Entertainment

Bandmelam Review: ‘బ్యాండ్‌మేళం’ మోత మోగించిందా?

బావామరదళ్లైన యాదగిరి (హ‌ర్ష్ రోష‌న్‌), రాజమ్మ (శ్రీదేవి) ఇద్దరూ ఒకే రోజు పుడ‌తారు. చిన్న వయసులోనే వీరిద్దరినీ ఒకరికి ఇచ్చి ఒకరికి పెళ్లి చేయాలని ఇరువురి తల్లిదండ్రులు భావిస్తారు.

Bandmelam Review: ‘బ్యాండ్‌మేళం’ మోత మోగించిందా?

చిత్రం: బ్యాండ్‌మేళం

విడుదల: 26-03-2026

నటీనటులు: హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయికుమార్, గోపరాజు విజయ్, తదితరులు

డైరెక్టర్: సతీష్ జవ్వాజి

ప్రొడ్యూసర్: కోన వెంకట్

మ్యూజిక్: విజయ్ బుల్గానిన్

ఎడిటర్: శివ ముప్పరాజు

‘కోర్టు’ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా సైతం ‘కోర్టు’ తరహాలోనే మంచి సక్సెస్ సాధిస్తుందని అంతా భావించారు. మరి ఈ చిత్రం అంచనాలను చేరుకుందా? ‘కోర్టు’ తరహా సక్సెస్‌ టాక్‌ను తెచ్చుకుందా? చూద్దాం.

కథేంటంటే..

బావామరదళ్లైన యాదగిరి (హ‌ర్ష్ రోష‌న్‌), రాజమ్మ (శ్రీదేవి) ఇద్దరూ ఒకే రోజు పుడ‌తారు. చిన్న వయసులోనే వీరిద్దరినీ ఒకరికి ఇచ్చి ఒకరికి పెళ్లి చేయాలని ఇరువురి తల్లిదండ్రులు భావిస్తారు. అయితే సాయం అంటే ఏమాత్రం వెనుకడుగు వేయని గిరి తండ్రి సుంద‌ర‌య్య (గోప‌రాజు విజ‌య్‌) దానధర్మాల కారణంగా ఆస్తి మొత్తం క‌రిగిపోతుంది. మరోవైపు రాజీ తండ్రి సాయ‌న్న (సాయికుమార్‌).. సుందరయ్య నుంచి పొందిన సాయంతో కోటీశ్వ‌రుడిగా మార‌తాడు. సుందరయ్య ఇంటిని బ్యాంకు వేలం వేస్తుండగా సాయన్న దానిని కొనేస్తాడు. సుంద‌ర‌య్య చేసిన సాయాన్ని మ‌ర్చిపోయి ఆ కుటుంబాన్ని సాయన్న దూరం పెడ‌తాడు. గిరిని కలవనీయడు. టెన్త్‌లో రాజమ్మ డిస్టింక్షన్‌లో పాసవుతుంది. ఆ తరువాత రాజమ్మ హయ్యర్ స్టడీస్‌కి వెళుతుంది.. గిరి ఆ ఊరిలోనే బ్యాండ్‌మేళం వాయించుకుంటూ ఉండిపోతాడు. రాజీ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆమెకు వేరే అబ్బాయితో ఆమె తండ్రి సాయ‌న్న పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ తరువాత కథ ఏ మలుపు తీసుకుంది? గిరిని రాజీ మోసం చేసిందా? ఫోక్ సింగ‌ర్‌గా పేరు తెచ్చుకోవాల‌నే గిరి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? గిరి ప్రేమ‌ను రాజీ అంగీక‌రించిందా? ఆ బావ‌మ‌ర‌ద‌ళ్లు ఒక్క‌ట‌య్యారా? లేదా? అనే అంశాలతో బ్యాండ్ మేళం రూపొందింది.

సినిమా ఎలా ఉందంటే..

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ పరిచయం.. రాజీ, గిరిల ప్రేమ కథలను చూపించడం జరిగింది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే రాజీకి అసలైన కథలోకి వెళుతుంది. పల్లెటూరి ప్రేమకథ ఆధారంగా చాలా చిత్రాలు వచ్చాయి. కానీ కథనంలో దమ్ము లేకుంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. ఈ సినిమా కూడా నడుస్తున్న కొద్దీ ప్రేక్షకులకు విసుగు పుడుతుంది. ప్రతి సన్నివేశం కూడా ముందుగా ఊహించేలా ఉంటుంది. గ్రిప్పింగ్ కథనం లేదు. పైగా నేచురాలిటీకి సినిమా చాలా దూరంగా ఉంటుంది. హీరో తన స్నేహితులతో కలిసి తన స్టూడియో కోసం దొంగతనాలు చేస్తాడు. కానీ ఎవ్వరికీ పట్టుబడడు. గ్రామాల్లో అది ఎంతవరకూ సాధ్యపడుతుంది. కనీసం చిన్న చిన్న విషయాలపై కూడా దర్శకుడు దృష్టి పెట్టలేదనడంలో సందేహమే లేదు.

ఎవరెవరు ఎలా నటించారు? టెక్నికల్‌గా ఎలా ఉంది?

సినిమాలో నటీనటుల నటన విషయంలో వంక పెట్టడానికి ఏమీ లేదు. హర్ష్, శ్రీదేవి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. సాయికుమార్, గోపరాజు విజయ్ వంటి వారు సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక దర్శకుడు సినిమా కథను ఆసక్తికరంగా మలచడంలో ఫెయిల్ అయ్యారనడంలో సందేహం లేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. మ్యూజిక్ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. ఎడిటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. స్క్రీన్‌ప్లే ఏమాత్రం ఆకట్టుకోదు.

ఫైనల్‌గా.. ‘బ్యాండ్‌మేళం’ ఏమాత్రం ఆకట్టుకోలేదు.

రేటింగ్: 1.75/5

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 26, 2026 7:58 AM