Entertainment

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’పై మనసుపెట్టి ‘విశ్వంభరను మరిచారా?

ఒకవైపు నిన్న కాక మొన్న మొదలుపెట్టిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పండక్కి వస్తామంటూ బడాయిలు పోతోంది. ఒక్క ‘మీసాల పిల్ల’తోనే ఈ సినిమాకు బీభత్సమైన ప్రమోషన్ వచ్చేసింది.

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’పై మనసుపెట్టి ‘విశ్వంభరను మరిచారా?

ఒకవైపు నిన్న కాక మొన్న మొదలుపెట్టిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పండక్కి వస్తామంటూ బడాయిలు పోతోంది. ఒక్క ‘మీసాల పిల్ల’తోనే ఈ సినిమాకు బీభత్సమైన ప్రమోషన్ వచ్చేసింది. దాదాపు 90 శాతం పబ్లిసిటీ జరిగిపోయింది. ఇక ఇది చాలదన్నట్టుగా 50 మిలియన్ యూట్యూబ్ వ్యూస్‌కి దగ్గరలో ఉంది. ఇదంతా పక్కనబెడితే.. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి విడుదల చేస్తామని చెప్పిన ‘విశ్వంభర’ మాటేంటి? వచ్చే ఏడాది సంక్రాంతికి సైతం విడుదల చేస్తామని గట్టిగా చెప్పట్లేదేం?

అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను మొదలెట్టడానికి ముందు నుంచే ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు పీఆర్ఓల అవసరం కూడా లేదు. అంతలా సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ను వదిలారు. ఇప్పుడు టాక్ ఏంటంటే.. కలెక్షన్స్ విషయంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ బీట్ చేస్తుందా? లేదా? అనేదే. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కేమియో రోల్ చేస్తున్నారు. ఇక చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఇదే చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. కేవలం ‘గేమ్ చేంజర్’ కోసం వాయిదా వేసుకుంది. ఆ తరువాత అయినా విడుదలైందా? అంటే లేదు.

కన్నుబొమ్మ ఎవరిది?

అసలు విశ్వంభర ఊసేఎక్కడా వినిపించడం లేదు. అసలు ఏమైనట్టు? సినిమా నడుస్తోందా? లేదా? ఈ సినిమా టీజర్ ఏడాది క్రితం విడుదలైంది. తిరిగి ఆగస్ట్ 21న గ్లింప్స్ వచ్చాయి. అంతే అంతకు మించి అప్‌డేటే లేదు. మరి ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ సంగతేమో కానీ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు? ఎందుకింత ఆలస్యమవుతోంది? అసలేం జరుగుతోంది. వాస్తవానికి గ్లింప్స్ వచ్చేసి ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలను మిగిల్చింది. కన్నుబొమ్మ ఎవరిది? దాని వెనుకున్న స్టోరీ ఏంటంటూ చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఇది చాలదన్నట్టుగా సినిమాను మెగాస్టార్ నటించిన ‘అంజి’తో కంపేర్ చేస్తూ చాలా కథనాలు వచ్చాయి. బీభత్సమైన ప్రచారం జరిగింది. తీరా చూస్తే.. సినిమా కూడా ‘అంజి’ టాకే తెచ్చుకుంటుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

రిజల్ట్ విషయంలో పోలిక వద్దు..

ఇప్పటివరకూ ‘విశ్వంభర’ ఊసే లేదు. ఎందుకు ఆ చిత్రాన్ని అలా వదిలేశారో తెలియకుండా ఉంది. చిరు సైతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ మాయలో పడినట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమా తప్ప మరో ఊసే లేదు. ‘అంజి’ చిత్రం మాదిరిగానే ‘విశ్వంభర’ కూడా సోషియో-ఫాంటసీ చిత్రం. అంతేకాకుండా ‘అంజి’ రూపొందేందుకు ఆరేళ్ల సమయం పట్టింది. అంతేకాకుండా ‘అంజి’లో దాదాపుగా ఒకే షర్ట్‌తో సినిమా మొత్తాన్ని చిరు లాగించేశారు. ‘విశ్వంభర’ విషయంలోనూ అదే జరుగుతోందన్న టాక్ నడుస్తోంది. అలాగే ‘అంజి’ చాలా సార్లు వాయిదా పడింది. ‘విశ్వంభర’ది అదే పరిస్థితి. మొత్తానికి ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ కోసం తెగ కష్టపడుతున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ కష్టం ఎంతకాలం పడతారో చూడాలి. అంజితో ఎన్ని పోలికలున్నా కూడా రిజల్ట్ విషయంలో పోలిక లేకుంటే చాలు. ఈలోగా చిరు ‘మన శంకర వరప్రసాద్ గారు’గా ప్రేక్షకులను పలకరించి.. ఆపై మరో సినిమాతో కూడా సందడి చేసే అవకాశమైతే లేకపోలేదు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 4, 2025 9:30 AM