Harinath Policherla: అమెరికాలో డాక్టర్.. ఇండియాలో యాక్టర్.. 12న రానున్న ‘నా తెలుగోడు’
డాలర్ల వెంట పరుగు ఆయనకు సంతృప్తినివ్వలేదు. చిన్నప్పుడు ఎప్పుడో వేసిన నాటకం.. దానికి పొందిన ప్రశంసలు.. కొట్టిన చప్పట్లు ఇచ్చిన ఆనందం ముందు అన్ని దిగదుడుపుగానే అనిపించాయి.
ఎంత డబ్బు.. పేరు, ప్రతిష్టలు ఏముంటే ఏమి? మనసుకి సంతృప్తిని ఇవ్వనప్పుడు? హరినాథ్ పొలిచర్ల (Harinath Policharla) విషయంలో అదే జరిగింది. తల్లిదండ్రులిద్దరూ ప్రముఖ వైద్యులే కావడంతో ఆయన కూడా వారి బాటలోనే నడిచి వైద్యుడయ్యారు. అమెరికాలో న్యూరోఫిజియాలజీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. డాలర్ల వెంట పరుగు, మంచి వైద్యుడిగా పేరు ప్రతిష్టలు ఆయనకు సంతృప్తినివ్వలేదు. చిన్నప్పుడు ఎప్పుడో వేసిన నాటకం.. దానికి పొందిన ప్రశంసలు.. కొట్టిన చప్పట్లు ఇచ్చిన ఆనందం ముందు అన్ని దిగదుడుపుగానే అనిపించాయి. అందుకే తన డాక్టర్ వృత్తి నుంచి కొన్ని గంటలు.. తన ఆత్మ సంతృప్తి కోసం వినియోగించుకోవడం ప్రారంభించారు. అలా తన సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 15 చిత్రాల్లో నటించారు.
ఇక ఇప్పుడు హరినాథ్ హీరోగా.. నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో ‘నా తెలుగోడు’ (Na Telugodu)చిత్రం రూపొందింది. సొంత బ్యానర్ డ్రీం టీం ప్రొడక్షన్స్‌పై హరినాథ్ పోలిచర్ల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హరినాథ్ మీడియాకు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘నా తెలుగోడు చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తైందని వెల్లడించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుందని.. సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చిందని వెల్లడించారు.
ముఖ్యంగా మూడు విభిన్న అంశాలను తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు హరినాథ్ వెల్లడించారు. సమాజానికి ఉపయోగపడే ఈ మూడు అంశాలతో ఒక మెసేజ్ కూడా ఇవ్వనున్నట్టు వెల్లడంచారు. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడు, గర్ల్ ట్రాఫికింగ్ నుంచి వారిని కాపాడటం.. డ్రగ్స్ కారణంగా సదరు వ్యక్తి, అతని కుటుంబం, సమాజం పడే ఇబ్బందులత పాటు తల్లి సెంటిమెంటును ఈ చిత్రంలో చూపించినట్టుగా వెల్లడించారు. సినిమాల విషయానికి వస్తే.. నందమూరి తారక రామారావు అంటే ఆయనకు అమితమైన అభిమానమని వెల్లడించారు. ఆయన కారణంగా తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని.. ఆయనే తనకు స్ఫూర్తి అని హరినాథ్ తెలిపారు.
అన్నగారి సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని హరినాథ్ వెల్లడించారు. ‘నా తెలుగోడు’ అనే టైటిల్ పెట్టడం గర్వంగా ఉందన్నారు. సినిమాలో యుద్ధ నేపథ్యంలో కొన్ని సీన్స్ ఉంటాయని.. గోవా, మున్నార్, హైదరాబాద్ ఇంకా మరికొన్ని ప్రాంతాలలో ఈ సినిమాను చిత్రీకరించడం జరిగిందన్నారు. సినిమాలో తను సైనికుడిగా నటించినట్టు వెల్లడించారు. చిన్న పిల్లల్ని డ్రగ్స్ రవాణా కోసం ఉపయోగించుకుంటున్నారని... అది అసాంఘిక కార్యక్రమమని.. వాటిని అరికట్టే ఉద్దేశంతో ఈ సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయన్నారు. తనకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేదని వెల్లడించారు. అమెరికాలో అన్నగారి గురించి ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు అక్కడే ఉన్న బాలకృష్ణ తనను మెచ్చుకున్నారన్నారు.
ఈ సినిమాను హిందీలో ‘ఆర్‌కే’ పేరిట విడుదల చేయనున్నట్టు హరినాథ్ వెల్లడించారు. సినిమాలో ఐదు పాటలుంటాయన్నారు. తను నటించిన ప్రతి సినిమా.. మరొక సినిమా నుంచి భిన్నంగా ఉంటుందన్నారు. తనికెళ్ళ భరణి (Tanikella Bharani), రఘు బాబు (Raghu Babu), జరీనా వహాబ్ (Zarina Wahab) వంటివారు నటించడం సినిమాకు బలంగా మారిందని.. మల్లి సినిమాకు చాలా అందమైన విజువల్స్ అందించారన్నారు. తన నట జీవితంలో తనకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు రావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. అమెరికాలో కూడా ఈ చిత్రాన్ని చూపించడం ఆనందంగా అనిపిస్తోందన్నారు. అలాగే తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మరినాథ్ వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల