Pawan Kalyan: బ్లాక్ మార్కెట్ నివారణకు టికెట్ ధరల పెంపా? ఏంటిది?
సినిమా టికెట్ ధరల పెంపుపై పెద్ద సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రి రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సినిమా టికెట్ ధరల పెంపుపై పెద్ద సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రి రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రిరిలీజ్ ఈవెంట్‌లో పవన్.. టికెట్ రేట్ల పెంపు, నిర్మాతల పరిస్థితి, ప్రభుత్వ ఆదాయం వంటి అంశాలపై మాట్లాడారు. నిర్మాతలు భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తున్నారని.. ఆ ఖర్చులను తిరిగి పొందేందుకు టికెట్ ధలు పెంచాల్సి వస్తోందన్నారు. సినిమా విడుదలైన నాటి నుంచి తొలి కొన్ని షోలకు మాత్రమే టికెట్ ధరలు పెంచాలని నిర్మాతలు కోరుతారని పవన్ పేర్కొన్నారు.
టికెట్ ధరల పెంపును దోపిడిగా చూడవద్దని.. పెరిగిన ప్రతి రూపాయిలో కూడా సుమారు 18 శాతం వరకు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. దీంతో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రభుత్వం కూడా ఆదాయం పొందుతుందన్నారు. అది మాత్రమే కాకుండా టికెట్ ధరలను అధికారికంగా పెంచకపోతే, కొందరు బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు విక్రయించే అవకాశం పెరుగుతుందని పవన్ అన్నారు. ఒకవేళ అలా జరిగిందంటే.. ప్రభుత్వానికి రావాల్సిన పన్ను కూడా కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి కొంతమేర టికెట్ ధరల పెంపు అవసరమని పేర్కొన్నారు. మొత్తానికి పవన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
టికెట్ రేట్ల పెంపునకు బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడానికేనని పవన్ అనడమేంటనేది చర్చనీయాంశంగా మారింది. అదొక్క మాట అనకుండా ఉంటే బాగుండేదని కొందరు అంటుంటే.. టికెట్ ధరల పెంపును సమర్థించుకునే ముందు.. థియేటర్‌లలో పాప్‌కార్న్, డ్రింక్స్ వంటి వాటి రేట్ల విషయంలో శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. మూల కారణాలను వదిలేసి బ్లాక్ మార్కెట్‌లో టికెట్ ధరలను నియంత్రించేందుకని చెప్పడం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పవన్ ఈ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో చాలా జోవియల్‌గా కనిపించారు. అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు చేసి పెద్ద చర్చకే బాట వేశారు.