథలా అందంగా వివరిస్తేనే అందరికీ నచ్చుతుంది. అదొక అద్భుతంలా అనిపిస్తుంది. ప్రస్తుతం సినిమాకు కావల్సినవి హంగులూ, ఆర్భాటాలు. ఆ పరంగా సినిమా ఎలా అనిపించిది? కథ పరంగా ఆకట్టుకుందా? ఫిక్షనల్ స్టోరీని అందించడంతో కార్తీక్ ఘట్టమనేని సక్సెస్ అయ్యారా? చూద్దాం.

సినిమా ప్రారంభంలోనే ఈ సినిమా ఒక ఫిక్షనల్ అని హీరో ప్రభాస్‌ (Hero Prabhas)తో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Director Karthik Ghattamaneni) చెప్పించారు. అశోక చక్రవర్తి (Emperor Ashoka) యుద్ధంలో ఓడిపోవడం.. కొన్ని వేల మంది ఈ యుద్ధంలో కోల్పోవడాన్ని చూసి కలత చెందుతాడు. ఇక మీదట మళ్లీ అంతటి విధ్వంసం జరగకూడదన్న ఆకాంక్షతో తన జ్ఞానాన్నంతా 9 గ్రంథాలలో అమర్చుతాడు. వాటిని భద్రపరిచే బాధ్యతను తొమ్మిది మంది యోధులకు అప్పగించడం జరుగుతుంది. అక్కడి నుంచి సినిమా ప్రారంభమవుతుంది. అంబిక (శ్రీయ - Sriya Saran) ధ్యానంలో కూర్చొని జరిగే విధ్వంసాన్ని ముందుగానే ఊహిస్తుంది. అసలు మున్ముందు ఏం జరుగనుంది? ఆ విధ్వంసాన్ని అంబిక కుమారుడు వేద ప్రజాపతి (తేజ సజ్జా - Teja Sajja) ఎలా అడ్డుకున్నాడు అనేది కథ.

సినిమా ఎలా ఉందంటే..

తల్లి ప్రేమకు లొంగని మనిషంటూ ఉంటారా? ఈ సినిమాలో తల్లి ప్రేమను కార్తీక్ ఘట్టమనేని బాగా గట్టిగా వాడేశారు. ఎటు తిరిగి ఎటొచ్చినా కూడా తల్లి ప్రేమ (Mother's sentiment) చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్‌లో ముందుగా ఒక 20 నిమిషాల పాటు సినిమా కొంత బోర్ అనిపిస్తుంది. అక్కడి నుంచి మాత్రం ఆసక్తిగా కొనసాగుతుంది. అదే ఆసక్తిని సెకండాఫ్‌లోనూ కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ సెకండాఫ్ విషయానికి వస్తే అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. బాగా లాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. మహావీర్ లామా (మంచు మనోజ్ - Manchu Manoj) వర్సెస్ వేద మధ్య సీన్స్ కాస్త గట్టిగా పడి ఉంటే సినిమా లేచేది. కానీ వీరిద్దరూ చివరిలో కలుస్తారు. కలిసినా కూడా ఫైటింగ్ సన్నివేశాలు వావ్ అనిపించేలా ఏమీ లేకపోవడం సినిమాకు గట్టి దెబ్బ అని చెప్పాలి.

ఎవరెలా చేశారంటే..

ఈ సినిమాలో మనం ముందుగా చెప్పుకోవల్సింది మంచు మనోజ్ గురించి. మహావీర్ లామా పాత్రలో మనోజ్ అయితే జీవించేశాడని చెప్పాలి. మనోజ్‌కు కమ్ బ్యాక్‌లో ‘భైరవం’ చిత్రం తర్వాత ‘మిరాయ్’లో ఒక అద్భుతమైన రోల్ పడింది. దీనిని వినియోగించుకోవడంలో మనోజ్ కూడా వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఇక తేజ సజ్జ పాత్రపై ‘హను మాన్’ ఛాయలు ఉన్నట్టుగా అనిపించింది. తన పాత్రలో అయితే చక్కగా ఒదిగిపోయాడు. హీరోయిన్ రితికా నాయక్ (Rithika Nayak) అందంగా కనిపించింది. శ్రీయకు కూడా మంచి రోల్ పడిందనే చెప్పాలి. ఆమె నటన కూడా చాలా సహజంగా అనిపించిది. జగపతిబాబు, జయరాం, గెటప్ శీను తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..

ఈ సినిమా బీజీఎం పరంగా బాగుందనే చెప్పాలి. ఇక పాటలైతే సినిమాలో పెద్దగా ఏమీ లేవు. వైబ్ ఉంది సాంగ్‌ను ఎందుకోగానీ మేకర్స్ లేపేశారు. కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్‌ప్లే అయితే అంత ఆకట్టుకునేలా ఏమీ లేదు. తరువాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడు అంచనా వేయగలుగుతాడు. ఇక ఎడిటింగ్ చాలా పేలవమని చెప్పాలి.

ఫైనల్‌గా ‘మిరాయ్’ ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 12, 2025 8:20 AM