Couple Friendly Review: ఫీల్ గుడ్ లవ్ స్టోరీ..
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా రూపొందిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్‌లోకి అడుగు పెట్టింది. కానీ సినిమా చూశాక మాత్రం ప్రతి ఒక్కరి ఆలోచన మారిపోతుంది.
చిత్రం: కపుల్ ఫ్రెండ్లీ
విడుదల తేదీ: 14-02-2026
నటీనటులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, రాజీవ్ కనకాల, యోగిబాబు తదితరులు..
సంగీతం: ఆదిత్య రవీంద్రన్
రచన, దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్
నిర్మాత: ధీరజ్ మొగిలినేని
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా రూపొందిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్‌లోకి అడుగు పెట్టింది. కానీ సినిమా చూశాక మాత్రం ప్రతి ఒక్కరి ఆలోచన మారిపోతుంది. ఒక మంచి ఫీల్‌తో బయటకు వస్తారనడంలో సందేహం లేదు.
కథేంటంటే...
నెల్లూరుకు చెందిన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకొని ఉద్యోగ అవకాశాల కోసం చెన్నైకి వస్తాడు. తనని తాను నిరూపించుకునే అవకాశం రాకపోవడంతో పార్ట్ టైమ్ బైక్ రైడర్‌గా పని చేస్తుంటాడు. బైక్ రైడర్‌గా చేస్తున్న క్రమంలోనే మిత్ర (మానసా వారణాసి)తో పరిచయం ఏర్పడుతుంది. ఐటీ జాబ్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంది. ఇంటికెళితే పెళ్లి చేస్తారనే భయంతో చెన్నైలోనే కాలం గడుపుతూ ఉంటుంది. శివ రెంట్ కట్టలేక ఇబ్బంది పడుతుండటంతో మిత్ర సగం రెంట్ కడతానంటుంది. అలా ఇద్దరూ ఒకేచోటుకి చేరతారు. మిత్ర తన జీవితంలోకి వచ్చాక శివ జీవితమే మారిపోతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? శివ, మిత్రల ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుందనేది వెండితెరపై చూడాల్సిందే.
ఎలా సాగిందంటే..
ప్రేమించిన వ్యక్తికి తోడుగా నిలిస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా ఇబ్బంది లేకుండా దాటేస్తారనే కథాంశంతో పాటు ఈ క్షణమే మనది. మరుక్షణం ఏం జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ప్రతిక్షణం ఆనందంగా గడపాలనే సందేశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ ప్రేమకథను దర్శకుడు ఒక ఎమోషనల్ జర్నీగా తీర్చిదిద్దారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా శివ, మిత్రల పరిచయం.. వారి సహజీవనం వంటి అంశాలతో రూపొందించారు. సెకండాఫ్ అసలు కథలోకి తీసుకెళతారు దర్శకుడు. ఆరంభంలో కాస్త స్లో నెరేషన్ అనిపించినా కూడా ఇద్దరూ సహజీవనం చేసినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ప్రస్తుత టెక్నాలజీని వినియోగించి శివను లక్ష్యానికి బాటలు వేసిన తీరు.. ఆ జర్నీలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం వంటివన్నీ చక్కగా నడిపించారు. సినిమా ఊహలకు అతీతంగా ఏమీ ఉండదు కానీ ఆకట్టుకుంటుంది. కొన్ని పాత్రలను కథలో అనవసరంగా ఇరికించారేమో అనిపిస్తుంది. మొత్తానికి సినిమా అయితే ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ మనసును మెలిపెడుతుంది.
ఎవరెలా చేశారంటే..
శివ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా ఒదిగిపోయాడు. కెరీర్‌లో కలిసిరాక స్ట్రగుల్ అవుతున్న కుర్రాడిలా చాలా సహజంగా కనిపించాడు. మానసా వారణాసి సైతం ఆద్యంతం ఆకట్టుకుంది. శివ, మిత్రల జంట చక్కగా ఉన్నారనిపిస్తుంది. యోగిబాబును అయితే తీసుకున్నారు కానీ దర్శకుడు ఎందుకో కామెడీ ట్రాక్‌ను మాత్రం రాయలేదు. ఇక గోపరాజు రమణ, రాజీవ్ కనకాల తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. ఈ సినిమాలో పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం కథను హైలైట్ చేయడంలో సాయపడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఒక ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ
రేటింగ్: 3.25/5
ప్రజావాణి చీదిరాల