Sasivadane Director: ఇన్‌స్పైరింగ్ స్టోరీ.. నిరుపేద కుటుంబం నుంచి వెండితెరకు జర్నీ..
ఆయన చెప్పే మాటలు వింటుంటే జీవితాన్ని గట్టిగా చదివేశాడేమో అనిపిస్తుంది. కళ్లలో సుడులు తిరుగుతుండగా.. తమ జీవితం గురించి చెప్పే మాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.

ఒక నిరుపేద తండ్రి.. ఆయనకు సినిమాలో నటించాలనే కోరిక. మద్రాస్ వెళ్లారు కానీ అందరికీ అవకాశం దక్కదు కదా.. ఆయనకూ దక్కలేదు. ఇక అంతే తిరిగి వచ్చేశాడు. తన కొడుకును అయినా వెండితెర (Silver Screen)పై చూడాలనుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కూలి పని చేస్తూ రెక్కల కష్టం మీద తన కొడుకు, కూతురును పెంచి పెద్ద చేశారు. కొడుకు పెద్ద వాడయ్యాక.. తండ్రి ఆశను తెలుసుకుని అది తన ఆశయంగా మార్చుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్‌తో తన జీవితాన్ని మొదలు పెట్టాడు. కట్ చేస్తే ఒక మంచి ప్రేమకథ (Love Story)ను రాసుకుని ఒక ప్రొడ్యూసర్‌కు దానిని చెప్పి ఒప్పించి ‘శశివదనే’ (Sasivadane) అనే సినిమా తీశాడు.
జీవితాన్ని గట్టిగా చదివేశాడేమో..
ఆ దర్శకుడి పేరు సాయి మోహన్ (Sasivadane Movie Director Sai Mohan). ఆయన పలికే పదాలు వింటుంటే..పెద్దగా చదువుకోలేదేమో అనిపిస్తుంటుంది. కానీ ఆయన చెప్పే మాటలు వింటుంటే జీవితాన్ని గట్టిగా చదివేశాడేమో అనిపిస్తుంది. కళ్లలో సుడులు తిరుగుతుండగా.. తమ జీవితం గురించి చెప్పే మాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. తండ్రి అనేది ఒక మంచి ఎమోషన్. కానీ అందరూ తల్లికే ప్రాధాన్యతనిస్తారు. తల్లి కడుపులో పెట్టుకుని చూసుకుంటే.. తండ్రి గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటాడు. కానీ తండ్రికి ఎందుకో పెద్దగా ప్రాధాన్యమివ్వం. తండ్రి కష్టాన్ని పెద్దగా గుర్తించం. కానీ ఈ కొడుకు మాత్రం తనకు జన్మనిచ్చిన తన తండ్రిని గుండెల్లో పెట్టుకుని ఆయన కలను నెరవేర్చేందుకు తపించాడు. పోలీస్ అవ్వాలనే తన కలను పక్కనబెట్టి.. తండ్రి కోరికను నెరవేర్చడమే కలగా మార్చుకున్నాడు. కనీసం తమకు ఇల్లు కూడా లేదని.. తన సోదరి వివాహం చేసే స్థితిలో కూడా తాము లేమని ఆ దర్శకుడు చెబుతుంటే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తుంది. మొత్తానికి ఆయనదో ఇన్‌స్పైరింగ్ స్టోరీ.
వేరైపోయిన సినిమా..
సాయి మోహన్ (Director Sai Mohan) తన సినిమాలో హీరోగా రక్షిత్ అట్లూరి (Hero Rakshith Atluri)ని ఎంచుకోగా.. హీరోయిన్‌గా కోమలి ప్రసాద్ (Komali Prasad)ను ఎంచుకున్నారు. ఇద్దరితో ఒక ప్రేమకథను తెరకెక్కించారు. ఒకప్పుడు సినిమా అంటే సినిమా అంతే.. కానీ ఇప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ వేరైపోయింది. బడ్జెట్ భారీగా ఉంటే కష్టం అనేది సైడ్ అయిపోతుంది. లేదంటే నేనున్నానంటూ వెదుక్కుంటూ వచ్చి మరీ పలకరిస్తుంది. ఈ సినిమాకూ అలాగే జరిగింది. అయినా సరే.. అన్నింటినీ అధిగమించి ఈ సినిమాను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు మూడేళ్ల పాటు శ్రమించారు. ఇక ట్రైలర్ (Sasivadane Trailer) చూస్తుంటే ఇదొక ప్రేమ కథ. ఏ ప్రేమ కథా చిత్రమైనా అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడటం.. దానిని నిలబెట్టుకోవడం కోసం తపించడం.. చివరకు నిలబెట్టుకున్నారా? లేదా? వంటి అంశాలతోనే ఈ సినిమా రూపొందుతుంది.
మునుపెన్నడూ చూడని ఎండింగ్..
అయితే ఎండింగ్‌పైనే చాలా సినిమాలు ఆధారపడి ఉంటాయి. ఈ సినిమా ఎండింగ్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ మూవీ మేకర్స్ (Sasivadane Movie Makers) కూడా అదే చెబుతున్నారు. ఎండింగ్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని.. అలాగే ట్రైలర్‌లోనే చెప్పారు. ప్రేమను దక్కించుకోవాలంటే ఒక యుద్ధం చేయాలని.. మరి ఈ హీరోతో దర్శకుడు ఎలాంటి యుద్ధం చేయించారో వెండితెరపై చూడాలి. ప్రస్తుత తరుణంలో ఒక నిరుపేద.. పైగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా దర్శకుడు అవడమంటే సాధారణ విషయం కాదు. పోనీ దర్శకత్వం వహించినా కూడా ఆ సినిమా వెండితెరకు ఎక్కడం మరో పెద్ద పెద్ద విషయం. మరి అతని కష్టానికి సినిమా మంచి ప్రతిఫలం ఇచ్చిందంటే.. అంతకు మించి ఏం కావాలి.. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలుసుకోవాలంటే అక్టోబర్ 10 వరకూ వెయిట్ చేయాల్సిందే.
ప్రజావాణి చీదిరాల