Kara Movie Review: ‘కర’తో ధనుష్ మనుషుల మనసుల్ని దోచేశాడా?
గతేడాది ‘రాయన్’, ‘కుబేర’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో ధనుష్... తాజాగా ‘కర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ధనుష్ సినిమా అంటేనే ప్రేక్షకుల అంచనాలు గట్టిగానే ఉంటాయి. మరి ఆ అంచనాలను ‘కర’ అందుకుందా? చూద్దాం.
చిత్రం: కర
విడుదల: 30-04-2026
నటీనటులు: ధనుష్, మమితబైజు, కె.ఎస్.రవికుమార్, జయరామ్, కరుణాస్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీరాజన్ తదితరులు
సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్
దర్శకత్వం: విఘ్నేశ్ రాజా
నిర్మాత: ఇషారి కె. గణేశ్
గతేడాది ‘రాయన్’, ‘కుబేర’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో ధనుష్... తాజాగా ‘కర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ధనుష్ సినిమా అంటేనే ప్రేక్షకుల అంచనాలు గట్టిగానే ఉంటాయి. మరి ఆ అంచనాలను ‘కర’ అందుకుందా? చూద్దాం.
కథేంటంటే..
దొంగతనాలు తప్ప మరో పని తెలియని కరసామి(ధనుష్).. మల్లి (మమిత బైజు)ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత ఆ నేర జీవితాన్ని వదిలేసి హోటల్ పెట్టుకుని జీవించాలని డిసైడ్ అవుతాడు. దానికి అవసరమైన డబ్బు కోసం బ్యాంకు లోనుకు వెళితే ఏదైనా ప్రాపర్టీ తాకట్టు కోసం అడుగుతారు. అప్పుడు ఊరిలో ఉన్న పొలం కాగితాలు బ్యాంకులో తాకట్టు పెట్టాలనుకుంటాడు. వాటి కోసం ఎన్నో ఏళ్ల తర్వాత తన ఊరికి వెళతాడు. తండ్రి (కేఎస్ రవికుమార్) అప్పటికే పొలం కాగితాలను బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొంటాడు. పొలం అమ్మేస్తానంటూ తండ్రితో గొడవపడతాడు. అదే రోజు రాత్రి తండ్రి నిద్రలోనే మరణిస్తాడు. తండ్రిని తన పొలంలోనే ఖననం చేయాలనుకుంటాడు కానీ బ్యాంకు అధికారులు అంగీకరించరు. తమకు కట్టాల్సిన డబ్బు కడితేనే పొలంలోకి అనుమతిస్తామని చెబుతారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? కరసామి తన తండ్రి అంత్యక్రియలు తన పొలంలోనే చేశాడా? వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
తండ్రీకొడుకుల భావోద్వేగాలతో ముడిపడిన ఒక హెయిస్ట్ థ్రిల్లర్ పిరియాడిక్ మూవీగా కరను దర్శకుడు విఘ్నేశ్ రాజా తెరకెక్కించారు. 1991 నాటి గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో సాగే కథ ఇది. దొంగతనాలు మానేసి సాధారణ జీవితం గడపాలని ఆశపడిన ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తిరిగి దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈసారి పర్టిక్యులర్‌గా ఒక బ్యాంకుకు చెందిన శాఖల్నే టార్గెట్ చేయడానికి కారణమేంటి? వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. గతంలో ఈ తరహా కథలు వచ్చాయి. అయితే కథను ఎంత ఆసక్తికరంగా నడిపించారన్నదే ముఖ్యం. రాబిన్‌హుడ్ తరహా కథకు తండ్రీ - కొడుకుల ఎమోషన్‌తో పాటు రైతు సమస్యలను ముడిపెట్టి సినిమాను నడిపించిన విధానం ఒకింత ఆసక్తికరమే. అయితే కథనంలో మరింత పట్టు బిగించి ఉంటే బాగుండేది. ఓ ఇంటిని కరసామి కొల్లగొట్టే ఆసక్తికర అంశంతో దర్శకుడు కథను ప్రారంభించాడు. తండ్రీకొడుకుల ఎమోషన్ ఆకట్టుకుంటుంది. గల్ఫ్ యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడటం.. దాని కారణంగా రైతులు ఎలా ఇబ్బంది పడ్డారు వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. అయితే అదే ఆసక్తిని కొనసాగించి ఉంటే బాగుండేదేమో. కొన్ని సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా అనిపించినా ఓవరాల్‌గా చూస్తే అంత థ్రిల్ అనిపించదు. ముఖ్యంగా బ్యాంకుల్ని దోచుకునే సన్నివేశాల్లో ఆసక్తి కొరవడింది. అలాగే కరసామిని పట్టుకునేందుకు డీఎస్పీ భరతన్ స్కెచ్‌లు చాలా పేలవంగా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే..
కరస్వామిగా భావోద్వేగాలు నిండిన పాత్రలో ధనుష్ జీవించేశారు. హీరో తండ్రీగా కేఎస్ రవికుమార్ అద్భుతంగా నటించారు. ఇక మమిత బైజు డీ గ్లామర్ రోల్‌లో నటించినా కూడా అలరిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఒక ప్రాధాన్యత లేని పాత్రను ఆమె చేశారు. డీఎస్పీగా సూరజ్.. బ్యాంక్ అధినేతగా జయరామ్‌లు తమ పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, బీజీఎం సినిమాను ఒక మెట్టు ఎక్కించాయి. నిర్మాణ విలువలు సైతం సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.
చివరిగా: ‘కర’ కొంత మేర మనసును ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 2.75/5
ప్రజావాణి చీదిరాల