Entertainment

Decoit Review: మనసును దోచేసిన ప్రేమ జంట కథ

రోమియో-జూలియట్, సలీం-అనార్కలి, దేవదాస్-పారు ఇలా చరిత్రలో నిలిచిన ప్రేమకథలు చాలానే ఉన్నాయి. ఇకముందు అంతటి ప్రేమకథ రాదేమో అని చాలాసార్లు చాలా మందికి అనిపించే ఉంటుంది. కానీ ‘డెకాయిట్’ చూస్తే ఆ అభిప్రాయం మారుతుందా?

Decoit Review: మనసును దోచేసిన ప్రేమ జంట కథ

చిత్రం: డెకాయిట్

విడుదల: 10-04-2026

నటీనటులు: అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ని, కామాక్షి భాస్కర్ల

దర్శకుడు: షనీల్ డియో

స్టోరీ, స్క్రీన్‌ప్లే: అడివిశేష్, షనీల్ డియో

మ్యూజిక్ డైరెక్టర్: భీమ్స్ సిసిరోలియో

‘ప్రేమకు అర్థం ఏదంటే.. నిన్నూ నన్నూ చూపిస్తా’ అంటూ ఓ పాటలో లిరిక్స్ ఉంటాయి. నిజమే.. ప్రేమకు అర్థం ఏదంటే.. ఓ పాలరాతి సమాధినే ఎందుకు చూపించాలి? అంతకు మించిన ప్రేమ లేదా? అంటే అంతటి భారీ కట్టడం కట్టే స్తోమత లేకపోవచ్చు కానీ తమ ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని వారిది ప్రేమ కాదా? రోమియో-జూలియట్, సలీం-అనార్కలి, దేవదాస్-పారు ఇలా చరిత్రలో నిలిచిన ప్రేమకథలు చాలానే ఉన్నాయి. ఇకముందు అంతటి ప్రేమకథ రాదేమో అని చాలాసార్లు చాలా మందికి అనిపించే ఉంటుంది. కానీ ‘డెకాయిట్’ చూస్తే ఆ అభిప్రాయం మారుతుందా? ఈ ప్రేమకథ మనసుల్ని గెలిచిందా? చూద్దాం.

కథేంటంటే..

‘డెకాయిట్’ అని టైటిల్ పెట్టి.. ‘ఒక ప్రేమ కథ’ అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చి సినిమా జానర్ ఏంటనేది మేకర్స్ ముందుగానే చెప్పేశారు. ప్రేమకథలకు కాలం చెల్లిపోయిందనుకుంటున్న తరుణంలో హరి (అడివి శేష్), సరస్వతి (మృణాల్ ఠాకూర్) జంట తమ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న తరుణంలో విషయం తెలుసుకున్న సరస్వతి సోదరుడు వారి ప్రేమకు అండగా నిలిచిన మల్లి (కామాక్షి భాస్కర్ల)పై తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేయబోతాడు. హరి వచ్చి సరస్వతి సోదరుడిని చంపేసి జైలు పాలవుతాడు. హరియే మల్లిపై అత్యాచారం చేయబోయాడని.. అడ్డొచ్చిన తన సోదరుడిని చంపేశాడంటూ సరస్వతి పోలీసులకు చెబుతుంది. కట్ చేస్తే సరస్వతి తన సోదరుడి స్నేహితుడైన భాస్కర్‌ను పెళ్లాడుతుంది. హరి జైలు నుంచి తప్పించుకుని వస్తాడు. సరస్వతిపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆ తరువాత డబ్బు కోసం హరి డెకాయిట్‌గా మారతాడు. అనుకోని పరిస్థితుల్లో సరస్వతి కూడా హరికి తోడుగా దొంగతనాల్లో భాగస్వామి అవుతుంది. అసలు సరస్వతికి దొంగతనాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వారిద్దరి జీవితం ఎలాంటి మలుపు తీసుకుందనేది వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

అడివి శేష్ సినిమాలు ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి మరీ చూసేలా చేయగలిగే సత్తా ఉన్న హీరో. ఈ సినిమాలో కూడా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. తొలి అర్థ భాగమంతా.. హరి, సరస్వతిల లవ్ స్టోరీ.. ఆ తరువాత హరి జైలుకు వెళ్లడం.. బయటకు రావడం.. డెకాయిట్‌లా మారడం వంటి అంశాలతో రూపొందించిన దర్శకుడు షనీల్ డియో.. సెకండాఫ్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు. ప్రేమకథకు యాక్షన్‌తో పాటు ట్విస్ట్‌లను జోడించి క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో సక్సెస్ అయ్యారు. అడివి శేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేమకథలో భాగంగా యాక్షన్ ఉంటుందని.. యాక్షన్‌ను థియేటర్‌లో వదిలేసి.. ప్రేమకథను మాత్రం ఇంటికి తీసుకెళతారని చెప్పాడు. అక్షరాలా అదే జరుగుతుంది. మనసును బాగా మెల్ట్ చేసి మరీ పంపిస్తాడు. సినిమాలో కొన్ని మైనస్‌లు ఉన్నా కూడా అందమైన, అద్భుతమైన ప్రేమకథ ముందు చిన్నవై పోయాయి. సినిమా ఎండింగ్‌లో ప్రతి ఒక్కరి హృదయం తడవుతుంది.

ఎవరెలా చేశారంటే..

హీరో హీరోయిన్లు అయిన అడివిశేష్, మృణాల్ ఠాకూర్ తమ పాత్రల్లో జీవించారు. నిజంగా ఒక ప్రేమజంటను చూస్తున్నట్టుగానే ఉంటుంది తప్ప ఏదో రీల్ జంటను చూస్తున్న ఫీలింగ్ ఎక్కడా కలగదు. ఇక అనురాగ్ కశ్యప్ గురించి చెప్పేదేముంది? అద్భుతంగా నటించారు. ప్రకాశ్ రాజ్, సునీల్, కామాక్షి భాస్కర్ల తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కని నటన కనబరిచారు.

టెక్నికల్ పరంగా..

స్క్రీన్‌ప్లే, స్టోరీలో అడివి శేష్ భాగమయ్యాడంటే.. గ్రిప్పింగ్‌గానే ఉంటుంది. ముఖ్యంగా ట్విస్ట్‌లను అద్భుతంగా మలచడంలో అతనికి అతనే సాటి. షనీల్ సినిమాను మలిచిన తీరు చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవల్సింది సుప్రియ యార్లగడ్డ గురించి.. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఇక భీమ్స్ అందించిన సంగీతం సినిమాకు చాలా హైప్ ఇచ్చింది. పాటలు సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఇప్పటికే అల్లాడిస్తున్నాయి.

మొత్తంగా.. ‘డెకాయిట్’ ప్రతి ఒక్కరి మనసును దోచే అందమైన ప్రేమకథ.

రేటింగ్: 3.5/5

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 9, 2026 6:51 PM