Entertainment

‘విశ్వంభర’, ‘మన శివశంకర వరప్రసాద్ గారు’లలో గ్లింప్స్ ఏది బాగుంది?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే అంటే చిరు పుట్టినరోజుకు ఒకరోజు ముందే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది.

‘విశ్వంభర’, ‘మన శివశంకర వరప్రసాద్ గారు’లలో గ్లింప్స్ ఏది బాగుంది?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే అంటే చిరు పుట్టినరోజుకు ఒకరోజు ముందే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆ తరువాత తదుపరి రోజే అంటే ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి గ్లింప్స్ కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు చిత్రాలలో ఏ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయంటే నిస్సందేహంగా ‘మన శివశంకర వరప్రసాద్ గారు’ అని చెబుతున్నారు ఫ్యాన్స్. అలా అని ‘విశ్వంభర’ను తక్కువగా చూడటానికి లేదు. కానీ కంపేర్ చేస్తే మాత్రం ‘మెగా 157’కే ఫ్యాన్స్ ఓటేస్తున్నారు. చిరుని దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యాన్స్‌కు ఆకట్టుకునేలా చూపించారు. చిరు చాలా స్టైలిష్‌గా ఉన్నారు. టైటిల్ కూడా చాలా క్రేజీగా ఉంది. ఇక ‘విశ్వంభర’ గ్లింప్స్ వచ్చేసి చిరు యాక్షన్ సన్నివేశానికి సంబంధించినది.

రెండూ సోషియో ఫాంటసీ చిత్రాలే..

ఇక ‘విశ్వంభర’ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదేంటంటే విశ్వంభర మరో అంజి కానుందని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. రెండు చిత్రాలూ సోషియో ఫాంటసీ చిత్రాలే. రెండు చిత్రాల్లో అనుకున్న సమయానికి ఏదీ విడుదల కాలేదు. పలుమార్లు వాయిదా పడిన మీదటే ‘అంజి’ కూడా విడుదలైంది. ‘విశ్వంభర’ కూడా పలుమార్లు వాయిదా పడిన మీదట చివరకు 2026 వేసవికి విడుదల చేస్తామని ప్రకటించారు. మరి అప్పటికైనా విడుదల అవుతుందో.. తిరిగి తూచ్ అంటారో చూడాలి. ఇక ‘అంజి’ విషయానికి వస్తే చిరు కెరీర్‌లో అత్యధిక విడుదల తేదీలు మార్చుకున్న సినిమా. ఈ సినిమా ఆరేళ్ల పాటు నిర్మాణంలో ఉండి నానా తిప్పలు పడి చివరకు 2004లో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమవడానికి కూడా గ్రాఫిక్సే కారణం. ఈ సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు.

మండిపడిన ఫ్యాన్స్..

ప్రస్తుతం ‘విశ్వంభర’ ఆలస్యానికి కూడా వీఎఫ్ఎక్స్ ఆలస్యమవడమే కారణం. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే కారణంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. గత ఏడాది టీజర్ విడుదల చేశారు. ఆ వెంటనే లిరికల్ సాంగ్‌ను సైతం మేకర్స్ వదిలారు. ఇవి రెండూ కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. పైగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ అయితే మండిపడ్డారు. దీంతో విడుదలను వాయిదా వేసింది. అప్‌డేట్‌ను సైతం వదలలేదు. ముఖ్యంగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మీదనే మేకర్స్ ఎక్కువగా దృష్టి సారించారు. ‘అంజి’ పలుమార్లు పురిటి నొప్పులు పడి చివరకు విడుదలైనా కూడా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. మరి ‘విశ్వంభర’ పరిస్థితేంటనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి టీజర్ చేసిన డ్యామేజ్ కారణంగా ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా మారింది. గ్లింప్స్ చూస్తేనేమో.. గ్రాఫిక్స్ అంతా చాలా బాగున్నాయి. బీజీఎంకు కూడా మంచి మార్కులే పడుతున్నాయి. మరి చూడాలి ఇక ఏం జరుగుతుందో..

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 23, 2025 9:08 AM